calender_icon.png 23 January, 2025 | 5:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లింగమయ్యా.. వసతులు లేవయ్యా!

23-01-2025 01:53:25 AM

  1. వచ్చేనెలలోనే జాతర
  2. ఇప్పటివరకు ఏర్పాట్ల ఊసెత్తని అధికారులు
  3. సరైన వసతులులేక భక్తులకు తిప్పలు
  4. రాష్ట్రంలోని రెండో అతిపెద్ద జాతరకు వీడని గ్రహణం

సూర్యాపేట, జనవరి 22 (విజయక్రాంతి): సమ్మక్క సారక్క తర్వాత తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర.. సూర్యాపేట జిల్లాలోని దురాజ్‌పల్లి పెద్దగట్టు (గొల్లగట్టు)లింగమంతులస్వామి జాతర. అధికారులకు మాత్రం ఈ జాతరపై ఎప్పుడూ చిన్నచూపే. దీంతో లింగమయ్యను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు.

రెండేండ్లకోసారి వచ్చే ఈ జాతరకు ప్రతీసారి భక్తుల రద్దీ పెరుగుతూ వస్తోంది. రద్దీకి అనుగుణంగా సరిపడా వసతులు కల్పిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ, మరో 25 రోజుల్లో జాతర ప్రారంభం కానుండగా సౌకర్యాల కల్పన ఊసు లేకపోవడమే విమర్శలకు తావిస్తోంది. గతంలో ధర్మకర్తల మండలి సక్రమంగా లేకపోవడంతో దేవాలయ అభివృద్ధి పనులు ఏ మాత్రం జరగలేదు.

దీంతో జాతరకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడ్డ సందర్భాలు కోకొల్లలు. 2015లో అధికారికంగా ఏర్పాటు చేసిన ధర్మకర్తల మండలి పర్యవేక్షణలో జాతర సజావుగా జరిగింది. తదుపరి 2017, 2019 సంవత్సరాలలో ధర్మకర్తల మండలి ఏర్పాటు చేయకుండా, తాత్కాలిక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసి తూతూమంత్రంగా జాతరను నిర్వహించారు.

2021లో అసలు కమిటీయే లేకుండా అధికారుల పర్యవేక్షణలోనే కానిచ్చారు. అది ముగిసిన రెండు నెలలకు ధర్మకర్తల మండలిని ప్రకటించగా సంవత్సర కాలం తర్వాత వారి పదవీ కాలం ముగిసింది. తిరిగి 2023 జాతరకు పాలకమండలిని ఏర్పాటు చేయగా జాతర సజావుగా సాగింది.

తాజాగా ప్రభుత్వం ఈ నెల 8న తారీకున పాలకమండలిని ప్రకటించింది. దీంతో ఈ మండలి అభివృద్ధి పనులపై దృష్టి సారించి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించాలని యాదవులు, భక్తులు కోరుతున్నారు. 

నిధుల కేటాయింపు ఇలా..

ఉమ్మడి రాష్ట్రంలో జాతర నిరాదరణకు గురైంది. ప్రత్యేక రాష్ట్రంలో 2015, ఫిబ్రవరిలో జరిగిన జాతరకు అప్పటి మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని సీఎంను ఒప్పించి రూ.2.10 కోట్లు విడుదల చేయించి పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించారు.

2017లో రూ.1.29 కోట్లు, 2019లో రూ1.75 కోట్లు, 2023లో రూ.5 కోట్లు బడ్జెట్ కేటాయించారు. వీటికి తోడు జాతర సందర్భంగా హుండీ ద్వారా వచ్చే ఆదాయం సైతం దేవాలయ అభివృద్ధికే ఉపయోగిస్తున్నారు. 

తీరని సమస్యలు

* గుట్టపై నీటి ట్యాంక్‌ను ఏర్పాటు చేసినప్పటికీ లక్షల సంఖ్యలో స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు సరిపడా నల్లాలు లేవు.

* గుట్టపై సరిపడా మరుగుదొడ్లు లేవు.

* గుట్టపై కోళ్లు, మేకలు బలిఇవ్వడంతో వాటి రక్తం, ఇతర వ్యర్థాలు అక్కడే పేరుకుపోతున్నాయి. దీనికి తోడు గుట్టచుట్టూ వ్యర్థపదార్థాలు చేరడంతో  భక్తులు దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నారు.

అప్పటికప్పుడే పనులు..

జాతరకు లక్షల్లో భక్తులు వస్తారనే విషయం తెలిసినా ఇప్పటికీ అధికారులు గానీ, పాలకులు గానీ ముందస్తు  అభివృద్ది పనులు చేయించకుండా జాప్యం చేయడంపకై విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. జాతరకు ముందు అప్పటికప్పుడే హడావుడిగా చేసి పనులు చేయించడం వల్ల పనుల్లో నాణ్యత లోపిస్తోంది.

పనుల కోసం వెచ్చిస్తున నిధుల నుంచి కొన్ని వెనకేసుకునేందుకే కావాలనే అధికారులు జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. జాతరకు సంబంధించి ఏండ్లుగా ఇలాగే చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ కొలు వుదీరిన తర్వాత నిర్వహించే తొలిజాతర కాబట్టి అధికారులు తమ తీరును మార్చుకొని సకాలంలో పనులు పూర్తిచేస్తారని భావిస్తున్నారు.