calender_icon.png 24 November, 2024 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరు నెలల్లో ఏం జరిగింది?

24-11-2024 04:31:31 AM

అసెంబ్లీ ఎన్నికల్లో ౫౦ స్థానాలకే పరిమితం

న్యూఢిల్లీ, నవంబర్ ౨౩: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి శనివారం వెలువడిన ఫలితాలు ఒకింత ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆరు నెలలకు ముందు లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లను సొంతం చేసుకున్న ఇండియా కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడింది. ౪౮ లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ ౧౩, ఉద్దవ్ ఠాక్రే పార్టీ ౯, శరద్ పవార్ పార్టీ ౮ సీట్లు గెలుపొంది ఎన్డీయే కూటమికి గట్టి దెబ్బ కొట్టింది.

అయితే శాసనసభ ఎన్నికల్లోనూ ఇదే జోరు కొనసాగుతుందని భావించిన కాంగ్రెస్ కూటమికి ప్రస్తుతం వెలవడిన ఫలితాలతో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్రలో మొత్తం ౨౮౮ అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇండియా కూటమి ౫౦ స్థానాలతో సరిపెట్టుకున్నది. మహాయుతి(ఎన్డీయే) కూటమి ౨౩౪ స్థానాలు గెలుపొంది తిరుగులేని శక్తిగా నిలిచింది.అయితే ‘మహా’ ప్రజలు ఇచ్చిన తీర్పుపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఆరు నెలల్లో ఇంత మార్పు జరిగిందా? అని చర్చించుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందిన ఇండియా కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ స్థానాలను కైవసం చేసుకోవడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. కాగా శరద్‌పవార్ ఇదివరకే రాజకీయాలకు స్వస్తి చెప్పగా.. ౨౦౨౬లో ఆయన రాజ్యసభ పదవీకాలం ముగియనున్నది. ఆ తర్వాత క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక ఉద్దవ్ ఠాక్రే పార్టీ కూడా తాజా ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. మహారాష్ట్ర ప్రజలంతా ఒక్కటై ఎన్డీయే కూటమికి పట్టం కట్టారు.




l