calender_icon.png 5 January, 2025 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏమి బతుకు ఏమి బతుకో..!

04-01-2025 01:22:58 AM

* దుర్భర పరిస్థితి వెల్లదీస్తున్న ఆదివాసీ యువత

* ఉపాధి లేక పట్నానికి పయనం

* ప్రాణాపాయ స్థితిలో తిరిగి స్వస్థలాలకు

* బస్తర్, దంతెవాడ యువతపై ఎన్డీటీవీ పరిశోధనాత్మక కథనం

రాయ్‌పూర్, జనవరి 3: పొట్ట చేత పట్టుకుని ఉపాధి కోసం కన్నవాళ్లను, పుట్టి పెరిగిన ప్రాంతాన్ని వదిలేసి ఛత్తీస్‌గఢ్ ఆదివాసీ యువత పట్టణాలకు వలసబాట పడుతున్నారు. అయితే ఆ యు వత కలలు కొన్నాళ్లకే కల్లలుగా మారుతున్నాయి. బతుకు పోరాటంలో అలసిపోతున్నారు.

తీవ్ర అనారోగ్యానికి గురై తిరిగి స్వస్థలాలకు  పయనమవుతున్నారు. కొందరైతే ఏకంగా తమ ప్రాణాలనే పోగొట్టుకుంటున్న పరిస్థితి. దంతెవాడ, బస్తర్  జిల్లాల్లోని గిరిజన యువత దుర్భర పరిస్థితిపై ఎన్డీటీవీ పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో యువత హృదయ విదారక పరిస్థితులను కళ్లకు కట్టినట్టు వివరించింది.  

క్రషింగ్ ఫ్యాక్టరీలో బతుకు ఛిద్రం

సుందరీ అనే గిరిజన మహిళ ఉపాధి కోసం కొంత మంది ఊరివాళ్లతో కలిసి హైదరాబాద్‌కు వచ్చింది. నెలకు రూ12వేల వేతనానికి స్టోన్ క్రషింగ్ ఫ్యాక్టరీలో పనికి కుదురింది. ఫ్యాక్టరీలో రాళ్లను, రాతి చూర్ణం వేరు చేయడం, వాటిని బస్తాల్లోకి నింపడం ఆమె పని. ఆ పని చేస్తూ చేస్తూ కొన్ని రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైంది.

ఫ్యాక్టరీలోని భయానక పరిస్థితుల కారణంగా ఊపి రితిత్తుల సంబంధ వ్యాధులతో తిరిగి స్వస్థలానికి వెళ్లిపోయింది. నెలకు రూ.15వేల వేత నం కోసం పనికి కుదిరిన లక్ష్మి అనే మహిళ ది కూడా ఇదే పరిస్థితి. లక్ష్మి ప్రస్తుతం ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతూ గత రెండేళ్లుగా ప్రాణాల కోసం పోరాడుతోంది. 

యువత సంఖ్యే ఎక్కువ

కొద్ది రోజుల క్రితం బస్తర్ ప్రాంతానికి చెందిన 29 మంది యువకులు హైదరాబాద్‌కు వలస వచ్చారు. వీరిలో కొందరు 2023 తిరిగి స్వస్థలాలకు వచ్చేశారు. స్వస్థలాలకు వచ్చిన కొన్ని రోజుల్లోనే 21 వయసు గల నలుగురు యువకులు తీవ్ర అనారోగ్యంతో ప్రాణాలు విడిచా రు.

మరో ఎనిమిది మంది శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతూ రాయ్‌పూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. 

ఏటా 10లక్షల మంది వలసబాట

బస్తర్‌లో నెలకొన్న పరిస్థితులపై జోగ కుంజం ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒక్క కుట్రేం అనే గ్రామం నుంచి గత రెండేళ్లలో 20 మంది యువతీ యువకులు ఉపాధి కోసం వలస వెళ్లినట్టు పేర్కొన్నారు. అందు లో చాలా మంది అనారోగ్య సమస్యలతో ఇంటికి తిరిగొచ్చినట్టు తెలిపారు.

గ్రామంలో పని దొరకన్నప్పుడు వలస వెళ్లడం తప్ప ఇంకేం చేయగలమంటూ నిస్సహాయత వ్య క్తం చేశారు. అయితే రాష్ట్రంలో వలసలు గణనీయంగా తగ్గినట్టు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చెబుతుంది. దంతెవాడ నుంచి కేవలం తొమ్మిది మంది మాత్రమే వలస వెళ్లినట్టు ప్రభుత్వ రికార్డుల్లో నమోదైంది.

అయితే అనధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రం నుంచి ఏటా సుమారు 10లక్షల మంది ప్రజలు వలసబాట పడుతున్నారు. అమాయక గిరిజన యువతకు కొందరు బ్రోకరు ్ల అధిక జీతం, మంచి ఉపాధి ఆశ చూపి ప్రమాదకర పనుల్లో చేర్చుతున్నారని దంతెవాడకు చెందిన సామాజిక కార్యకర్త రామ్‌నాథ్ పేర్కొన్నారు.

అటువంటి వారిని కట్టడి చేయ డం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజనలు ఎక్కడికి వలస వెళ్లొద్దని ఛత్తీస్‌గఢ్ కార్మిక మంత్రి లఖన్ లాల్ దేవాం గ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ వలసలు అరికట్టడానికి అవసరమైన ఉపాధి, వైద్యం, కనీస సౌకర్యాలు కల్పించడంలో మాత్రం విఫలమవుతున్నారు.