భారత్ వ్యవసాయాధారిత దేశమనే విషయం అందరికీ తెలి సింది. దేశ స్థూల ఆదాయం( జీడీపీ)లో 40 శాతం ఈ రంగంనుంచే లభిస్తోందని ప్రభు త్వ లెక్కలే చెబుతున్నాయి. ప్రత్యక్షంగా లక్షలాది మంది, పరోక్షంగా కోట్లాది మంది వ్య వసాయంపై ఆధారపడి బతుకుతున్న మన దేశంలో రైతన్న రోడ్డెక్కాల్సి వస్తోందంటే అం దుకు కారణం ఎవరు? కేంద్రంతో పాటుగా రాష్ట్రాలన్నీకూడా తమ వార్షిక బడ్జెట్లలో వ్యవసాయానికే పెద్ద పీట వేస్తున్నట్లు చెప్పుకొంటున్నాయి.
మరి దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా రైతులు ఎందుకు సంతోషంగా లేరు? ఏటా ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి రెక్కలు ముక్కలు చేసుకుని తాము పండించిన పంటకు లాభసాటి ధర అటుంచి కనీసం గిట్టుబాటు ధర లభించకపోతే రైతుకు ఆవేదన కాక సంతోషం ఎక్కడినుంచి వస్తుం ది? పండించిన పంటను మార్కెట్‌కు తీసుకుపోతే కనీస మద్దతు ధరకు కొనే నాథుడు ఉండడు. పంటను అమ్ముకోవడానికి ప్రభుత్వమండీల్లో రోజులపాటు పడిగాపులు కా యాల్సిన పరిస్థితి.
చివరికి తమవంతు వచ్చేసరికి అధికారులు సవాలక్ష కొర్రీలు పెడ తారు. వీటన్నిటినీ భరించే ఓపిక లేక రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. వ్యాపారులు చెప్పిన ధరకు తెగనమ్ముకోక తప్పని స్థితి. ఇన్నేళ్లుగా ఈ పరిస్థి తిలో మార్పు లేదు. తాము పండించే అన్ని పంటలకు కనీస మద్దతు లభించాలని రైతు లు కోరుతుండగా ప్రభుత్వం మాత్రం కొన్ని పంటలకు మాత్రమే ఏటా కనీస మద్దతు ధరలను ప్రకటిస్తూ వస్తోంది. కంటి తుడుపుగా ధరలను పెంచుతోంది.
ప్రభుత్వ ధోరణిని చూసి చూసి విసిగిపోయిన రైతులు ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి ఆందో ళనకు సిద్ధమయ్యారు. దీనికి తోడు మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలు అగ్నికి ఆజ్యం పోశాయి. పార్లమెంటు ఆమోదించిన ఈ చట్టాలకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం, చట్టాల్లోని విషయాలు బైటికి రావడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఈ మూడు చట్టాలవల్ల కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)ని రద్దు చేసి తమను కార్పొరేట్ల దయాదాక్షిణ్యాలకు ప్రభుత్వం వదిలేయనుందన్న భావన రైతుల్లో మొదలైంది.
ఏడాది పాటు సాగిన ఉద్యమం
2020 సెప్టెంబర్ 27న రాష్ట్రపతి ఈ బిల్లులకు ఆమోదముద్ర తెలపడానికి రెండు రోజుల ముందే కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ దేశవ్యాప్త నిరసనకు పిలుపిచ్చింది కానీ చట్టాలు మాత్రం ఆగలేదు. దీంతో అదే నెల 24న పంజాబ్ రైతులు మూడు రోజు లు రైలురోకోను ప్రకటించారు. పంజాబ్‌లో చిన్న ఉద్యమంగా మొదలైన రైతు ఆందోళన కొద్దిరోజుల్లోనే ఇతర రాష్ట్రాలకు వ్యాపించిం ది. హర్యానా, రాజస్థాన్, యూపీ.. ఇలా ఒక్కో రాష్ట్రంలో రైతులు ఆందోళనకు సిద్ధమయ్యారు.
పంజాబ్, హర్యానా రైతులు ‘ఢిల్లీ చలో’కు పిలుపునివ్వడంతో వేలాదిమంది రైతులు ట్రాక్టర్లు, ట్రక్కుల్లో ఢిల్లీకి యాత్రగా బయలు దేరారు. అయితే కొవిడ్ ప్రోటోకాల్ కారణంగా ర్యాలీకి ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించడంతో రైతులపై పోలీసుల దమనకాండ మొదలైంది. అయితే ఢిల్లీ సరిహద్దు ల్లోనే తిష్ఠ వేసిన రైతులు రోడ్లపక్కన టెంట్లు వేసుకుని ఆందోళన కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే వేర్వేరుగా ఉన్న రైతు సంఘాలన్నీ ఒకే గొడుగు కిందికి వచ్చి ‘సంయుక్త కిసాన్ మోర్చా’గా ఏర్పాటయ్యాయి.
