calender_icon.png 24 December, 2024 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రత్యర్థి బలవంతుడైతే?

06-11-2024 12:27:03 AM

సంధి విగ్రహయోః తుల్యాయాం 

వృద్ధౌ సంధి ముపేయాత్

విగ్రహే హి క్షయవ్యయ 

ప్రవాస ప్రత్యవాయా భవంతి!

 అర్థశాస్త్రం (చాణక్య 7

“నాయకుడు ప్రత్యర్థితో సంధి చేసుకున్నా, విరోధం కొనసాగించినా ‘తన అభివృద్ధి సమానంగానే ఉంటుందని’ అనుకున్నప్పుడు సంధియే చేసుకోవాలి. విరోధం పెట్టుకుంటే క్షయం, వ్యయం, స్వస్థానం విడిచి వెళ్ళే పరిస్థితి రావచ్చు. ఇంకా ఇతరత్రా ఆపదలు కలగడానికీ అవకాశాలు ఉంటాయి” అంటారు చాణక్య. 

యుద్ధానికన్నా శాంతి ఉత్తమమైందే. అయినా విజయాన్ని ఆశించే నాయకుడు శాంతి సమయాలలో కూడా యుద్ధానికి అవసరమైన సకల ఏర్పాట్లు చేసుకుంటూ, అనుక్షణమూ సర్వ సన్నద్ధంగా, అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే యుద్ధంలో విజయాన్ని సాధిస్తాడు. ఏ సమయంలోనైనా, ఏదైనా ఆపద, ఏ వైపు నుండైనా ఎదురుకావచ్చు. చిన్న ప్రమత్తత ప్రాణాపాయానికి దారి తీయవచ్చు. సకలమూ కోల్పోవడానికి కారణం కావచ్చు. అందుకే అప్రమత్తత, సర్వసన్నద్ధతయే ఆదరణీయ విజయ సూత్రం. ‘ఆపద వచ్చినప్పుడు చూద్ధాం లే’ అనుకోవడమంటే, అపజయాన్ని ఆహ్వానించినట్లే. అలాగని, ప్రతి చిన్న విషయానికీ కయ్యానికి కాలు దువ్వడమూ సమంజసం కాదు.

యుద్ధమనేది ప్రక్రియ ఆధారంగా జరిగేది కాదు. అది ఫలితం ఆధారంగా జరిగేది. యుద్ధమనేది విలువైన మానవ వనరుల నష్టానికి, ఆస్తి నష్టానికి, ఆర్థిక వనరుల క్షయానికి, అనవసరమైన ప్రయాసకు, స్వస్థలాన్ని విడిచి వెళ్ళవలసి రావడానికి కారణం కావచ్చు. అందువల్ల వీలైన మేరకు సంధి చేసుకోవడం వల్ల శాంతి నిలుస్తుంది. శాంతివల్ల అభ్యుదయం కలుగుతుంది. యుద్ధమనేది రాజ్యాల మధ్యనే కాకుండా వ్యాపార రంగంలోనూ, సంస్థల మధ్య ఆధిపత్యానికై కూడా జరగవచ్చు. వాటికి ఆయుధాలుగా వ్యూహ ప్రతివ్యూహాలు, మానవ మేధ, కోర్టులు లాంటివి ఉంటాయి. శాంతికై చేసే ప్రయత్నం ఒకవైపు నుండి మాత్రమే జరిగితే ఫలితం ఉండదు. ఇతరుల సహకారం తీసుకోవడం, ఇతరులతో సమన్వయం, పరస్పరం సహకరించుకోవడం.. వంటి వాటి ఆధారంగా నడిచే సంస్థలు అద్భుత ఫలితాలను సాధిస్తాయి. ‘పది సంవత్సరాల కాలంలో నిర్మితమైన అభ్యుదయం ఒకరోజు యుద్ధంలో నష్టపోతుందనేది’ సామెత. అందువల్ల అన్ని సమయాలలోనూ వీలైన మేరకు శాంతిని నెలకొల్పడమే సమర్థనీయం, అభిలషణీయం కావాలి. అది కుదరని పరిస్థితులలోనే యుద్ధానికి సిద్ధం కావాలి. అయితే దానికి ముందుగా అసలా స్పర్ధ అవసరమా? స్పర్ధతో సాధించేది ఎంత? నష్టపోయేది ఎంత? దీనిని కచ్చితంగా బేరీజు వేసుకోగలిగిన నాయకుడే సంధి చేసుకోవాలా లేక విరోధం కొనసాగించాలా అన్నది నిర్ణయించుకో గలుగుతాడు. ఆ మేరకు ఆశించిన ఫలితాన్ని సాధించగలడు. యుద్ధంలో గెలిచి సాధించేదాని కన్నా సంధితో సాధించేది హెచ్చుగా ఉన్నా లేదా సమానమైనా యుద్ధాన్ని నివారించడమే మేలు. దానివల్ల అత్యంత విలువైన మానవ వనరులు కాపాడుకోగలం. సమయమూ ఆదా అవుతుంది. యుద్ధంలో వెచ్చించే శక్తి సామర్థ్యాలను మరొక మఖ్యమైన దానిపై కేంద్రీకరిస్తే అదే సమయంలో ఉత్పాదకతను పెంచుకోవచ్చు. 

