- జేఎన్టీయూ వీసీ కోసం మరో సెర్చ్ కమిటీ!
- నచ్చని పేర్లుండటంతో కొత్త కమిటీకి కసరత్తు
- నచ్చినోళ్లు లేక భేటీకాని ఫైన్‌ఆర్ట్స్ వర్సిటీ కమిటీ
- సెర్చ్ కమిటీ పూర్తయినా ఓపెన్ వర్సిటీకి వీసీని నియమించని వైనం
హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): కొన్ని యూనివర్సిటీ వీసీల నియామకమాల్లో కావాల్సిన వారికి పదవులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాము అనుకున్న వారే వీసీ పోస్టులో నియామకం అయ్యేలా చూస్తున్నదని విమర్శలు వస్తున్నాయి. ఇందుకు కీలకమైన సెర్చ్ కమిటీ ప్రతిపాదనలనూ పక్కనపెట్టేస్తున్నారు.
ఏకంగా పాత కమిటీ సిఫార్సులను పక్కనబెట్టి కొత్త సెర్చ్ కమిటీలు వేయబోతున్నట్టు తెలుస్తోంది. తమకు అనుకూలమైన వారిని వీసీలుగా నియమించేం దుకు పట్టుదలకు పోతున్నది. ఇటీవలే రాష్ర్టంలోని 9 వర్సిటీలకు నూతన వీసీలను నియమించిన విషయం తెలిసిందే. మరో రెండు (బాసర ట్రిపుల్ ఐటీ, కోఠి ఉమెన్స్) వర్సిటీలకు ఇన్‌చార్జి వైస్‌చాన్స్‌లర్లను నియమించింది.
అయితే, అత్యంత కీలకమైన జేఎన్టీయూ, జేఏఎన్‌ఎఫ్‌ఏయూ (ఫైన్‌ఆర్ట్స్), బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీల వీసీల ఎంపికకు బ్రేక్ పడింది. ఇంత వరకు ఈ మూడు వర్సిటీలకు వీసీలను నియమించలేదు. కాగా, జేఎన్టీయూ, ఫైన్‌ఆర్ట్స్ వర్సిటీల వీసీల నియామకంపై ప్రభుత్వం పట్టుదలకు పోతున్నట్టు అధికారిక వర్గాల్లో చర్చజరుగుతోంది.
జేఎన్టీయూహెచ్‌కు కొత్త సెర్చ్‌కమిటీ
రాష్ట్రంలోని యూనివర్సిటీ వీసీల పదవీ కాలం మే 21తో ముగిసింది. ఐదు నెలల తర్వాత మూడు వర్సిటీలు మినహా 9 యూనివర్సిటీలకు వీసీలను నియమించారు. అయితే, జేఎన్టీయూ వీసీ ఎంపిక కోసం ప్రభుత్వం గతంలోనే సెర్చ్ కమిటీని నియమించింది. అక్టోబర్‌లో సెర్చ్ కమిటీ సమావేశాన్ని కూడా నిర్వహించారు. ముగ్గురి పేర్లతో జాబితాను రూపొందించి, ఆ జాబితా గవర్నర్‌కు పంపిస్తారు.
సెర్చ్ కమిటీ సమావేశం కావడంతో ఆ మూడు పేర్లలో ఎవరో ఒకరు కొత్త వీసీగా ఎంపికవుతారని అంతా భావించారు. అప్పట్లోనే పాలకమండలి నామిని ఒకరు సెర్చ్ కమి టీ సమావేశంలో తన అభిప్రాయాన్ని గట్టిగా వినిపించారు. తాను సూచించిన ఓ సీనియర్ ప్రొఫెసర్ పేరును జాబితాలో చేర్చాలని పట్టుబట్టారు.
దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సదరు సీనియర్ ప్రొఫెసర్ పేరును ముగ్గురి జాబితాలో చేర్చారు. ఈ వ్యవహరం పట్ల ప్రభుత్వ పెద్దలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. తమకు నచ్చని ప్రొఫెసర్ పేరు ఈ ముగ్గురిలో ఉండటంతో సెర్చ్ కమిటీ సూచించిన పేర్లతో కూడిన జాబితాను గవర్నర్ ఆమోదానికి అప్పట్లో పంపించలేదు.
తాము అనుకున్న పేరు అందులో లేకపోవడం, తమకు నచ్చని పేరు ఉండటంతో ఇప్పుడు ఆ పాత సెర్చ్ కమిటీని రద్దుచేసి కొత్తగా మరో సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైనట్టు విద్యాశాఖ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కొత్త సెర్చ్ కమిటీ వేసేందుకు పాలకమండలి, యూజీసీ, ప్రభుత్వ నామినిలను ఎంపికచేయాల్సి ఉంటుంది. మరోసారి సమావేశమై ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇదే జరిగితే ప్రక్రియ మొత్తం మళ్లీ మొదటికొచ్చినట్టే.
ఫైన్‌ఆర్ట్స్ పరిస్థితి అంతే!
మరో యూనివర్సిటీ జేఎన్‌ఏఎఫ్‌ఏయూ వీసీ ఎంపిక విషయంలోనూ ప్రభుత్వం పట్టుదలకు పోతున్నదనే ఆరోపణలు వినిపిస్తు న్నాయి. అర్హతలు ఉన్నాయా? లేవా? అని చూసుకోకుండా పేరును దాదాపు ఖరారు చేసినట్టు తెలిసింది. ఈ వర్సిటీ వీసీగా నియమించేందుకు ఓ వ్యక్తి పేరును ప్రభుత్వం ఫైన ల్ చేసింది.
ఆయన్నే వీసీగా నియమిస్తారన్న వార్తలూ వచ్చాయి. అయితే ఆ వ్యక్తికి వీసీగా ఎంపికయ్యేందుకు పూర్తి అర్హతలు లేవన్న విషయం ప్రభుత్వ పెద్దలకు ఆసల్యంగా తెలిసింది. దీంతో ఈ వర్సిటీ సెర్చ్ కమిటీ సమావే శాన్ని అప్పటికప్పుడు వాయిదావేశారు. ఇప్పటివరకు సెర్చ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించే ప్రయత్నం చేయడంలేదు.
ఈ వర్సిటీకి వీసీ నియామకానికి వచ్చే నెల వరకు వేచి చూడాలని అనుకుంటున్నట్టు సమాచారం. ప్రభుత్వ పెద్దలు ఓ వర్సిటీకి తాము అనుకున్న వ్యక్తికి వీసీ పోస్టుని ఇవ్వలేకపోతున్నామని, మరొక వర్సిటీకి తమకు నచ్చని వ్యక్తికి ఇవ్వడం ఇష్టం లేకే సెర్చ్ కమిటీ సమావేశాలను నిర్వహించడంలేదన్న ప్రచారం అధికారిక వర్గాల్లో జరుగుతున్నది.
జేఎన్టీయూ వర్సిటీ వీసీ పోస్టు కోసం ముగ్గురు పోటీపడుతున్నారు. వీరిలో ఒకరిపై క్రిమినల్ కేసులు సైతం ఉన్నాయనే సమాచారం. ఇక అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వీసీ ఎంపికకు సెర్చ్ కమిటీ సమావేశం పూర్తవడంతో త్వరలోనే వీసీ పేరును ప్రకటించే అవకాశం ఉంది.