- ఎన్నికల్లో కనీస పోటీ ఇవ్వలేక అవస్థలు
- వరుస పరాజయాలు ఎదురవుతున్నా మారని తీరు
- సరిదిద్దుకోకపోతే మిత్రపక్షాల్లోనూ చులకన!
న్యూఢిల్లీ, నవంబర్ 24: స్వాతంత్య్రానంతరం దేశాన్ని అప్రతిహతంగా అర్ధ శతాబ్దానికి పైగా పాలించిన కాంగ్రెస్ చరిష్మా మసకబారుతోంది. వరుస పరాజయాలు ఆ పార్టీని కోలుకోలేకుండా దెబ్బతీస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కొంతమేర పుంజుకున్నా మళ్లీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి మళ్లీ అదే పనితీరుతో మొట్టికాయలు వేయించుకుంటోంది.
మొన్నటికిమొన్న హర్యానా ఎన్నికలు సహా వరుసగా కాంగ్రెస్ పరాజయాలను ఎదుర్కొంటున్నప్పటికీ తిరిగి బలపడేందుకు ఆ పార్టీ కనీస ప్రయత్నం చేయలేదు. హర్యానాలో రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీజేపీ వైఫల్యాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ కాంగ్రెస్ విఫలమైంది.
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలను చూస్తే ఆ పార్టీ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా కాంగ్రెస్ పార్టీ 101 స్థానాల్లో బరిలోకి దిగి కేవలం 16 సీట్లనే గెలుచుకుంది. జార్ఖండ్‌లో 30 స్థానాల్లో పోటీ చేసి 16 స్థానాల్లో విజయం సాధించింది.
రాహుల్‌గాంధీ పనితీరుపై అనుమానాలు!
కాంగ్రెస్ అగ్రనేతగా రాహుల్‌గాంధీ వ్యవహరిస్తూ అన్నీ తానై పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు భారత్ జోడో యాత్రతో పార్టీలో నూతన ఉత్సాహాన్ని నింపి, గతంలో కంటే కాస్త మెరుగైన ఫలితాలను రాబట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తిరిగి పుంజుకుంటుందనీ, బీజేపీకి గట్టి పోటీ ఇస్తుందనే వాదనలు వినిపించాయి.
కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. రాహుల్ తన వ్యూహాలను అమలు చేస్తున్నా రాష్ట్రాల్లో ఆ పార్టీ మాత్రం అధికారాన్ని స్వతహాగా చేజిక్కించుకోవటం పక్కన పెడితే చెప్పుకోదగ్గ సీట్లను కూడా గెలవలేకపోతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ స్థానిక అంశాలకు ప్రాధాన్యమిస్తే కాంగ్రెస్ మాత్రం జాతీయ స్థాయి అంశాలపైనే దృష్టి పెట్టి ఓటర్లను ఆకర్షించలేకపోయింది. ఎక్కువగా కులగణన, అదానీ, అంబానీపైనే మాట్లాడింది. అది కూడా చాలా ఆలస్యంగా లేవనెత్తడంతో ప్రజల్లోకి కాంగ్రెస్ వెళ్లలేకపోయిందని విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది.
ఒకరిపై మరొకరి విమర్శలు
మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రదర్శన చూసిన ఇతర మిత్రపక్షాలు భవిష్యత్తులో పొత్తుపై సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీకి అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు అంగీకరించకపోవచ్చు. ఇన్ని సీట్లు కావాల్సిందేనని డిమాండ్ చేసేందుకు కాంగ్రెస్‌కు అవకాశం లేకుండాపోయింది.
ఈ క్రమంలోనే ఇకనైనా పార్టీ అగ్రనేతలు మేల్కొని ఓటమిపై సమీక్షించి పార్టీని బలపర్చేందుకు తగిన నిర్ణయాలు తీసుకోవడంతోపాటు వాటిని ఆచరణలో పెట్టాలని సూచిస్తున్నారు. మరోవైపు ఎంవీఏలో మిత్రపక్షాల్లో సమన్వయం, సహకారం లోపించిందనీ అందువల్లే ఎన్నికల్లో పరాజయమైనట్టు కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర్ ఆదివారం ఆరోపించారు. కూటమిలోని పార్టీలు ఒకరికొకరు సహాయం చేసుకోలేదన్నారు.
ప్రతిపక్ష హోదాకూ గండి
మహారాష్ట్రలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థాయిలో భారీ ఓటమిని కాంగ్రెస్ చవిచూసింది. గత 60 ఏళ్లలో లేని విధంగా 10 శాతం సీట్లు కూడా సాధించలేకపోయింది. మహావికాస్ అఘాడీలో ఏ పార్టీ కూడా ఆ స్థాయిలో సీట్లు సాధించలేకపోయింది.