calender_icon.png 18 April, 2025 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బనకచర్ల కతేంది?

10-04-2025 01:12:37 AM

  1. జీబీ లింక్ పేరిట మోసం
  2. వరదజలాల పేరిట గోదావరి  నీటిని తరలించే యత్నం
  3. కేంద్రంతో కలిసి తెలంగాణను వంచించేందుకు ఏపీ కుట్ర
  4. జీఆర్‌ఎంబీ సైతం ఏపీకే వంత
  5. ఘాటుగా స్పందించిన తెలంగాణ 

హైదరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): పోలవరం పేరిట గోదావరి జలాల తరలింపును చేపట్టిన ఆంధ్రప్రదేశ్.. తెలంగాణను మరోసారి వంచిం చేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణాజలాల్లో మనకు రావాల్సిన వాటాను ఇవ్వకుండా తాత్సారం చేస్తున్న ఏపీ.. ఇప్పుడు గోదావరి జలాల్లోనూ మనకు గండికొట్టే కుట్రలు చేస్తోంది.

ఏపీ సీఎం చంద్రబాబు గోదావరి  కృష్ణా అనుసంధానం పేరిట తెరపైకి తెచ్చిన గోదావరి  బనకచర్ల (జీబీ లింక్) ప్రాజెక్టుతో గోదావరి జలాలను సైతం అక్రమంగా తరలించుకుపోయేందుకు కుట్రలు చేస్తున్నారు. సామర్థ్యానికి మించిన కాలువలు, ఊహకందని రీతిలో డ్యాంలు నిర్మించి మొత్తం నీటిని మళ్లించుకుపోయే కుట్రలు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ర్టంలో వైఎస్‌ఆర్ పోతిరెడ్డిపాడు పేరిట కృష్ణా నదిని మళ్లించుకో పోతే.. ఇప్పుడు చంద్రబాబు జీబీ లింక్ పేరిట గోదావరి జలాలను సైతం తరలించుకుపోయేందుకు కుట్రలు ప్రారంభించారు.

కేంద్రంలో ఉన్న మిత్ర పక్ష బీజేపీ సర్కార్ సహకారంతో ఏపీ ఇప్పటికే ఇందుకు గ్రౌండ్ క్లియరెన్స్ చేసుకుంది. వృథాగా సముద్రంలో కలుస్తు న్న వరద జలాల పేరిట రూ.80 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ జీబీ లింక్ ద్వారా సుమారు 200 టీఎంసీల నీటిని పెన్నా బేసిన్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తుంటే.. ఎలాంటి అనుమతులు లేని ఈ ప్రా జెక్టును అడ్డుకోవాల్సిన గోదావరి రివర్ మేనేజ్ మెం ట్ బోర్డు (జీఆర్‌ఎంబీ) గుట్టుచప్పుడు కాకుండా ఏపీకి వంత పాడుతోంది. దీనిపై ఇటీవల జరిగిన జీఆర్‌ఎంబీ సమావేశంలో తెలంగాణ అత్యంత తీ వ్రంగా స్పందించింది. 

వరదజలాల పేరిట అక్రమ తరలింపు..

ప్రస్తుతం బచావత్ ట్రిబ్యున ల్ అవార్డుకు విభిన్నంగా ఏపీ ప్రభుత్వం జీబీ లింక్‌ను ప్రతిపాదించడంపై తెలంగాణ ప్రభు త్వం తీవ్రంగా మండిపడుతోం ది. యేటా సగటున దాదాపు 3 వేల టీఎంసీల గోదారి జలాలు వృథాగా సముద్రం పాలవుతున్నాయని ఏపీ అంటోంది.

ఈ ఏడాది కూడా సుమారు 4 వేల టీఎంసీలకు పైగా గోదావరి జలాలు సముద్రంలోకి వదిలేశారంటూ వరద జలాల పేరును ప్రస్తావిస్తోంది. సముద్రంలో కలుస్తున్న వరద జలాల్లోంచి కేవలం 200 టీఎంసీలనే తాము మళ్లించుకుంటామని ఏపీ సర్కారు పేర్కొంటోంది. అయితే గోదావరి నదికి సంబంధించి వరద జలాలు అనే ప్రస్తావనే లేదని, అలాంటప్పుడు ఆ పేరుతో గోదావరి జలాలను ఎలా తరలిస్తారని రాష్ట్రానికి చెందిన నీటిపారుదల శాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 

జీబీ లింక్ ప్రతిపాదనలు ఇవే..

