08-04-2025 01:31:09 AM
హైదరాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): ‘తాలిబాన్లు పాగా వేసిన అప్ఘనిస్థాన్‌లోనైనా పని చేయవచ్చే మో గానీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంట్రాక్టర్లు పనులు చేయించడం చాలా కష్టం. మన తెలుగు బిల్డర్ బొల్లినేని శీనయ్య అఫ్ఘనిస్థాన్ పార్లమెంట్ సెక్రటేరియేట్ కట్టించారు. ఆయన అక్కడ కూడా ఎలాంటి సమస్యలు ఎదుర్కోలేదు. సకాలంలో ప్రభుత్వం నుంచి బిల్లులు అందుకుని వచ్చేశారు.
ఏపీ, తెలంగాణలో మాత్రం ఏళ్ల తరబడి బిల్లులు పెండింగ్‌లోనే ఉంటు న్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మేం పనులు ముందుకు సాగించలేం. పనులన్నింటినీ ఎక్కడికక్కడ ఆపేస్తాం. అందుకు సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నాం’ అని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) మాజీ చైర్మన్ ఎస్‌ఎన్ రెడ్డి స్పష్టం చేశారు.
బీఏఐ తెలంగాణ నూతన కమిటీ, సెంట్రల్ కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా సోమవారం కొండాపూర్‌లోని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ కల్చరల్ సెంటర్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రూ.కోటి విలువైన బిల్లల నుంచి రూ.5 వేల కోట్ల విలువైన బిల్లుల వరకు పెండింగ్‌లో ఉన్నాయని, గత ప్రభుత్వంలో ఇదే పరిస్థితి, ప్రస్తుత ప్రభుత్వంలోనూ అదే పరిస్థితి నెలకొన్నదని వాపోయారు.
బిల్లులు చెల్లించకుండానే సర్కార్ పనులు చేయించమని ఆదేశిస్తున్నదని అభ్యంతరం వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించకుండా తాము పనులెలా చేపడతామని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికే పనుల కోసం స్థిర, చరాస్తులు అమ్మేశామని, నగలు తాకట్టు పెట్టామని, వడ్డీలకు వడ్డీలు అప్పులు తెచ్చి పనులు చేపట్టామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి పరిస్థితిలో ఉన్న కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని బెదిరింపులకు పాల్పడడం దారుణమని వాపోయారు. కార్పొరేట్ కాంట్రాక్టర్లకు తాము వ్యతిరేకం కాదని, వారు చిన్న కాంట్రాక్టర్లను బాధ పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో బీఏఐ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్, సీడీఐ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణలో పనులు ఆపేస్తాం..
రాష్ట్రప్రభుత్వం కాంట్రాక్టర్లకు సక్రమంగా బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ముందుకు సాగించలేకపోతున్నాం. రూ.వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయ్. గత ప్రభుత్వంలో అదే జరిగింది. ఈ ప్రభుత్వంలోనూ ఇదే జరుగుతున్నది. దీంతో పనులన్నింటినీ నిలిపివేయాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ శాఖ నిర్ణయించింది. మాకింక వేరే దారి లేదు.
సల్లా శ్రీనివాస్ రావు,
బీఏఐ హైదరాబాద్ సెంటర్ చైర్మన్
రాష్ట్రప్రభుత్వం నుంచి స్పందన లేదు..
తెలంగాణవ్యాప్తంగా కాంట్రాక్టర్స్ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మా సమస్యలను రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. పలువురు మంత్రులకు విన్నవించాం. అయినప్పటికీ సర్కార్ నుంచి ఎలాంటి స్పందన లేదు. మోరి పనుల నుంచి డ్యాం పనుల వరకు.. వేటినీ ముందుకు సాగించే పరిస్థితి లేదు. సర్కార్ రూ.2 కోట్ల వరకు ఉన్న బిల్లులను విడుదల చేస్తామని హామీ ఇచ్చిది. కానీ.. దానిని నిలబెట్టుకోవడంలో మాత్రం విఫలమైంది. దీంతో మేమంతా గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మను కలిసి మా సమస్యలు విన్నవించాలని నిర్ణయించాం.
డీవీఎన్ రెడ్డి, బీఏఐ జాతీయ వైస్ ప్రెసిడెంట్
గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం..
ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగులో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులన్నింటినీ చెల్లించాలి. ప్రస్తుతం మేం మా కార్యాలయాల్లో పనిచేస్తే సిబ్బందికైనా జీతాలిచ్చే పరిస్థితిలో లేం. త్వరలో వారు నిరవధిక దీక్షలు చేస్తారేమోనని చూస్తున్నాం. కార్మికులు దీక్ష చేస్తేనైనా మా బాధలు సర్కార్‌కు అర్థమవుతాయేమోనని కోరుకుంటున్నాం. ప్రతి ప్రభుత్వం తన పేరిట చేసే కాంట్రాక్ట్‌లను గవర్నర్ పేరిటే చేస్తుందని మాకు తెలిసింది. అందుకే మేం త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్లను కలిసి కాంట్రాక్టర్ల సమస్యలను వివరిస్తాం.
బొల్లినేని శీనయ్య, బీఏఐ మాజీ చైర్మన్