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ప్రముఖ రైతు ఉద్యమ నేత, భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ)నేత రాకేశ్ తికాయత్ ఉద్యమానికి నేతృత్వం వహించినప్పటినుంచి రైతుల ఆందోళన మరింత ఉధృతమైంది. ఒకప్పుడు తిరుగులేని రైతు నాయకుడైన మహేంద్ర సింగ్ తికాయత్ కుమారుడే ఈ రాకేశ్ తికాయత్. తండ్రి మరణానంతరం బీకేయూకు నాయకత్వం వహిస్తూ రైతు సమస్యలపై ఆందోళనలు సాగిస్తున్నారు. డిసెంబర్ 8న జరిగిన భారత్ బంద్‌కు ఇతర రాష్ట్రాల రైతులు కూడా మద్దతు తెలిపారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బీకేయూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో ఇది సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. ఈ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2021 జనవరి 11న చట్టాలపై స్టే విధిస్తూ చట్టాలపై సిఫార్సులు చేయడానికి నలుగురు సభ్యుల కమిటీని కూడా నియమించింది. రైతుల ఆందోళనకు మద్దతుగా సుదీర్ఘకాలం బీజేపీకి నమ్మకమైన భాగస్వామిగా ఉన్న అకాలీదళ్ ఎన్డీఏ కూటమినుంచి వైదొలగడమే కాకుండా ప్రభుత్వంనుంచి కూడా తప్పుకొంది.
ఎర్రకోట వద్ద ఉద్రిక్తత
ఇదిలా ఉండగానే గణతంత్ర దినోత్సవం నాడు వేలాది మంది రైతులు ట్రాక్టర్లలో ఎర్రకోట వద్దకు పరేడ్‌గా రావడంతో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కావడమే కాకుండా ఒక రైతు మృతి చెందాడు. ఈ ఘటన తర్వాత కేంద్రం ఏడాదిన్నర పాటు రైతు చట్టాల అమలును నిలిపివేస్తామని, చట్టాలపై చర్చించడానికి ఒక జాయింట్ కమిటీని కూడా వేస్తామంటూ రాజీ ప్రతిపాదన చేసింది. అయితే రైతులు దీనికి ససేమిరా అన్నారు. అలా దాదాపు ఏడాది పాటు రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోనే ఆందోళనలు కొనసాగించారు.
నల్ల చట్టాల రద్దు
రోజురోజుకు రైతుల ఆందోళనకు దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా మద్దతు పెరిగిపోతుండడం, మరికొద్ది నెలల్లో కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండడంతో 2021నవంబర్ 19న ఈ నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. దీంతో ఏడాది గా కొనసాగిస్తున్న తమ ఆందోళనను విరమించడానికి, అలాగే వ్యవవసాయ ఉత్పత్తు లకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పా టు ఆందోళన సందర్భంగా రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణపైన ప్రభుత్వంతో చర్చ లు జరపడానికి రైతుసంఘాలు అంగీకరించాయి.
అయితే రైతులు వెంటనే తమ నిరస న స్థలాలను వదిలిపెట్టలేదు. ప్రభుత్వం తమ డిమాండ్లను ఆమోదించి లేఖ ఇచ్చేంతవరకు నిరసన కొనసాగించారు. పలు దఫాల చర్చ ల అనంతరం కనీస మద్దతు ధర డిమాండ్‌పై కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతు సంఘాల ప్రతినిధులతో కమిటీ వేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే నిరసన సందర్భంగా మరణించిన దాదాపు 700 మంది రైతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు కూడా అంగీకరించింది.
మళ్లీ ఎందుకు ఆందోళన?
అయితే మూడేళ్ల క్రితం నిరసన సందర్భంగా ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోలేదని రైతులు అంటున్నారు. ఆ హామీ లతో పాటుగా రైతులకు పింఛన్లు ఇవ్వాలని, తమ రుణాలను మాఫీ చేయాలని, తదితర డిమాండ్లతో మరోసారి ఆందోళనకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. తాజాగా డిసెంబర్ 6 నుంచి మరోసారి ‘ఢిల్లీ చలో’ యాత్ర నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. అంతకు ముందే కొంతమంది యూ పీ రైతులు ఢిల్లీకి పాదయాత్రగా బయలుదేరగా ఢిల్లీనోయిడా సరిహద్దుల వద్ద పోలీ సులు వారిని అడ్డుకున్నారు.
ముందు నిర్ణయించుకున్న ప్రకారం ఈనెల 6నుంచి ఆందోళన కొనసాగించడానికే రైతు సంఘా లు సిద్ధమయ్యాయి. అయితే శుక్రవారం సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వంలో ఢిల్లీకి పాదయాత్రగా బయలుదేరిన పంజా బ్, హర్యానా రైతుల బృందంపై శంభు సరిహద్దు వద్ద హర్యానా పోలీసులు భాష్పవా యువు ప్రయోగించడంతో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల భాష్పవాయు ప్రయోగంలో నలుగురు ఆందోళనకారులు గాయపడ్డంతో తాత్కాలికంగా పాదయాత్రను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించిన రైతు సంఘాలు కేంద్రం గనుక వెంటనే చర్చలు జరపకపోతే ఈ నెల 8న తిరిగి యాత్ర కొనసాగిస్తామని స్పష్టం చేశాయి.
ఉద్యమం తొలిరోజే జరిగిన సంఘటనలు గతంలో ఢిల్లీసరిహద్దుల్లో నెలకొన్న గందరగోళాన్ని గుర్తు చేశాయి. అయితే ఈ సారి రైతుల ఆందోళనకు ప్రతిపక్షాలు సైతం మద్దతు ప్రకటించడంతో వారి ఉద్యమానికి మరింత ఊపు లభించినట్లయింది. ఆందోళన చేస్తున్న రైతులు మణిపూర్ తరహా పరిస్థితిని ఎదుర్కోకుండా చూడాలని, తక్ష ణం రైతులతో చర్చలు జరపాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కేంద్రానికి అల్టిమేటం జారీ చేసింది. మరో రెండునెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ సర్కార్ తీసుకోబోయే నిర్ణయంపై ఉద్యమం భవిష్యత్ కార్యాచరణ ఆధారపడి ఉంది.
- కె. రామకృష్ణ