09-03-2025 12:00:00 AM
కిడ్నీలు సవ్యంగా పనిచేయని స్థితిలో ఉన్నప్పుడు కొన్ని రకాల లక్షణాలు శరీరంలో కనబడతాయి. అయితే కిడ్నీ సమస్యల సంకేతాలను త్వరగా గుర్తించలేరు. లక్షణాలు కనిపించినా అవి చాలా తక్కువ స్థాయిలో ఉండటం వల్ల వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కిడ్నీలకు వచ్చే అనారోగ్యాలను గుర్తించి వెంటనే చికిత్స తీసుకోవాలంటే వాటి గురించి కనీస అవగాహన చాలా అవసరం. కిడ్నీలకు ఎలాంటి వ్యాధులు వస్తాయి? వాటికి కారణాలు, చికిత్స, నివారణ వంటి అంశాల గురించి తెలుసుకుందాం..
(మార్చి 13న వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా)
సాధారణంగా మిగతా సమస్యల కంటే కిడ్నీల సమస్య అంత తొందరంగా బయట పడదు. దాదాపుగా 50 శాతం దెబ్బతిన్న తర్వాతే లక్షణాలు బయటపడతాయి. చాలామందికి మధుమేహం, రక్తపోటుపై కొంత అవగాహన ఉంటుంది. కానీ కిడ్నీ సమస్య వచ్చినా ఫిజిషియన్ వద్దకే ఎక్కువమంది వెళ్తారు. నెఫ్రాలజిస్టు దగ్గరకు వెళ్లేవారు చాలా తక్కువ. సమస్య తీవ్రమైతేనే తప్ప వెళ్లరు. ప్రతి పదిమందిలో ఒకరికి క్రానిక్ కిడ్నీ సమస్య ఉంటుంది. క్రానిక్ కిడ్నీ సమస్య ఐదు దశల్లో ఉంటుంది. మొదటి మూడు దశల్లో ఏ సమస్య కనిపించదు. నాలుగు, ఐదు దశల్లో లక్షణాలు బయటపడతాయి. అప్పుడే నెఫ్రాలజీ దగ్గరకు వెళ్తున్నారు. ఐదో దశ బయట పడినప్పుడు ఎంత చికిత్స చేసినా సాధారణ స్థాయికి వెళ్లలేరని చెబుతున్నారు నిపుణులు. వీరికి జీవితాంతం డయాలసిస్ చేయాల్సిందే. లేదంటే కిడ్నీ ట్రాన్సుఫ్లాంటేషన్ చేయాల్సి వస్తుంది.
లక్షణాలు
ప్రయాణం చేసినప్పుడు, ఎక్కువసేపు కూర్చున్నప్పుడు, నిలపడినప్పుడు కాళ్లకు వాపు వస్తుంది.
రాత్రి పూట ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లడం.
మూత్రంలో రక్తం పడటం.
కొంచెం దూరం నడిచినా అలసిపోవడం.
ఒళ్లు నొప్పులు, స్పృహ కోల్పోవడం, ఫిట్స్ రావడం.
కిడ్నీల ఆరోగ్యానికి..
కిడ్నీ ఆరోగ్యం దెబ్బతినడానికి ఆల్కహల్, స్మోకింగ్ మాత్రమే కాదు ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం కూడా కారణం. ముఖ్యంగా జంక్‌ఫుడ్, ప్రొసెస్ ఫుడ్ తినకూడదు. 30 ఏళ్లు దాటిన తర్వాత కిడ్నీ పనితీరు పదిశాతం తగ్గుతుంది. ఉప్పును ఎక్కువగా వాడితే రక్తపోటు పెరిగి.. అది కిడ్నీలను దెబ్బతీస్తుంది. అలాగే రక్తపోటు, మధుమేహం ఉండేవాళ్లు రోజుకు 3 గ్రాముల ఉప్పే తీసుకోవాలి. అలాగయితేనే కిడ్నీల సమస్యలను నివారించవచ్చు. స్మోకింగ్ పెద్ద సమస్యగా మారుతోంది. దానికి తోడూ ఆల్కహాల్, డ్రగ్స్ తీసుకోవడంతో మధుమేహం అదుపులో ఉండకపోవడంతో కిడ్నీలు తొందరగా పాడవుతున్నాయి. ఒళ్ల నొప్పులు, నడవలేపోవడంతో ఫెయిన్ కిల్లర్స్‌ను ఆశ్రయిస్తారు. ఇవి అతిగా వాడితే కిడ్నీల సామర్థ్యం తగ్గిపోతుంది.
డాక్టర్ సింధు కాజా నెఫ్రాలజిస్ట్, రెనోవా సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్