గోదావరి నీటిని ఎత్తిపోసి కృష్ణా బేసిన్ మీదుగా పెన్నా బేసిన్‌కు మూడు దశల్లో తరలించేందుకు జీబీ లింక్‌ను ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా మొదటి దశలో పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువపై ఏర్పాటు చేసిన తాడిపూడి లిఫ్ట్ ప్ర ధాన కాలువ ద్వారా జలాలను 175 కి.మీ దూరంలోని ప్రకాశం బరాజ్‌కు తరలిస్తారు.

రెండో దశలో అక్కడి నుంచి జలాలను ఆరు దశల్లో ఎత్తిపోస్తారు. 84వ కి.మీ వద్ద 150 టీఎంసీల సామర్థ్యంతో బొల్లపల్లి రిజర్వాయర్‌ను నిర్మించి గోదావరి జలాలను కృష్ణా బేసిన్ కు మళ్లిస్తారు. మూడోదశలో బొల్లపల్లి నుంచి 110 కి.మీ కాలువ ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ దిగువన ఉన్న బనకచర్ల రెగ్యులేటర్‌కు గోదావరి జలాలను (పెన్నాబేసిన్‌కు) తరలిస్తారు. 

ఇప్పటికే అన్యాయం...

బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తే...  ఎంత మేర మళ్లిస్తారో ఆ మేరకు కృష్ణా బేసిన్‌లోని రాష్ట్రాలకు వాటా కేటాయించాల్సి ఉంటుంది. పోలవరం నుంచి 80 టీఎంసీలను నాగార్జునసాగర్ ఆయకట్టుకు మళ్లించారు. ఈ నేపథ్యంలో 80 టీఎంసీల జలాలను కృష్ణా బేసిన్‌లోని నాటి ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీలు, కర్ణాటకకు 21, మహారాష్ర్టకు 14 టీంఎంసీల చొప్పున ట్రిబ్యునల్ వాటాను కేటాయించింది.

అందుకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సైతం అంగీక రించింది. ఒకవేళ 80 టీఎంసీలకు మించి గోదావరి నుంచి, కృష్ణా బేసిన్‌కు మళ్లించినా అదే తరహాలోనే కృష్ణా బేసిన్‌లోని రాష్ట్రాలకు మళ్లింపు జలాల్లో వాటా ఇవ్వాల్సి ఉంటుందని ట్రిబ్యునల్ తన అవార్డులో స్పష్టంగా తెలిపింది. ప్రస్తుతం ఏపీ జీబీ లింక్ ద్వారా 200 టీఎంసీలు మళ్లిస్తామని చెప్తున్న బేసిన్ రాష్ట్రాల వాటాపై ప్రస్తావించకపోవడం విశేషం. 

తెలంగాణకు తెలియకుండానే..

జీబీ లింక్ గురించి జీఆర్‌ఎంబీకి ముందే తెలిసినా తెలంగాణకు తెలియకుండా చెప్పకుండా దాచేయడంపై ఈ నెల 7న నిర్వహించిన జీఆర్‌ఎంబీ సమా వేశంలో రాష్ట్రానికి చెందిన అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఏపీ జీబీ లింక్ వివరాలను బోర్డుకు ఇచ్చినా, ఆ వివరాలను తమకు పం పాలని కేంద్ర జల్‌శక్తి శాఖ 2024, నవంబర్‌లోనే ఆదేశించినా కనీసం తెలంగాణకు జీఆర్‌ఎంబీ సమాచారం ఇవ్వలేదు.

జీబీ లింక్ ప్రాజెక్టు పూర్తి వివరాలు, దానివల్ల తెలంగాణపై ప్రభావం తదితర వివరాలు ప్రభుత్వం అందించాలని తెలంగాణ అధికారులు బోర్డును కోరినా స్పందన రాలేదు. అయితే ఈ ప్రాజెక్టు డీపీఆర్ ఇంకా తయారు చేయాలేదని మాత్రమే ఏపీ చెబుతోంది. అయితే ఏపీలో, కేంద్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వాలే కావడంతో జీఆర్‌ఎంబీ బహిరంగంగానే ఏపీకి సహకరిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి.