08-04-2025 12:00:00 AM
‘మేమ్ ఫేమస్’తో పరిచయం అవుతూతనే ప్రతిభావంతుడైన నటుడు అనిపించుకున్నాడు యువ కథానాయకుడు సుమంత్ ప్రభాస్. ఇప్పుడు ఆయన మరో సరికొత్త ప్రాజెక్ట్‌తో రాబోతున్నాడు. ఎంఆర్ ప్రొడక్షన్స్ షార్ట్ ఫిల్మ్‌లతో పాపులరైన సుభాష్‌చంద్ర దర్శకుడిగా ఈ సినిమాతో బిగ్‌స్క్రీన్‌కు పరిచయం అవుతున్నారు. నిధి ప్రదీప్ కథానాయికగా అరంగేట్రం చేస్తుండగా, జగపతి బాబు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ చిత్రాన్ని కొత్త ప్రొడక్షన్ హౌస్ ‘రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్’ తన తొలి చిత్రంగా నిర్మిస్తోంది. అభినవ్‌రావు నిర్మాత కాగా, మధులిక సంచనలంక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. మేక ర్స్ సోమవారం ఈ సినిమా టైటిల్ ‘గోదారి గట్టుపైన’ను రివిల్ చేశారు. ఇది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని హిట్ పాట ద్వారా ఇప్పటికే ప్రజాదరణ పొందిన టైటిల్ కావటం విశేషం.
“ఒక చల్లని సాయంత్రం వేళ ప్రశాంతమైన గోదావరి నది ఒడ్డున మీ స్నేహితులతో కూర్చుని సమయం గడపడం ఎంత ప్రశాంతంగా ఉంటుందో.. మా సినిమా కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. రిలాక్స్‌గా, అందమైన భావోద్వేగాలతో నిండి ఉంటుంది. గోదావరి జిల్లాల వేల్పూరు, రేలంగి, భీమవరం నేపథ్యంలో సెట్ చేయబడిన స్వచ్ఛమైన చిత్రానికి ‘గోదారి గట్టుపైన’ అని పేరు పెట్టాం.
పశ్చిమ గోదావరి ప్రాంతంలోని సుందరమైన ప్రకృతి దృశ్యాలు సినిమాను గొప్ప చిత్రంగా మార్చడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి” అని చిత్ర దర్శకుడు పేర్కొన్నారు. రాజీవ్ కనకాల, లైలా, దేవిప్రసాద్, హర్షవర్ధన్, సుదర్శన్, రాజ్‌కుమార్ కాసిరెడ్డి, వివా రాఘవ్, రోహిత్‌కృష్ణ వర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి డీవోపీ: సాయి సంతోష్; సంగీతం: నాగవంశీకృష్ణ; ఎడిటర్: అనిల్‌కుమార్ పీ.