శక్తి సామర్థ్యాలు, వనరులపైనే ఆధారం

ఒక్కోసారి యుద్ధం అనివార్యమూ కావచ్చు. యుద్ధం వల్ల ఉత్తమ ఫలితాలను సాధించే అవకాశాలనూ త్రోసి పుచ్చలేం. అయితే యుద్ధం అవసరమా? దానివల్ల వచ్చే ఫలితం ఎంత? దేనికోసం యుద్ధం చేస్తున్నాం? గెలిస్తే మనకేమి వస్తుంది? ఫలితం సంస్థ పురోగతికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? బృందం ఏం సాధిస్తుంది? యుద్దం లేకుండా సంస్థ ఎదుగుదల సాధ్యపడదా?.. ఇలాంటి వాటి దిశగా లోతైన విచారణ జరిపి, అనివార్యం అయితేనే యుద్ధాన్ని ఆరంభించాలి. తప్పనిసరి అయిన యుద్ధంలో గెలవాలంటే వనరులు ఎంత ముఖ్యమో సమయమూ అంతే ప్రధానం. శత్రువుకన్నా పదింతల శక్తివంతమైన వనరులు ఉన్నప్పుడు వెంటనే ప్రత్యర్థిని చుట్టుముట్టాలి. అయిదింతల వనరులు ఉంటే దాడి చేయాలి. శత్రువుకన్నా రెండింతల బలం కలిగి వున్నప్పుడు విభజించండి. బలం సమానమైన సమయంలో పోరాడాలి. కొద్దిగా తక్కువగా ఉంటే యుక్తితో జయించే ప్రయత్నం చేయాలి. “బాగా తక్కువగా ఉంటే యుద్ధాన్ని నివారించండి” అంటాడు చైనా యుద్ధ వ్యూహ నిపుణుడు సన్‌ట్జ్ తన ‘ఆర్ట్ ఆఫ్ వార్’ అనే పుస్తకంలో.

“సమయం అనుకూలించకపోతే ఎంత శిక్షణ పొంది న బృందమైనా, శక్తిసామర్థ్యాలు వనరులు వున్నప్పటికీ విజయం సాధింపలేకపోవచ్చు. సరైన సమయంలో, సరైన విధానంలో, సరైన నిర్ణయం తీసుకోవడమే గెలుపు మంత్రంగా భావించాలి. అయితే, ‘యుద్ధమా? సంధియా?’ అనే సందేహం వచ్చినప్పుడు ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసుకోవ డమే సమర్థత. ఎప్పు డు దాడి చేయాలో తెలియడమే ధైర్యం. కాగా, ఈ రెంటి మధ్య భేదం ఏమిటో తెలుసుకోవడమే విచక్షణ లేదా విజ్ఞత” అంటారు ఆచార్య చాణక్య. ‘బలం చాలనప్పుడు బలవంతుడిని ఆశ్రయించడమే ఉత్తమం’ అన్నది చాణక్య బోధ.