calender_icon.png 23 September, 2024 | 6:55 AM

అన్నంలో రాళ్లు వస్తుంటే ఏం చేస్తున్నారు?

20-09-2024 12:00:00 AM

  1. మన పిల్లలకైతే అలానే తిన్పిస్తామా?
  2. టాయిలెట్లలో నీళ్లు రాకపోతే పట్టించుకోరా?
  3. మరిమడ్ల ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్ సిబ్బందిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్19 (విజయక్రాంతి): గురుకుల విద్యార్థులకు పెడుతున్న అన్నంలో రాళ్లు వస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మీ పిల్లలకు ఇలానే ఆహారం పెడతారా అని ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మరిమడ్ల ఏకలవ్య గురుకుల పాఠశాలను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహజన్‌తో కలిసి సందర్శించారు.

ప్రతి తరగతికి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు భోజనంలో రాళ్లు వస్తున్నాయని, వాష్ రూమ్స్ సరిగా లేవని, టాయిలెట్లున్నా నీళ్లు రావడం లేదని తదితర సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అన్నంలో రాళ్లు వస్తున్నాయని విద్యార్థులు బాధపడుతున్నారని.. మన పిల్లలకు అన్నంలో రాళ్లు వస్తే తిన్పిస్తామా? అని అడిగారు. టాయిలెట్లకు నీళ్లు రాకుంటే ఎలా అని ప్రశ్నించారు. ఇన్ని సమస్యలుంటే మీరేం చేస్తున్నారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాము కొత్తగా వచ్చామని, ఆ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని సిబ్బంది చెప్పడంతో.. బాధ్యులైన పాత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. ఇది తొలిసారి కాబట్టి వదలేస్తున్నానని, ఇకపై అలా జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. అవసరమైతే రాబో యే రోజుల్లో ఆకస్మిక తనిఖీ నిరహిస్తానని స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదేశించడంతోనే ఇక్కడికి వచ్చానని, సమస్యలన్నీ తరలోనే పరిష్కరిస్తానని చెప్పారు. తల్లిదండ్రులకు, ఊరికి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. అప్పటికప్పుడు టాయిలెట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 

ఒక్కో విద్యార్థిపై ఏటా౧. 9 లక్షల ఖర్చు 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 728 ఏకలవ్య రెసిడెనియల్ స్కూల్స్ మంజూరు చేసిందని అన్నారు. ప్రస్తుతం 410 స్కూల్స్‌లో విద్యాబోధన కొనసాగుతోందని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మరిమడ్లలో, ఎల్లారెడ్డి మండలం దూమాలలో ఏకలవ్య స్కూల్స్‌ను ఏర్పాటు చేశారని చెప్పారు. ఒక్కో విద్యార్థిపై సగటున ఏటా లక్షా 9 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారని స్పష్టంచేశారు. ఆడవి బిడ్డలకు కార్పొరేట్ విద్యను అందించాలనే గొప్ప ఆశయంతో ప్రధాని నరేంద్రమోదీ వీటిని ఏర్పాటు చేశారని ఉద్ఘాటించారు. మరింత మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.