సినీ నటులు రంగనాథ్ గురించి తెలియని వారుండరు. కాలం చిత్రంగా నాకు ఆయనలోని వేదాంతిని పరిచియం చేసింది. రంగనాథ్ నివసిస్తున్న గాంధీనగర్‌లోనే నా చిన్నకుమారుడు ప్రణవ్ ఉండేవాడు. నేను నా కుమారుని ఇంటికి వచ్చినప్పుడల్లా అవకాశం కల్పించుకుని వారిని కలిసేవాణ్ణి. రంగనాథ్‌ది సాధారణమైన జీవనం. సాదాసీదా మని షి. ఆడంబరాలంటే ఇష్టపడేవారు కారు. ఎవరికైనా కష్టం కలిగితే చూస్తూ ఉండేవారు కారు. చేతనైన సాయం చేసేవారు. భార్య అస్వస్థురాలైనప్పుడు, దీర్ఘకాలంపాటు సేవలందించిన దయామయుడు.
లోకంలో ఇటువంటి నటులు కూడా ఉంటారా? అనిపించేంత మంచితనం రంగనాథ్‌ది. భేషజాలకు తావులేని వ్యవహారం ఆయనది. ఆకర్షణీయమైన ముఖం. వారి మాటలు నాకు బాగా నచ్చే వి. నాతో పరిచయం ఏర్పడిన తర్వాత వారి ముఖంలో ఎన్నడూ కోపాన్ని చూడలేదు. కాని, ఏదో ఒక ఆలోచన వారి మన స్సులో ఉన్నట్లు పసిగట్టాను. అదే విష యం నేను అడిగితే, ‘సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను’ అన్నారు. కానీ, ఆ సమయం రాలేదు. కానీ, వేరే ఒక అరుదైన సందర్భం వచ్చింది.
ఒకరోజు కర్ణాటక ‘తెలుగు రైటర్స్ ఫెడరేషన్’ వారి ఆహ్వానం మేరకు నేను బెంగ ళూరుకు ప్రయాణమయ్యాను. ఆశ్చర్యం గా అదే సభకు రంగనాథ్‌కూడా నాతోపాటు అదే రైలులో, నా పక్క బెర్తులోనే ప్రయాణించారు. ఆ కార్యక్రమానికి ఆయ న ముఖ్య అతిథి అయితే, నేను విశిష్ట అతిథిని. ఎలాగైతేనేమి ఇద్దరం రైళ్లో ఎదురెదు రుగా కూర్చుని ఆత్మీయంగా మాట్లాడుకొనే అవకాశం లభించింది. మనసు విప్పి మాట్లాడుకున్నాం. సగం కవిత్వం గురించి, సగం వేదాంతం గురించి. అయితే, ఆ మాటల సందర్భంలోనే నాకు తెలిసింది, ఆయనలో ఒక నటుడు, కవి మాత్రమేకాక ఓ సామాన్య వేదాంతి కూడా ఉన్నాడని!
“జీవి శాశ్వతుడైనా జీవితం శాశ్వతం కాదు” అన్న నా మాటకు రంగనాథ్ లోతుగా స్పందించారు. “మరి, మానవజన్మ ఎందుకు, జీవితం శాశ్వతం కానప్పు డు?” అన్నారు. ఆ ప్రశ్నకు సమాధానం గా, “సుఖదుఃఖాలను అనుభవించడమే జీవితం. ఐనా, మోక్షాన్ని పొందడమే మానవ జీవిత లక్ష్యం” అన్నాను. మాట్లాడుతూ, మాట్లాడుతూ హఠాత్తుగా ఆయన అడిగారు, “మృత్యువును జయించవచ్చు నా?”. ఆయన ఎందుకలా అడిగారో తెలియని నేను మామూలుగానే జవాబిచ్చా ను. “మృత్యువును జయించడమంటే మళ్లీ జన్మ లేకుండా చేసుకోవడమే. అందుకు మనం ఈ జన్మలో ఎలాంటి పాపపుణ్య కర్మఫలాలు లేకుండా చేసుకోవాలి”.
“మనిషికంటే మృత్యువు గొప్పదా?” మళ్లీ ప్రశ్నించారు రంగనాథ్.
