- తరచుగా అస్వస్థతకు గురవుతున్న విద్యార్థులు
- కలుషిత నీరు, అపరిశుభ్ర వాతావరణమే కారణం
వికారాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): గురుకులాలు అనగానే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు, పౌష్టికాహారం అందుతాయనే ప్రచారం ఉంది. మిగతా వసతి గృహాలతో పోల్చుకుంటే గురుకులాల్లో అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. గురుకులాల్లో చదివే విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో గాని, కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురవడం చాలా అరుదు. ప్రభుత్వ జనరల్ వసతి గృహాల్లో ఇలాంటివి తరచుగా చోటుచేసుకునేవి.
అయితే, ఈ ఏడాది గురకులాలకు ఏమైందో కాని జనరల్ వసతి గృహాల కంటే అధ్వానంగా తయారయ్యాయి. ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభమైన నాటి నుంచి వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ గురుకులాల్లో ఎక్కడో ఒకచోట విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో, కలుషిత నీటితో అస్వస్థతకు గురవుతున్నారు. ఒకే గురుకుల పాఠశాలలో రెండు మూడు సార్లు విద్యార్థులు అస్వస్థతకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
అస్వస్థతకు గురి..
ఈ ఏడాది గురుకులాలు ప్రారంభమైన నాటి నుంచి తరచుగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. జూన్ 28న పరిగి నియోజకవర్గంలోని నస్కల్ కేజీబీవీలో ఏకంగా 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారందరికి పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు రోజుల పాటు చికిత్స అందించాల్సి వచ్చింది. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరిపల్లి బాలుర సోషల్ వెల్ఫేర్‌లో విద్యార్థులు తరచుగా జ్వరాల బారిన పడుతున్నారు. ఇదే పాఠశాలకు చెందిన 30 మంది విద్యార్థులు జూలై మొదటి వారంలో అస్వస్థతకు గురికావడంతో అదే రోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కలెక్టర్ ప్రతీక్ జైన్ నేరుగా వసతి గృహాన్ని సందర్శించి పరిసరాలను పరిశీలించారు.
రాత్రిపూట విద్యార్థులతో కలిసి భోజనం కూడా చేశారు. అయినా అక్కడి పరిస్థితులు మారలేదు. రెండు రోజుల క్రితం నలుగురు విద్యార్థులకు జాండీస్ వచ్చినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అక్కడ కలుషిత నీటితో పాటు నాణ్యమైన ఆహారం అందించకపోవడంతోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలోని మోమిన్‌పేట్ బాలికల సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో ఏకంగా 20 మంది విద్యార్థినులు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. వీరందరికి ప్రస్తుతం వికారాబాద్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. జూలైలో తాండూరులోని బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
అపరిశుభ్రతతోనే..
అనంతగిరి పల్లి బాలుర గురుకుల పాఠశాలలో మరుగుదొడ్లు సక్రమంగా లేవు. ఉన్నవాటిని స్కావెంజర్లు సక్రమంగా శుభ్రం చేయరని విద్యార్థులు చెబుతున్నారు. అంతేకాకుండా తరగతి గదులు, వసతి గృహం గదుల గోడలు వర్షాలకు తడిసి ఒక రకమైన దుర్వాసన రావడంతో పాటు చల్లదనం ఎక్కువగా ఉంటుందని విద్యార్థులు పేర్కొంటున్నారు. తాగునీటిలో కలుషిత నీరు కలుస్తుందని, నాణ్యమైన భోజనం లేక అవస్థలు పడుతున్నట్లు వాపోతున్నారు. మోమిన్‌పేట్ మండలానికి చెందిన బాలికల గురుకుల పాఠశాల జిల్లా కేంద్రంలోని బూర్గుపల్లి వద్ద ఓ ప్రైవేట్ భవనంలో కొనసాగుతోంది.
అక్కడ భవనం భాగానే ఉన్నా డ్రైనేజీ సమస్య కారణంగా తరగతి గదుల్లో ఉన్న సమయంలో కూడా దుర్వాసన వస్తున్నట్లు విద్యార్థినులు పేర్కొంటున్నారు. మరుగుదొడ్లు శుభ్రం చేసే వారు లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న సమయంలో విద్యార్థులు మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గురుకులాలను బాగు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
మరుగుదొడ్లు శుభ్రం చేసే వారు లేరు..
బూర్గుపల్లిలోని బాలికల గురుకుల పాఠశాలలో మరుగుదొడ్లు శుభ్రం చేసే వారు లేరు. దీంతో తీవ్ర దుర్వాసనతో బాధపడుతున్నాం. నాణ్యమైన భోజనం కూడా పెట్టడం లేదు. ఇదేమిటని అడిగితే బెదిరిస్తారు. నాలుగు రోజులుగా జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతున్నాం.
మయూరి, 10వ తరగతి,
బాలికల రెసిడెన్షియల్, మోమిన్‌పేట్
పట్టించుకోవడం లేదు..
ఈ ఏడాది స్కూల్ ప్రారంభమైన నాటి నుంచి మా స్కూల్‌లో ఏదో ఒక సమస్య తలెత్తుతోంది. మరుగుదొడ్లు శుభ్రం చేయడం లేదు. తాగునీటి పైపులైన్‌లో వర్షం నీరు కలుస్తోంది. ఈ విషయం తెలిసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. భోజనం కూడా నాణ్యతగా ఉండడం లేదు. ఏది పెడితే అదే తినాల్సి వస్తోంది.
శివశరణ్, 9వ తరగతి అనంతగిరిపల్లి