calender_icon.png 21 September, 2024 | 3:19 AM

నృసింహుని మాస్టర్ ప్లాన్ ఏమైంది?

21-09-2024 12:42:42 AM

నిరాదరణకు గురవుతున్న నాచగిరి ఆలయం

మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినప్పటికీ ఆచరణ లేదు..

రాష్ట్రప్రభుత్వం ప్లాన్ అమలు చేయాలని భక్తుల డిమాండ్

గజ్వేల్, సెప్టెంబర్ ౨౦: సిద్దిపేట జిల్లా నాచగిరి లక్ష్మీనారసింహస్వామి క్షేత్రం భక్తుల పాలిట కొంగు బంగారం. తెలంగాణ రెండో యాదాద్రిగా ఈ క్షేత్రానికి పేరున్నది. ప్రతి శని, ఆదివారాల్లో భక్తుల క్షేత్రానికి తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఏటా ఉగాదికి ముందు స్వామివారి బ్రహ్మోత్సవాలు బ్రాహ్మాండంగా జరుగుతాయి. ఉత్సవాలకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచే కాక రంగారెడ్డి, హైద్రాబాద్, నల్గొండ తదితర జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలివస్తారు.

ఆలయ అభివృద్ధికి గత ప్రభుత్వం కొంత చొరవ చూపింది. యాద్రాద్రి ఆలయ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషించిన ఆనంద్‌సాయి, నాటి ప్రత్యేకా ధికారి హన్మంతరావుతో మాస్టర్ ప్లాన్ సైతం సిద్ధం చేశారు. కానీ ప్లాన్ మాత్రం క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. అలాగే క్షేత్రాన్ని ఆనుకుని ప్రవహి స్తున్న హరిద్రా నది అభివృద్ధి పనులు తక్షణం పూర్తి చేయాలని భక్తులు కోరుతు న్నారు. రూ.8.5 కోట్లతో ప్రారంభించిన ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి.

నది వద్ద భక్తులు స్వామివారికి తలనీలాలు ఇచ్చుకుంటారు. పుణ్యస్నానమాచరిస్తారు. కానీ, మహిళలు కనీసం బట్టలు మార్చుకునేందుకు కూడా సరైన వసుతులు లేవు. అలాగే గత ప్రభుత్వం నది వెంట మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేస్తామన్న హామీ కూడా గాలి మాటగానే మిగిలిపోయింది. గత పాలరకు ఎర్రవల్లి ఫాంహౌస్ సమీపంలోని వర్ధరాజ్ పూర్ వరదరాజస్వామి ఆలయాభివృద్ధికి మాత్రం రూ.10 కోట్లు కేటాయించి, లక్ష్మీనారసింహస్వామి క్షేత్రం అభివృద్ధి గురించి పట్టించుకోకపోవడం గమనార్హం.

ప్రధాన సమస్యలివీ..

నాచగిరి లక్ష్మీనారసింహుడికి 75 ఎకరాల దేవుడి మాన్యం ఉంది. ఆలయ పరిధిలో 18 దుకా ణ సముదాయాలు, 17 కాటేజీలు, 50 గదులు ఉన్నాయి. వీటి ద్వారా వచ్చే ఆదాయంతో పాటు ఆలయానికి వేలం, హుండీ కలిపి ఏటా రూ.3 కోట్ల ఆదాయం వస్తుంది. స్వామి వారి సేవలకు 17 మంది అర్చకులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారు.

కొంద రు ఆలయ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు ఎవరికి వారు పావులు కదపడమే తప్ప.. ఆలయ అభివృద్ధి గురించి వీరు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆలయం చాలావరకు దాతల విరాళాలతోనే అభివృద్ధి చెందింది తప్పితే.. దేవాదా యశాఖతో ఒనగూరిన ప్రయోజనం మాత్రం శూన్యమనే అభిప్రా యం భక్తుల నుంచి వ్యక్తమవుతున్నది. కొత్త ప్రభుత్వ మన్నా స్పందించి ఆలయ పరిధిలో మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని, భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.