చలికాలం ఆస్తమా బాధితులకు యమగండం.. ఆస్తమాకు కారణం అలర్జీ.. అలర్జీ అనేది ఇప్పుడు సాధారణ సమస్యే అయినా.. దీనివల్ల చాలా రకాల సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. డస్ట్ అలర్జీ కారణంగా ముక్కు కారడం, తుమ్ములు, దగ్గు, కళ్లు ఎర్రబడటం, గొంతు మంట వంటి లక్షణాలు కలుగుతాయి. అలర్జీ రాను రాను ఆస్తమాగా మారి అవకాశం ఉన్నది.
అలర్జీ, ఆస్తమా అనేది దుమ్ములోని సూక్ష్మ పురుగుల వల్ల మాత్రమే కాదు.. ఇతర అనేక కారణాలతో ముడిపడి ఉంటాయని అంటున్నారు అలర్జీ, ఆస్తమా వైద్య నిపుణులు డాక్టర్ విష్ణున్ రావు వీరపనేని.
మన ఆరోగ్యం మన చుట్టుపక్కల వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. మనం చేసే పనులను బట్టి అది ఆధారపడి ఉంటుంది. పని ఎంత ముఖ్యమో పని చేసే చోటు ఎలాంటిది అనేది కూడా అంతే ముఖ్యం. తప్పని పరిస్థితుల్లో చుట్టూ ఉన్న విషమ పరిస్థితుల్లో పనిచేయాల్సి రావడం వల్ల కూడా అనారోగ్యాలను గురి అవుతారు చాలామంది. వాటిలో కొన్ని..
గాలి కాలుష్యం..
ప్రతిరోజూ మనం 16 వేల నుంచి 20 వేల స్థాయిలో గాలిని పీల్చి, వదిలేస్తుంటాం. మనం పనిచేసే ప్రదేశంలో గాలిలో ఉన్న అన్ని రకాల వ్యాధికారకాలు వాయునాళాల ద్వారా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి అనే క రకాల వ్యాధులను కలిగిస్తాయి. పరిశ్రమలు వెదజల్లే విషవాయువులకు అందులో పనిచేసే, కార్మికులకు మాత్రమే కాక వాటి పరిసరాల్లో నివసించే వారు అనారోగ్యం గురవుతారు. అలాగే నగరాల్లో పెరుగుతున్న వాహనాలు వల్ల కూడా గాలి కలుషితం అవుతున్నది.
విషవాయువుల ద్వారా..
రకరకాల వృత్తులలో ఉన్నవారు పనిచేసే చోట అలర్జీ, ఆస్తమా ఉత్ప్రేరకాల కారణంగా వ్యాధుల బారినపడుతున్నారు. వీటిని ‘వృత్తి పరమైన అపాయాలు’గా భావించవచ్చు. కొన్ని సంవత్సరాలపాటు ఈ విషవాయువులు, ఫ్యాక్టరీ పొగల బారినపడినవా రికి ఊపిరితిత్తుల వ్యాధులు కలిగి, వారి వృత్తే వారికి శత్రువుగా మారడం జరుగుతుంది.
బొగ్గు గనుల్లో, ఆస్బెస్టాస్ గనుల్లో పనిచేసే వారు ఆస్తమాతో బాధపడుతుంటారు. అలాగే మురికివాడల్లో మురికి కాలువ చుట్టూ పక్కల నివసిస్తూ ఆ కాలువల నుంచి వెలువడే హైడ్రోజన్ సల్ఫైడ్, సల్ఫర్‌డై ఆక్సైడ్ వంటి విషవాయువుల కారణంగా ఊపిరితిత్తుల సున్నితమైన పొర దెబ్బతిని అనేక రకాలైన శ్వాసకోశ వ్యాధులు సంభవిస్తాయి.
అలర్జీ నుంచి ఆస్తమా దాక..
