calender_icon.png 1 October, 2024 | 9:41 AM

రూ.100 కోట్ల బియ్యం ఏమైనట్టు?

01-10-2024 12:21:48 AM

  1. గడువు ముగిసినా గాడిలో పడని సీఎంఆర్ 
  2. ఏడుగురు మిల్లర్లపై కేసులు

నిర్మల్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో పౌరసంబంధాల శాఖకు చెందిన రూ.100 కోట్ల విలువ చేసే బియ్యం మాయమైనట్టు  తెలుస్తోంది. జిల్లాలోని రైస్ మిల్లలకు కేటాయించిన ధాన్యంలో సీఎంఆర్ సేకరణపై ప్రభుత్వం అనేకసార్లు గడువు పొడగించినా బియ్యం ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.

దీంతో రైస్ మిల్లలకు పౌరసరఫరాల శాఖ సరఫరా చేసిన ధాన్యానికి బదులు సీఎంఆర్ బియ్యం సేకరణకు వెళ్లిన అధికారులకు బియ్యం కనిపించకపోగా ప్రభుత్వ ఇచ్చిన ధాన్యం కూడా నిల్వ లేకపోవడంతో కంగుతింటున్నారు. జిల్లావ్యాప్తంగా 64 రైస్ మిల్లులు ఉండగా 32 మిల్లలు డీఫాల్టర్లుగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. 

1.40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం..

సీఎంఆర్ బియ్యం సేకరణకు  గడువు సోమవారంతో ముగిసినప్పటికీ ఇంకా ఖరీప్, రబీకి సంబంధించిన 1.40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పెడింగ్‌లోనే ఉన్నదని అధికారులు తెలిపారు. 2023 సంవత్సరానికి గాను ఖరీఫ్‌లో 95వేల మెట్రిక్ టన్నుల బియ్యానికి ఇప్పటి వరకు 50 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే సీఎంఆర్ కింద వచ్చింది. ఇంకా 45 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పెడింగ్‌లో ఉన్నట్టు అధికారులు తెలిపారు. రబీకి సంబంధించి 1.05 మెట్రిక్  టన్నుల బియ్యానికి గాను ఇప్పటి వరకు కేవలం 10వేల మెట్రిక్ టన్నులే సేకరణ పూర్తి అయ్యింది. 

ఏడు మిల్లులపై ఆర్‌ఆర్ యాక్టు 

అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్ ఆదేశాల మేరకు జిల్లాలో భారీగా సీఎంఆర్ పెండింగ్ ఉన్న ఏడు రైస్ మిల్లులకు నోటీసులు ఇచ్చారు. అయినా స్పందిచకపోవడంతో ఆర్‌ఆర్ యాక్టు కింద కేసులు నమోదు చేశారు.

భైంసా మండలంలోని దేగాంలో ఉన్న రాజరాజేశ్వర రైస్ మిల్, సారంగపూర్ మండలంలోని బిరవెల్లిలో ఉన్న సాయికృష్ట, బాసరలోని అక్షయ కృష్ట, లోకేశ్వరం మండలంలోని జోహార్‌పూర్ రాజరాజేశ్వర, ధర్మో రలోని శ్రీవెంకటేశ్వర, సారగపూర్ మండలంలోని చించోలి అన్నపూర్ణ, ముధోల్ మండలంలోని చింతకుంట గ్రామంలో గల జశ్విత మిల్లులపై ఆర్‌ఆర్ యాక్టు కింద కేసు లు పెట్టినట్టు అధికారులు తెలిపారు.

ఈ ఏడు రైస్ మిల్లర్ల నుంచి దాదాపు రూ.100 కోట్ల విలువ చేసే బియ్యం రావాల్సి ఉంది. ఈ మిల్లర్లపై అసలుతో పాటు వడ్డీతో రికవరీ చేసేవిధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సీఎంఆర్ పెండింగ్‌లో ఉన్న రైస్ మిల్లులకు ఈ సంవత్సరం ఖరీప్ ధాన్యం కేటాయించకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే కొంద రు కొందరు మిల్లర్లు తమ పలుకుబడితో  కేసులను ఎత్తివేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. 

మంత్రి తుమ్మల కన్నెర్ర

ఖమ్మం, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టడంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కన్నెర్ర చేశారు. అధికారుల అలసత్వం, మిల్లర్ల ఇష్టారాజ్యంతో కోట్లాది రూపాయల  ధాన్యం అక్రమార్కుల చేతిలోకి వెళ్లడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 

ఈ అంశంపై కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్‌కు మ ంత్రి తుమ్మల స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో అక్రమంగా ధాన్యం తరలింపుపై సమగ్ర దర్యాప్తు   చేపట్టాలని, కారకులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వ్యవహారంపై ప్ర త్యేక అధికారులతో  విచారణ చేపట్టి తక్షణమే ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

జిల్లాలో కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా మిల్లర్లు  అక్రమాలకు పాల్పడ్డారని, దీనిలో బాధ్యులైన ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదని  మంత్రి హెచ్చరించారు. ఉమ్మడి జిల్లా  వ్యాప్తంగా అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 

మొండిగా వ్యవహరిస్తున్న మిల్లర్లు 

సీఎంఆర్ బియ్యం సేకరణపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నప్పటికీ జిల్లాలో కొందరు మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకుండా మొండిగా వ్యవహరిస్తున్నారు. దీనిపై  జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రత్యేకంగా నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రైస్‌మిల్లర్లను హెచ్చరించినా ప్రయోజనం లేక పోయింది.

రైస్ మిల్లర్లు ధాన్యం మరపట్టించి బియ్యం ప్రైవేటు మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకున్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది.  బియ్యం స్టాకు లేనప్పుడు ప్రభుత్వానికి సీఎంఆర్ ఎలా సరఫరా చేస్తారన్న ప్రశ్న తలెత్తుతున్నది. జిల్లాలో మాయమైన బియ్యం విలువ సుమారు రూ.100 కోట్లు ఉంటుందని అధికారులు అంచ నా వేస్తున్నారు.