- సరైన గైడ్‌లైన్స్ ఇవ్వని ప్రభుత్వం
- లొసుగులతో తప్పించుకుంటున్న అక్రమార్కులు
- చేతులెత్తేస్తున్న పోలీసు అధికారులు
పెద్దపల్లి, జూలై 29 (విజయక్రాంతి): రాష్ట్రంలో గుట్కా అమ్మకాలు నిషేధించామని ప్రభుత్వం చెబుతున్నా.. గుట్కా దందా మాత్రం ఆగడం లేదు. అధికారులు గుట్కా వ్యాపారులను పట్టుకుని, కోర్టులో హాజరుపరిచినా.. గుట్కా నిషేధంపై సరైన గైడ్‌లైన్స్‌ను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో వ్యాపారులు తప్పించుకుంటున్నారు. ఇది అధికారులకు కూడా తలనొప్పిగా మారింది.
కోల్‌బెల్టులో యథేచ్ఛగా దందా
కోల్‌బెల్టు ప్రాంతంలో గుట్కాదందా యథేచ్ఛగా సాగుతున్నది. అక్రమార్కులకు పోలీసులు, రాజకీయ నాయకుల అండ ఉండటమే ఇందుకు కారణం. మహారాష్ట్ర నుంచి కోల్‌బెల్టు ప్రాంతానికి అన్ని చెక్‌పోస్టులు దాటించి రూ.కోట్ల విలువైన గుట్కాలను దిగుమతి చేసుకుంటున్నారు. కోల్‌బెల్టు పరిధిలోని రామగుండం, మంథని కేంద్రంగా గుట్కా వ్యాపారం నడుస్తున్నది. పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని, మంథని కేంద్రాల్లో నెలకు రూ.కోట్లలో విక్రయాలు జరుగుతున్నా అధికారులెవ్వరూ పట్టించుకోవడం లేదు. చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని గుట్కా దందా సాగిస్తున్నారు. గుట్కాను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం గైడ్‌లైన్స్ పకడ్బందీగా లేకపోవడం వల్ల తగు చర్యలు తీసుకోలేక పోతున్నట్లు పోలీసు అధికారులు చెపుతుండటం గమనార్హం.