- మోకిల ఠాణాకు రాజ్ పాకాల.. తన అడ్వొకేట్‌తో కలిసి హాజరు
- జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ వ్యవహారంపై ప్రశ్నల వర్షం
- స్టేషన్ నుంచి ఫామ్ హౌస్‌కు తీసుకెళ్లిన పోలీసులు
- ఫామ్ హౌస్ పార్టీలో పాల్గొన్న వీఐపీలకు నోటీసులు
- రాజ్ పాకాల సెల్ ఫోన్ సీజ్ చేసిన పోలీసులు
హైదరాబాద్ సిటీబ్యూరో/రంగారెడ్డి, అక్టోబర్ 30 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ వ్యవహారంలో నమోదైన కేసులో మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది.. కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రాజ్ పాకాల బుధవారం మోకిలా పోలీసుల ముందు హాజర య్యారు. మధ్యాహ్నం 12:15కు తన అడ్వొకేట్ మయూర్‌రెడ్డితో కలిసి వచ్చారు. నార్సింగి ఏసీపీ రమణగౌడ్, సీఐలు వీరబాబు, శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో రాజ్ పాకాలను మద్యం పార్టీలో జరిగిన తతంగంపై న్యాయవాది సమక్షంలోనే విచారించారు. విచారణ పూర్తయిన తర్వాత రాజ్ పాకాల మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ.. తాను దీపావళి నేపథ్యంలో తన సంబంధీకులకు ఫ్యామిలీ పార్టీ ఇచ్చానని, కొందరు కావాలనే దాన్ని రేవ్ పార్టీగా చిత్రికరించి తన పరువు తీశారని తెలిపారు. దీనివలన తన ఫ్యామిలీ డిస్ట్రబ్ అయినట్లు చెప్పుకొచ్చారు. అయినా ఎవరికో పాజిటివ్ వస్తే నాకేంటి సంబంధమని ప్రశ్నించారు. అయినా విజయ్ మద్దూరి పోలీసులకు ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదని అన్నారు. పోలీసులు అడిగినా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాననీ, విచారణకు పూర్తిగా సహకరిస్తానని రాజ్ పాకాల వెల్లడించారు. శనివారం రాత్రి సమయంలో జన్వాడ ఫామ్‌హౌస్‌లో భారీ శబ్దాలతో పార్టీ జరుగుతుందంటూ స్థానికులు 100కు కాల్ చేసి పోలీసులకు సమా చారం అందించారు. దీంతో సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు, మోకిల పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు. పార్టీలో పాల్గొన్న మొత్తం 35 మందిని అదుపులోకి తీసుకొన్నారు. పార్టీలో మద్యం సేవించడంతో పాటు రాజ్ పాకాల స్నేహితుడు విజయ్ మద్దూరి కొకైన్ వాడినట్లు నిర్దారించి ఆయనపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. పార్టీలో విదేశీ మద్యం, అదేవిధంగా గేమింగ్ పరికరాలు పట్టుబడ్డాయి. ఇట్టి కేసు విషయంలో సోమవారం మోకిల పోలీసులు రాజ్ పాకాలకు నోటీసులు జారీ చేశారు. దీంతో రాజ్ పాకాల పోలీసు విచారణకు హాజరయ్యేందుకు రెం డు రోజులు గడువు కావాలని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు విచారణకు హాజరయ్యేందుకు రాజ్ పాకాలకు రెండు రోజుల గడువు ఇచ్చింది. గడువు సమయం పూర్తికావడంతో ఆయన విచారణకు హాజరయ్యారు. సుమారు 8 గంటల పాటు రాజ్ పాకాలను పోలీసులు సుదీర్ఘంగా విచారించి స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్నారు. రాజ్ పాకాల విచారణ నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు రానున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఇటీవల మోకిల పోలీసులు పార్టీలో పాల్గొన్న వీఐపీలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు సైతం జారీ చేసినట్లు తెలుస్తోంది. నోటీసులు అందుకున్న వారు కూడా పోలీస్ స్టేషన్ రావడంతో వారి స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. ముఖ్యంగా విజయ్ మద్దూరి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా విచారణ జరిపినట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా ఆయన వాడిన ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. అనంతరం మద్యాహ్నం 3 గంటలకు స్టేషన్‌లో విచారణను ముగించి నేరుగా జన్వాడ ఫామ్‌హౌస్‌కు రాజ్‌పాకాలను తీసుకెళ్లారు. అక్కడ పార్టీకి సంబం ధించి విషయాల గురించి ఆరా తీశారు. విచారణలో వెల్లడించిన కేసుకు సంబంధించిన ఏమైనా సాక్ష్యాధారాలు లభిస్తాయోమోనని పోలీసులు తనిఖీలు జరిపారు. పార్టీలో కొకైన్ ఆనవాళ్లు, పార్టీకి హాజరైన వీఐపీల గురించి, ప్రతి అంశంపై క్షుణ్ణంగా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. సుమారు 8 గంటల పాటు విచారణ కొనసాగింది. అనంతరం రాజ్ పాకాలకు బీఎన్‌ఎస్ 35(3) సెక్షన్ కింద నోలీసులు జారీ చేశారు. అలాగే ఈ కేసులో ఏ2గా ఉన్న విజయ్ మద్దూరి అనారోగ్య కారణాలతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నానని తన లాయర్ల ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. జన్వాడ ఫామ్ హౌస్ పార్టీపై కాంగ్రెస్, బీజేపీలు తీవ్ర విమర్శలకు దిగుతుండగా వారికి ధీటుగా బీఆర్‌ఎస్ నేతలు కుడా వరుస ప్రత్యారోపణలు చేసుకోవడంతో ఫామ్ హౌస్ పార్టీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
పార్టీలో ఖానాపూర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే?
ఫామ్ హౌస్ పార్టీలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. శనివారం అర్ధరాత్రి జన్వాడ ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీలో కేటీఆర్ స్నేహితుడు, ఖానాపూర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే పాల్గొన్నట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా జాన్సన్ నాయక్ ఫామ్‌హౌస్ వద్దకు చేరుకున్నారు. రాజ్ పాకాలతో పాటు ఫామ్‌హౌస్ లోపలికి ఆయనను మాత్రమే పోలీసులు అనుమతించారు. ఈ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారో పూర్తి సమాచారం బయటకు రావాల్సి ఉంది.
కేసు దర్యాప్తులో ఉంది: ఏసీపీ
రాజ్ పాకాల విచారణ పూర్తయ్యింది. కేసు దర్యాప్తు కొనసాగుతుంది. అవసరమయితే మరోసారి రాజ్ పాకాలను విచార ణకు పిలుస్తామని నార్సింగి ఏసీపీ రమణగౌడ్ తెలిపారు.