వింటర్ డిప్రెషన్ అనేది సాధారణంగా చలికాలంలో వచ్చే మానసిక రుగ్మత. ఈ కాలంలో చాలామందిలో భావోద్వేగ సమస్యలు వస్తుంటాయి. సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ కారణంగా ఇది వస్తుంది. చాలామంది బద్దకంగా గడపడం, ఒంటరిగా ఉండటంతో వింటర్ డిప్రెషన్ బారిన పడుతుంటారు. అయితే సాధారణ ఒత్తిడిగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. సకాలంలో అప్రమత్తం కాకపోతే మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. అయితే వింటర్ డిప్రెషన్ అంటే ఏంటి? దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
చలికాలం రాగానే తెలియని బద్ధకం కమ్మేస్తుంది. ఉదయం త్వరగా నిద్రలేవాలని అనిపించదు. ఏ పని కూడా చేయబుద్ది కాదు. ఎప్పుడు చూసినా నిద్రమత్తుగా అనిపిస్తుంది. మరోవైపు చలి కారణంగా ఇంటి నుంచి బయట అడుగుపెట్టాలని అనిపించదు. దాంతో ఎక్కువ నిద్రపోవడం జరుగుతుంది. ఇవన్నీ పరోక్షంగా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపి సీజనల్ ఎఫెక్టివ్ డిసీజ్‌కు దారితీసే ప్రమాదం ఉంది. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు వింటర్ డిప్రెషన్‌తో బాధపడుతుంటారు.
వాతావరణ మార్పులు
వాతావరణ మర్పుల ప్రభావం కచ్చితంగా శరీరంపై ఉంటుందని సైన్స్ రుజువు చేస్తోంది. ముఖ్యంగా చలికాలంలో మనపై చలి ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది. ఈ సీజన్‌లో పగటి సమయం తక్కువగా, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. దీంతో సూర్యకాంతి తగ్గుతుంది. అదనంగా చలి కారణంగా ఎక్కువ మంది ఉదయం బయటకురారు.
దీంతో సూర్య కాంతి లేమి మన శరీరంపై ప్రభావం చూపిస్తుంది. సూర్యకాంతితో మన బ్రెయిన్ కెమిస్ట్రీ లింకై ఉంటుంది. సూర్యకాంతి తక్కువగా ఉంటే బ్రెయిన్‌లో చురుకుదనం తగ్గి బద్దకంగా అనిపిస్తుంది. ఇలా ఎక్కువ కాలం వెలుతురు లేకపోవడంతో యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతాయి.
ఎలా వస్తుంది?
సూర్యకాంతి లేమితో కొద్దిగా జీవనవిధానం తప్పుతుంది. త్వరగా నిద్ర లేవకపోవడం వల్ల స్లీప్ సైకిల్ దెబ్బతిని అలసటగా అనిపిస్తుంది. శరీరంలో తక్కువ ఎనర్జీ ఉన్నట్లు అనిపిస్తుంది. మరోవైపు సెరటోనిన్, మెలనిన్ హార్మోన్లను రెగ్యులేట్ చేయడంలో సూర్యకాంతి కీలక పాత్ర పోషిస్తుంది. వెలుతురు లేమితో హార్మోన్లు తగినంతగా ఉత్పత్తి కావు. దీంతో మూడ్ డిస్టర్బ్ అవుతుంది. ఫలితంగా డిప్రెషన్‌కు దారి తీసి వింటర్ డిప్రెషన్ బారిన పడేలా చేస్తుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వింటర్ డిప్రెషన్ సమస్యను డీల్ చేయడానికి కొన్ని రకాల టిప్స్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. వీలైనంత ఎక్కువగా ఎండలో గడపాలి. కిటికీలు, తలపుల పరదాలను ఉదయం ఓపెన్ చేసి పెట్టాలి. బాల్కనీలో వెలుతురు పడే ప్రదేశంలో కూర్చోడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
ఆకాశం మబ్బులు పట్టి ఉన్నాసరే బయటకు వెళ్లాలి. దాంతో శరీర కణాలు ఉత్తేజితమవుతాయి. చలికాలంలో కచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీలు చేయాలి. ముఖ్యంగా ఎరోబిక్ వంటి వ్యాయామాలు చేస్తే సెరటోనిన్ ఉత్పత్తి మెరుగై మానసిక పరిస్థితి బాగుంటుంది.
ఇలా ఎదుర్కొందాం..
వాతావరణం అనుకూలిస్తే బయటి వ్యాయామాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. సూర్యకాంతి వెలుగులో ఫిజికల్ యాక్టివిటీలు చేస్తే డబుల్ బెనిఫిట్స్ ఉంటాయి. డైలీ రొటీన్‌ను క్రమం తప్పకుండా పాటించాలి. చలి ఎక్కువగా ఉంది కదా అని అతిగా నిద్రపోకూడదు. ఇది జీవగడియారాన్ని దెబ్బతీస్తుంది. ధ్యానం చేసినా ఆందోళన దూరమవుతుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో గడిపేందుకు సమయం కేటాయించాలి. మనలో ఫీలింగ్స్ అవతలి వ్యక్తితో పంచుకుంటే మనసు తేలికగా అనిపిస్తుంది.