calender_icon.png 27 November, 2024 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీజు బకాయిలు ఏవీ?

13-08-2024 12:53:28 AM

  • మూడేళ్లుగా రూ.5,270 కోట్లు పెండింగ్
  • ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులు, కళాశాలలకు తప్పని తిప్పలు
  • విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న కళాశాలలు
  • కాలేజీలను ఎలా నడపాలని ప్రశ్నిస్తున్న యాజమాన్యాలు

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): ‘ట్యూషన్, ఇతర ఫీజులు చెల్లించలేదన్న సాకుతో విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వకుండా ఇబ్బంది పెట్టొద్దు. ఒకవేళ అలా చేస్తే ఆ కాలేజీలను బ్లాక్ లిస్టులో పెడతాం’ అని రాష్ట్రం లోని అన్ని యూనివర్సిటీల రిజిస్ట్రార్లకు తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఇటీవల లేఖ రాశారు. దీనిని బట్టి విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఫీజులు కట్టకుంటే విద్యార్థులకు కాలేజీ యాజ మాన్యాలు సర్టిఫికెట్లను ఇవ్వడంలేదు. అలాగే ఫీజులు చెల్లించకుంటే కళాశాలలు నడపడం సాధ్యం కావడంలేదని యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇదీ రాష్ట్రంలోని కాలేజీలు, విద్యార్థుల ప్రస్తుత పరిస్థితి. ‘విద్యార్థుల ఫీజు రీయంబర్స్‌మెంట్ పాత బకాయిలు చెల్లిస్తాం’ అని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ. ‘ఇక నుంచి వన్‌టైం సెటిల్‌మెంట్ కింద యాజమాన్యాలకు ఫీజులు చెల్లిస్తాం’ ఇటీవల జేఎన్టీయూలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన వాగ్దానం.

ఇప్పటికే ఫీజు బకాయిలు గుట్టలుగా పేరుకు పోయాయి. మరోవైపు నూతన విద్యాసంవత్సరం ప్రారంభమైంది. గత విద్యా సంవత్సరాలకు సంబం ధించిన ఫీజు రీయంబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు ఇంత వరకూ విడుదల కాలేదు. గత మూడేళ్లుగా ఇంటర్ నుంచి ఇంజినీరింగ్ వరకు మూడేళ్లుగా ఫీజు బకాయిలు పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో ఇటు విద్యార్థులు, అటు కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

రూ.5269 కోట్ల బకాయిలు

ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను మూడు నెలలకోసారి వాయిదాల పద్దతిలో చెల్లించాలి. విద్యాసంవత్సరం ప్రారంభంలో 25 శాతం, మధ్యలో 50 శాతం, చివర్లో 25 శాతం చెల్లించాలి. కానీ దీన్ని అమలు చేయడంలేదు. గత మూడేళ్ల ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు మొత్తం కలిపి రూ.5,270 కోట్ల మేర ఉన్నాయి. ఇవి కాకుండా ప్రస్తుత విద్యా సంవత్సరానికి చెల్లించాల్సినవి రూ.2,500 కోట్లు. రూ.5,270 కోట్లలో రూ.4,770 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన బకాయిలు కాగా, మిగతా రూ.500 కోట్ల వరకు విద్యార్థులకు చెల్లించే స్కాలర్‌షిప్ బిల్లులు ఉన్నాయి.

2021 రూ.327 కోట్లు, 2022 రూ.1,830 కోట్లు, 2023 రూ.2,250 కోట్లు ఉన్నాయి. వీటితోపాటు ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించి 2020 రూ.250 కోట్లతోపాటు, మెస్ చార్జీల బకాయిలు రూ.500 కోట్లు కలిపి మొత్తం 5,157 కోట్లు బకాయిలు ఉండేవి. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పాత బకాయిల్లో రూ.386 కోట్లను చెల్లించింది. దీంతో ఇంకా చెల్లించాల్సినవి రూ.4,770 కోట్లతోపాటు, స్కాలర్‌షిప్ బకాయిలు రూ.500 కోట్లు కలుపుకుంటే మొత్తం రూ.5,270 కోట్లు ఉన్నాయి.