“ఔను, మృత్యువే గొప్పది. కానీ, ఆ మృ త్యువుకు మృత్యువు పరమాత్మ మాత్రమే” అన్నాను.
“ఒకరు మృత్యువును జయిస్తే మానవులందరూ మృత్యువును జయించినట్లు కాదా?” అడిగారు అద్వైతాన్ని దృష్టిలో ఉంచుకొని.
“పరమాత్మలో విభాగాలు లేవు. అత డు మృత్యువుకు మృత్యువు. మనం జీవాత్ములం. అనేకులం. ఎవరికి వారం ఉనికి తో ఉంటున్న వాళ్లం. కనుక ఎవరికి వారే మృత్యువును జయించవలసి ఉంది” అన్నాను.
“నిజానికి దేవుడే జీవుడైనప్పుడు ఆ జీవుడు ఒక్కడా? లేక అసంఖ్యాకమా?” అడిగారాయన తిరిగి.
“దేవునిలో విభాగాలు లేనప్పుడు అత డు జీవునిగా (శరీరధారిగా) మారవలసిన అవకాశమే లేదు కదా. పరమాత్మలో అవి ద్య లేదు. జీవులే అవిద్యలో చిక్కుకున్నా రు. అవిద్యవల్ల బంధనం. బంధనమే మృత్యువు. దాన్ని ఎవరికి వారు భేదించుకొని పోవలసిందే” వివరించాను.
యోగులకు మాత్రమే అది సాధ్యం
రంగనాథ్ వేదాంతాన్ని బాగానే అధ్యయనం చేసినట్టున్నారు. కనుక, నన్ను మృత్యువు గురించి ఎన్ని ప్రశ్నలు అడగా లో అన్నీ అడిగారు. వారికి నిదానంగా నేను సమాధానాలు ఇస్తుంటే మా పక్క సీట్లో ఉన్న ఒక వృద్ధురాలు సుమారు రెండు గంటలకు పైగా మా సంభాషణను విన్నది. మేం మాటలు ఆపి నిద్రకు ఉపక్రమిద్దామనుకున్న సమయంలో ఆమె లేచి నిలబడి, “మీ ఇద్దరి సంభాషణ అంతా విన్నాను. రైల్లో ఇట్లా వేదాంతం మాట్లాడుతుంటే నేనెన్నడూ వినలేదు. మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూడాలి” అని ఆశీర్వదించింది. ఆమె మాటలకు మేం ముగ్ధులమై పోయాం. నిద్రలోకి జారిపోయాం ఆ తర్వాత. కానీ, ఆ పెద్దమ్మ ఆశీస్సు రంగనా థ్ విషయంలో నిజం కాలేదు. బెంగళూరు కార్యక్రమం ముగించుకుని మేమిద్దరం హైదరాబాద్ తిరిగి వచ్చేశాం.
ఒకనాడు, బైస దేవదాసు (‘నేటి నిజం’ సంపాదకులు) ఆశ్చర్యంగా నాతోపాటు రంగనాథ్‌నూ ‘ఉగాది’ పండుగ సందర్భం గా భోజనానికి ఆహ్వానించారు. ప్రత్యేకంగా మా ఇద్దరిని పిలవడంతో నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది. కానీ, అది కార్యరూపంలోకి రాకముందే జరగరాని ఘోరం జరిగింది. రంగనాథ్ తన ఇంటి గోడమీద “నేను మృత్యువును జయించాను” అన్న మాటలు రాసిపెట్టి, ప్రాణాలు విడిచారు. నాకు మాటలు రాలే దు. విషాదంతో హృదయం గడ్డకట్టుకుని పోయింది. ఆయన మృత్యువును గురించి ఆ రోజు రైలులో నాతో పలికిన మాటలు నా చెవుల్లో మారుమోగాయి. “బలవంతం గా ప్రాణాలు తీసుకోవడం మృత్యువును జయించినట్లు కాదు. మన నుంచి మృత్యు వు దూరంగా ఉండాలంటే దానికి యోగసాధన ఒక్కటే మార్గం. యోగులకు మృత్యువు భయపడుతుంది. భోగులను మృత్యువు భయపెడుతుంది”. ఈ మాటలు ఆయనకు చెప్పే అవకాశం నాకు రాలేదు.
ఆచార్య మసన చెన్నప్ప
9885654381