సాగర్, నాగార్జున సిమెంట్స్‌కు హైకోర్టు ఆదేశం
వాదనలు వినిపించాలని నోటీసులు
హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా సుల్తాన్‌పూర్ రిజర్వ్ ఫారెస్టులో అటవీ భూముల ఆక్రమణల అభియో గాలపై సాగర్, నాగార్జున సిమెంట్స్‌తోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని తెలు పాలని హైకోర్టు ఆదేశించింది. వాళ్లందరికీ నోటీసులు జారీచేసి విచారణను ౪ వారాలకు వాయిదా వేసింది. సాగర్ సిమెంట్స్ లిమిటెడ్, ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అక్రమ మైనింగ్‌పై అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ న్యాయవాది కర్నాటి వెంకటరెడ్డి పిల్ దాఖలు చేశారు. దీనిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధె, జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ డివిజన్ బెంచ్ సోమవారం విచారించింది. ప్రతివాదులకు నోటీసు లు జారీ చేసింది.
ప్రభుత్వాలు ఆ రెండు కంపెనీలకు ౧౯౮౧లో కేటాయించిన పరిధి దాటి అక్రమ మైనింగ్ చేస్తున్నట్టు గుర్తించి అధికారులు నోటీసులు ఇచ్చారు. అయినా అక్రమ మైనింగ్ ఆపలేదు. ఈ మొత్తం అంశంపై ఆర్డీవో నివేదికను 2020లో కలెక్టర్‌కు అందజేశారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడితే నష్టాన్ని లెక్కగట్టి 100 శాతం జరినామా విధించాల్సి ఉంది. పరిశ్రమల తీరు చట్ట విరుద్ధమంటూ పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. అక్రమ మైనింగ్ కారణంగా ప్రభుత్వం రూ.కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. ఈ నేపథ్యంలో లీజు ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని వెంకటరెడ్డి కోర్టుకు విజ్ఞప్తి చేశారు.