calender_icon.png 22 January, 2025 | 10:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యాచార కేసులపె ఏ చర్యలు తీసుకున్నారు?

22-01-2025 02:54:26 AM

పూర్తి వివరాలతో కౌంటర్ చేయాలని కేంద్రానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాం తి): అత్యాచార కేసులకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై పూర్తి వివరాలతో కౌంట రు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం  ఆదేశాలు జారీ చేసింది. అత్యాచార బాధితులకు పరిహారం అందకపోవడం, అత్యాచార కేసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయా లని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు  కేఏ పాల్ పార్టీ ఇన్ పర్సన్‌గా పిల్  దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ జి.రాధారాణి బెంచ్ మంగళవారం విచారణ చేప ట్టింది. పిటిషనర్ వాదనలు వినిపిస్తూ అత్యాచార కేసులను చట్టప్రకారం 90 రోజుల్లో విచారణ పూర్తి చేయాల్సి ఉండగా అలా జరగడం లేదన్నారు. అదేవిధంగా అత్యాచార కేసుల్లో నేరం రుజువైన పక్షంలో బాధితులకు పరిహారం అందజేయాల్సి ఉందన్నారు.  బీఎన్‌ఎస్‌లోని సెక్షన్లను కచ్చితంగా అమలు చేసి మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు.

అంతేగాకుండా పన్ను చెల్లింపుదారుల నుంచి వచ్చే మొత్తంలో 1 శాతం మహిళల సాధికారత కోసం కేటాయించాలని కోరారు. దీనికి సంబంధించి జాతీయ మహిళా కమిషన్ చేసిన సిఫారసులను అమలు చేయాలని, మహిళా సాధికారతకు చర్యలు తీసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ కేసులో కౌంటరు దాఖలు చేయడానికి గడువు కావాలని కేంద్రం తరఫు న్యాయవాది కోరగా ధర్మాసనం అనుమతిస్తూ విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా వేసింది. ఇదే చివరి అవకాశమని కేంద్రానికి తేల్చి చెప్పింది.