calender_icon.png 24 December, 2024 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంత నష్టం.. ఎంత కష్టం

14-09-2024 12:46:16 AM

  1. వానలతో సూర్యాపేట జిల్లాలో భారీ నష్టం 
  2. తెగిన కాల్వ కట్టలు, రోడ్లు 
  3. కూలిన ఇళ్లు, నీళ్లలోపంటలు 
  4. పునరుద్ధరణకు నివేదిక సమర్పించిన కలెక్టర్ 

సూర్యాపేట, సెప్టెంబర్ 13: ఇటీవల కురిసిన వర్షాలకు సూర్యాపేట జిల్లాలో ప్రాణ, ఆస్తినష్టం జరగడంతోపాటు వందల ఎకరాల్లో పంటలు మునిగిపోవడంతో భారీనష్టం వాటిల్లింది. దీంతో జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రజల జీవనం కష్టతరంగా మారింది. వర్షానికి జరిగిన నష్టన్ని కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో కేంద్ర బృందం ఈ నెల 12న పరిశీలించింది. జరిగిన నష్టాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ స్వయంగా బృందం సభ్యులకు చూపుతూ వివరించారు. పూర్తిస్థాయి నివేదికను తయారీ చేసి ప్రభుత్వానికి సమర్పించారు.

కోదాడ మున్సిపాలిటీలో వరదలతో యర్రమాల వెంకటేశ్వర్లు, నాగం మురళీకృష్ణ మృతిచెందగా వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున ఒకొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించారు. నాలుగు ఎద్దులు, ఇరువై గేదెలు, మూడు ఆవులు, 22 గొర్రెలు, 105 మేకలు, కోళ్లు మరణించాయని.. వాటికి నష్ట పరిహారం కింద రూ.13 లక్షలు అని అంచనా వేశారు.

హౌసింగ్ శాఖ ద్వారా వరదల కారణంగా ఏడు కచ్చా ఇండ్లు పూర్తిగా కూలాయని, రెండు పక్కా ఇండ్లు, రెండు కచ్చా ఇండ్లు తీవ్రంగా దెబ్బతినగా, 28 ఇళ్ల పైకప్పు, గోడలు కూలాయని,4,910 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని ఇంటికి రూ.16,500 చొప్పున మొత్తం రూ.8.16 కోట్లు అంచనా వేశారు. మత్స్య శాఖ ద్వారా మూడు చెరువులలో 71 టన్నుల చేపలు, 30 పడవలు వరదలో కొట్టుకపోయాయని 1.13 కోట్లు రూపాయలు నష్టపరిహారంగా అంచనా వేశారు.

౩౩ శాతం కన్నా పంట నష్టం

వర్షాలు, వరదల కారణంగా జిల్లాలో 33 శాతం కన్నా ఎక్కువ పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. 9068.72 హెక్టార్‌లలో రూ.14.43 కోట్లు పంట నష్టంగా అంచనా వేశారు. 126 రోడ్ల తాత్కాలిక మరమ్మతులకు రూ.7.21 కోట్లు, దెబ్బతిన్న 61 కల్వర్టులు, బ్రిడ్జిల మరమ్మతులకు రూ.36.6 లక్షలు అవసరమని పంచాయితీ రాజ్ ఇంజినీరింగ్ శాఖ అధికారులు అంచనా వేశారు. రోడ్లు,భవనాల శాఖ ద్వారా రాష్ట్ర రోడ్లు 231.90కి.మీల మేర దెబ్బతిన్నాయని మరమ్మతులకు రూ.1.39 కోట్లు కావాలని పేర్కొన్నారు. గ్రామీణ రోడ్లు 7.10 కి.మీల మేర దెబ్బతిన్నాయి.

వాటి మరమ్మతులకు రూ.4.26 లక్షలు అవసరమవుతాయని తెలిపారు. 14 కల్వర్టులు, బ్రిడ్జిలు దెబ్బతిన్నా యని వాటి మరమ్మతులకు రూ.8.4 లక్షలు అంచనా వేశారు. మున్సిపాలిటీలలో 19.58 కి.మీల రోడ్లు, 12 కల్వర్టులు, బ్రిడ్జిలు దెబ్బతినగా మరమ్మతులకు రూ.6.32 కోట్లు కావాలని అంచనా వేశారు.  4,461 స్తంభాలకు రూ.2.23 కోట్లు, 140 కి.మీల కండెక్టర్ తీగకు రూ.70 లక్షలు, 414 ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులకు రూ.1.80 కోట్లు అవసరమని విద్యుత్తు అధికారులు వివరించారు.

పాఠశాలల పునరుద్ధరణకు రూ.95.40 లక్షలు

వర్షాల కారణంగా 4 ప్రాథమిక, ఒక జడ్పీహెచ్‌ఎస్, 2 కేజీబీవీ, ఒక ఎమ్మార్సీ, ఒక సోషల్ వెల్పేర్ హాస్టల్, 4 ట్రైబల్ వెల్పేర్ హాస్టళ్లు దెబ్బతినగా వాటి పునరుద్ధరణకు రూ.95.40 లక్షలకు అంచనావేశారు. 40 మైనర్ ఇరిగేషన్ స్కీమ్‌లు, 13 మేజర్ ఇరిగేషన్ స్కీమ్‌లు దెబ్బతినగా మరమ్మతులకు రూ.24.30 కోట్లు అవసరమని అధికారులు వెల్లడించారు. 16 ప్రదేశాల్లో 2,420 మీటర్ల మిషన్ భగీరథ పైప్‌లైన్ మరమ్మతులకు రూ.కోటి, రెండు ప్రదేశాలలో 5 మోటార్ల మరమ్మతులకు రూ.14.50 లక్షలు, మున్సిపాలిటీలలో దెబ్బతిన్న 1765 పైప్‌లైన్ల మరమ్మతులకు 26.27 లక్షలు అవసరమవుతాయని నివేదికలో పొందుపరిచారు.