calender_icon.png 10 October, 2024 | 2:50 AM

ఆమ్దానీ పెంచుకునే మార్గాలు ఏంటి?

10-10-2024 12:57:02 AM

ధరలు పెంచకుండా ఆదాయం పెరగాలి

ప్రణాళికలను సిద్ధం చేయండి

ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క 

వివిధ శాఖల అధికారుల సమీక్ష 

హైదరాబాద్, అక్టోబర్ 9(విజయక్రాంతి): రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ప్రభుత్వం అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ఎలాగైనా బడ్జెట్‌లో నిర్దేశించిన లక్ష్యాన్ని వందశాతం చేరుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వానికి రాబడిని తెచ్చే శాఖలను సర్కారు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తోంది.

ఈ క్రమంలోనే బుధవారం సచివాలయంలో ఆదాయం పెంపు అంశంపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమీక్షించారు. ఆయా శాఖల అధికారులు గత సమావేశంలో నిర్దేశించుకున్న ప్రణాళికలు, వాటి ప్రగతిని డిప్యూటీ సీఎంకు వివరించారు.

అనంతరం భట్టి మాట్లాడుతూ.. ధరలు పెంచకుండా, ఆదాయం పెరిగే మార్గాలు ఏమేమి ఉన్నాయో అన్వేషించాలని అధికారులకు ఆదేశించారు. ఆమ్దానీని ఎలా పెంచొచ్చో నిర్దిష్ట ప్రణాళికలతో అధికారులు తదుపరి సమావేశానికి రావాలని సూచించారు.

కమర్షియల్ టాక్స్ కమిషనర్, జాయింట్ కమిషనర్, విభాగాల అధిపతులతో లీకేజీలను అరికట్టి ఆదాయం పెంచే అంశంపై దిశానిర్దేశం చేసేందుకు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని చెప్పారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక, పన్నుల ఎగవేత కట్టడికి కమర్షియల్ టాక్స్, రోడ్లు, భవనాలు, ఇతర అధికారులు సమావేశమై ఓ నివేదిక రూపొందించాలని సూచించారు.

పెండింగ్‌లో ఉన్న రాజీవ్ స్వగృహ, గృహ నిర్మాణ శాఖ పరిధిలోని ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసి.. వాటిని విక్రయించే అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. ఇసుక రీచ్‌ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు గరిష్ఠ రాబడి సమకూరేందుకు ఏ చర్యలు తీసుకోవాలో చెప్పాలని సీనియర్ అధికారులను సలహాలు అడిగారు.

అలాగే, మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ కన్నా ఎక్కువ రేట్లకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వాటిని అరికట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. రాబడిని పెంచేందుకు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ఇందుకోసం ప్రత్యేకంగా ఉమ్మడి సమావేశాలు నిర్వహించాలన్నారు.

సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్‌రాజ్, కమర్షియల్ టాక్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిశోర్, మైనింగ్ సెక్రటరీ సురేంద్రమోహన్, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, హౌసింగ్ సెక్రటరీ బుద్ధ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.