బంగారు పనిచేసే ‘స్వర్ణకారులు’ గంధకామ్లం పొగలను పీలుస్తూ ఉంటారు. తగిన జాగ్రత్తలు పాటించకుంటే ఊపిరితిత్తుల సమస్య ఏర్పడుతుంది. ఇది ఏ చికిత్సకూ లొంగదు కూడా.. రోడ్లను, డ్రైనేజీలను శుభ్రం చేసే స్వీపర్లు, పారిశుద్ధ కార్మికులు, మగ్గంపై పనిచేసే చేనేత కార్మికులు, నూలు విల్లులో జనపనార కర్మాగారంలో పనిచేసేవారు బీడీలు చుట్టేవారు అలర్జీలతో బాధపడే అవకాశాలు ఎక్కువ.
ఇప్పుడిప్పుడు కొత్తగా విస్తరిస్తున్న ‘ఫ్లేక్సి ప్రింటింగ్’లో పనిచేసేవారికి అక్కడి ‘రంగుల’ వాసనలు శాపంగా మారి.. శ్వాస సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. వాయుకాలుష్యం విపరీతలంగా ఉన్న నగరాల్లో, ఎక్కువ దూరం ద్విచక్రవాహనాలపై తిరిగేవారు వాయు కాలుష్యం బారిన పడి ‘అలర్జీ’ కి గురై రానురాను ఆస్తమా బాధితులుగా మారుతున్నారు.
వీరిపై ఎక్కువ ప్రభావం
రంపంపొట్టు, సిమెంటు, రంగుల వాసనలు కూడా శ్వాసకోశ వ్యాధులను కల్గించేవే! అదే విధంగా దూది, పరుపులు కుట్టే పత్తితో వెలువడే దుమ్ము, ధూళి, పత్తి నూలు ముక్కల్లోకి దూరి వ్యాధులకు గురైన అభాగ్యులు ఎందరో! తరగతి గదిలో బ్లాక్ బోర్డు తుడిచినప్పుడు సుద్దపొడి (చాక్‌పీసుపొడి) ఉపాధ్యాయులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇదే ఆస్తమాను ప్రేరేపిస్తుంది.
వ్యవసాయ చేసేవారు పొలానికి వాడే రసాయానిక క్రిమిసంహారక విషవాయువులు ఊపిరితి త్తుల్లోకి పోయి ఆస్తమా సమస్యను పెంచుతాయి. ట్రాఫిక్ పోలీసులు రోజంతా కాలుష్యానికి బలి అవుతుంటారు. దీనివల్ల వీరికి శ్వాసకి సంబం ధించిన వ్యాధులు సోకే అవకాశం ఎక్కువ. అందుకే నగరాల్లో ట్రాఫిక్ పోలీసులు మాస్క్ ధరించాలి.
సినీ, టి.వి రంగాల్లో పనిచేసే ఆర్టిస్టులు కూడా కొన్ని రకాల మేకప్ సామాగ్రి, ద్రవ్యాలు, పౌడర్లు, రంగులు, బాడీ స్ప్రేల వల్ల అలర్జీలకి లోనవుతారు. సాఫ్ట్ వేర్ కంపెనీల్లో తదితర కార్పోరేట్ ఆఫీసుల్లో ఏసీల వల్ల ముక్కు, గొంతు సమస్యతో బాధపడే అవ కాశాలు ఉంటాయి.
మన ఆరోగ్యం..
ప్రస్తుతం మంచి గాలి కొనుక్కొనే రోజులు రాబోతాయేమో. మన కర్తవ్యం ఏమిటంటే.. ఎవరికి వారు కాలుష్యా కారకులు కాకుండా వ్యవహరించాలి. వాహనాల వాడకం తగ్గించాలి, ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిషేధించాలి. శ్వాస సంబంధిత సమస్యలు వస్తే అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మన పర్యావరణ ఆరోగ్యమే మన ఆరోగ్యం. పర్యావరణం ఎంత కాలుష్యమైతే మన ఆరోగ్యాలు రోజురోజుకీ అంత దెబ్బతింటాయి.
డాక్టర్ విష్ణున్ రావు వీరపనేని
అలర్జీ, ఆస్తమా వైద్య నిపుణులు
శ్వాస హాస్పిటల్, నారాయణగూడ
www.swasahospitals.com