టోకెన్లతోనే సరి

ప్రభుత్వం ఏటా సుమారు రూ.2,500 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి కేటాయిస్తోంది. సకాలంలో ఫీజు బకాయిలను చెల్లించకుండా ప్రభుత్వం టోకెన్లను ఇచ్చి సరిపెడుతోంది. బకాయిలు చెల్లించే ముందు టోకెన్లను జారీ చేయండం సరికాదని కాలేజీ యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. ఏటా పెండింగ్‌లో పెట్టకుండా ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి.

సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలు

ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీల్లోని దాదాపు 8.45 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల ద్వారా లబ్ధిపొందుతున్నారు. ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. ఫీజు చెల్లించలేని కారణంగా ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు పరీక్షలు రాయనీయడం లేదు. పైచదువులకు వెళ్లేందుకు సర్టిఫికెట్లను ఇవ్వడంలేదు. దీంతో విద్యార్థులు కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.

నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో ఇంటర్ నుంచి డిగ్రీకు, డిగ్రీ నుంచి పీజీకి ఉన్నత విద్య చదవాలనుకునేవారికి ధ్రువపత్రాలు అవసరం. వీటి కోసం కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు ఫీజు కడితేనే వాటిని ఇస్తామని యాజమాన్యాలు తెగేసి చెప్తుండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి హెచ్చరిస్తున్నా కాలేజీల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. ఇక చేసేదిలేక విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజు చెల్లిస్తున్నారు. 

సకాలంలో చెల్లించడంలేదు..

ఏ యేడుకు ఆ యేడు రీయింబర్స్‌మెంట్‌ను గత ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో రూ.వేల కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. ఒక్కో కాలేజీకి రూ.కోట్లల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రావాల్సి ఉంది. కోట్లలో పెట్టుబడి పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కళాశాలలను నిర్వహిస్తూ విద్యనందిస్తుంటే సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో కళాశాలల నిర్వహణ భారమవుతోందని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. మరోవైపు విద్యార్థులపై ప్రైవేట్ కాలేజీలు ఫీజు కట్టాలని ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని మెలిక పెడుతుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 

కాలేజీలు నడిపేదెలా? 

ప్రభుత్వం సమయానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోతే కాలేజీలను ఎలా నడిపించాలి. ఇటీవల జేఎన్టీయూ కాలేజీలో సీఎం మాట్లాడుతూ ఫీజు బకాయిల సమస్య పరిష్కార బాధ్యత మంత్రి శ్రీధర్‌బాబుకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు సమస్యను పరిష్కరించలేదు. గత ప్రభుత్వం బకాయిల ను పెండింగ్‌లో పెట్టింది. ఈ ప్రభుత్వమైనా వాటిని వాయిదా పద్ధతిలో చెల్లిం చాలి. రూ.350 కోట్లు నుంచి రూ.400 కోట్లు బకాయిలు చెల్లిస్తే నాన్ ప్రొఫెషనల్ కాలేజీల్లో చదివే విద్యార్థుల సమ స్యలు పరిష్కరమవుతాయి. బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలలను ఎలా నడపాలి? సిబ్బందికి జీతాలు ఎలా ఇవ్వాలి? భవనాల అద్దె, కరెంట్ బిల్లులు, పన్నులు ఎలా కట్టాలి? నిర్వహణ భారం తో కళాశాలలు మూతపడే పరిస్థితికి చేరుకుంటున్నాయి. ఇప్పటికైనా ప్రభు త్వం బకాయిలను వెంటనే విడుదల చేయాలి.

 సతీశ్, 

తెలంగాణ ప్రైవేట్ విద్యాసంస్థల జేఏసీ కన్వీనర్