02-04-2025 12:00:00 AM
పెట్రోల్, డీజిల్ వాహనాలకు కొడుతుంటే చిమ్ముతోంది
ఉన్నతాధికారుల పర్యవేక్షణ శూన్యం
బంకు నిర్వహణపై విజిలెన్స్ అధికారులు తఖీలు చేపట్టాలి
భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 1 (విజయక్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరా వుపేట నియోజకవర్గం పరిధిలోని అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు సర్వత్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గిరిజన సహకార సంస్థ అధికారులు , పౌరసరఫరాల అధికారులు బంకు నిర్వాహకుల పనితీరుపై ఎలాంటి పర్యవేక్షణ చేపట్టటం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. పెట్రోల్ బంక్ లో నాలుగు గన్నులు పనిచేయకపోవడం, చేస్తున్న గన్నులు లీకేజీ కావడం తో వినియోగదారులు అనేక ఇ బ్బందులను ఎదుర్కొంటున్నారు.
బంకులో ఉచిత సేవలో కనుచూపు మేరలో అమలు చేయడం లేదు. రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే అంధకారం తాండవిస్తుంది. జనరేటర్ సౌకర్యం శూన్యం. రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, మూత్రశాలలు వినియోగానికి అనువుగా లేవని, అమ్మకం, కొనుగోలు రిజిస్టర్ల పక్కా గా అమలు చేయడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
బంకులో ఫోన్ పే సౌకర్యం లేక పోవడంతో అక్కడ పనిచేసే సిబ్బంది ఫోన్ కు డబ్బులు చెల్లించాల్సి వస్తుందన్నారు. ఇంధన నాణ్యత ప్రమాణాలు సైతం పాటించడం లేదని వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం పెట్రోల్ బంకులు ఉచితంగా వాహనాలకు గాలి నింపే సౌకర్యం కూడా లేదన్నారు. పెట్రోల్ బంక్ లో భారీగా మోసం జరుగుతుందని లక్షల లీటర్ల దోపిడీ గురవుతుందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
చివరకు లీగల్ మెట్రాలజీ అధికారులకు కూడా తెలియకుండా మోసాలకు పాల్పడుతున్న ట్టు వినియోగదారులు అభియోగం మోపుతున్నారు.బంకు నిర్వాహణపై విజిలెన్స్ తనిఖీలు చేపట్టాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ పంపులకు చిప్ అమర్చకుండా పెట్రోల్ నింపుతున్నట్టు ఆరోపిస్తున్నారు. భారత్ పెట్రోలియం విజిలెన్స్ అధికారులే తనిఖీ చేసి నిజాలు నిగ్గు తేల్చాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
పెట్రోల్ బంక్ నిర్వాణపై
జిసిసి మేనేజర్ పాపారావును వివరణ కోరగా. పెట్రోల్ బంకులో నాలుగు గన్నులు పనిచేయటం లేదని, రిపోర్టు ఎస్‌ఓ కు రిపోర్ట్ చేశామని అతని నుంచి అనుమతులు వస్తే తప్ప పని చేయని గన్నులను కొత్తవి అమర్చడం కుదరదు అన్నారు. పెట్రోల్ డీజిల్ నాణ్యతలో ఎలాంటి వ్యత్యాసాలు లేవని, జనరేటర్ సౌకర్యం కోసం ఉన్నతాధికారులకు నివేదిక చేశామన్నారు.
పెట్రోల్ బంక్ నిర్వహణ అస్తవ్యస్తం
అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో గల జిసిసి నిర్వహణలో ఉన్న పెట్రోల్ బంక్ అస్తవ్యస్తంగా ఉంది. పెట్రోలు నింపే గన్నులు పనిచేయవు, పనిచేసిన గన్నుల నుంచి లీకేజ్ ఎక్కువ వినియోగదారులకు నష్టం వాటిల్లుతోంది.
బంకు జిఎస్టి బిల్లు సైతం పెండింగ్లో ఉండటం పర్యవేక్షణ లేమికి నిదర్శనం. ఏజెన్సీ ప్రాంతంలో గల ఈ బంకుపై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయాలని, వినియోగదారులు మోసానికి గురి కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
సీపీఎం నాయకులు జంగిలి వెంకటరత్నం