- రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
- లేఖను పిల్‌గా పరిగణించిన న్యాయస్థానం
హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా బావుపేట, ఆసిఫ్‌నగర్‌లోని గ్రానైట్ క్వారీలతో జరుగుతున్న కాలుష్యంపై తీసుకున్న చర్యలు ఏమిటో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కాలుష్యం కారణంగా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని డాక్టర్ డీ అరుణ్‌కుమార్ హైకోర్టుకు లేఖరాశారు.
దానిని సుమోటో పిల్‌గా పరిగణించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే , జస్టిస్ శ్రీనివాస్‌రావులతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమల శౠఖ, పర్యావరణశాఖ ముఖ్య కార్యదర్శులు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, కరీంనగర్ కలెక్టర్, గనుల శాఖ సహాయ డైరెక్టర్, పర్యావరణ ఇంజినీరు, కొత్తపల్లి తహసీల్దార్లకు నోటీసులు ఇచ్చింది.
విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. గ్రానైట్ క్వారీలు, వాటి అనుబంధ పరిశ్రమలైన కటింగ్, పాలిషింగ్ తదితర కంపెనీల వల్ల కొండలు ధ్వంసం అయ్యాయని ఆరోపించారు. కాలుష్య సమస్య తీవ్రంగా ఉండటంతో 10 గ్రామాల్లోని 35 నుంచి 40 వేల మంది ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని అన్నారు. వ్యర్థాలను చెరువుల్లో వదులుతుండటంతో వ్యాధులు వస్తున్నాయని చెప్పారు.