సమీక్షలో అధికారులపై ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అసహనం
యాదాద్రి భువనగిరి, జూన్ 29 (విజయక్రాంతి): అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో అత్యవసర వైద్య సేవల విభాగాన్ని ఇప్పటివరకు ప్రారంభిం చకపోవడంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఎంపీగా ప్రమాణ స్వీకా రం చేసిన తర్వాత తొలిసారిగా భువనగిరి నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ఆయన బీబీనగర్ ఎయిమ్స్‌ను సందర్శించారు. ఆసుపత్రిలో పలు వైద్య విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రి భవన సముదాయాల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఎయిమ్స్ పాలనా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆసుపత్రిలో అత్యవసర సేవా విభాగం లేకపోవడంతో రోడ్డు ప్రమాద బాధితులు, గుండెపోటు వంటివి వచ్చినవారు వైద్యం అందక మరణించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. వెంటనే అత్యవసర వైద్య సేవా విభాగం ప్రారంభించాలని సూచించారు. అదే విధంగా ఆసుపత్రి నిర్మాణంలో జాప్యం ఎందుకు జరుగుతుందని ప్రశ్నించారు. ఆసుపత్రిలో వివిధ స్థాయిల ఉద్యోగాల నియామకాలను పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ బాటియా, కలెక్టర్ హనుమంత్ కే జండగే, ఎయిమ్స్ వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.