కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే కుంభకోణం
మెదక్ ఎంపీ రఘనందన్‌రావు
సంగారెడ్డి, నవంబర్ 22 (విజయక్రాంతి)/ జహీరాబాద్: అమెరికాలో అదానీ కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని మెదక్ ఎంపీ రఘనందన్‌రావు స్పష్టం చేశారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆరోపించిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విషయం తెలియకుండా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
తమిళనాడులోని డీఎంకే, ఏపీలోని వైసీపీ, ఒడిశాలో బీజూ జనతాదళ్ కాంగ్రెస్‌తో కలిసి ఉన్నాయని, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉందని తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు అదానీతో అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అదానీని వ్యతిరేకిస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయనతో దోస్తానా చేశారని ఆరోపిం చారు.
అబద్ధాల పునాదులపై నిర్మించే కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో నిలవలేదని తెలిపారు. దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని మూడుసార్లు తిరస్కరించినా వారికి బుద్ధిరావడం లేదన్నారు. రాహుల్ గాంధీ ఇలాగే వ్యవహరిస్తే నాలుగో సారి మోదీయే ప్రధానమంత్రి కావడం ఖాయమన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో వక్ఫ్ బిల్లు ప్రవేశపెడుతారని తెలిపారు. సమావేశంలో జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్, సంగారెడ్డి బీజేపీ అధ్యక్షురాలు గోదావరి పాల్గొన్నారు.