calender_icon.png 1 November, 2024 | 9:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వామ్మో గ్రామ సింహాలు

06-07-2024 12:00:00 AM

హడలెత్తిస్తున్న వీధి కుక్కలు

వెల్దుర్తిలో ఆరు నెలల్లో 173 కేసులు

అధికారులు పట్టించుకోవడం లేదంటున్న ప్రజలు 

వెల్దుర్తి, జూలై 5: వీధుల్లో గ్రామ సింహాలు ఊరికి కాపలా అనే రోజులు పోయాయి. ఒకప్పుడు కొత్తవారు కనిపిస్తే అరిచే కుక్కలు నేడు స్థానికులనే హడలెత్తిస్తున్నాయి. రాత్రుల్లో దొంగలను పసిగడతాయనుకుంటే స్థానికంగా ఉండే ప్రజలు, చిన్నారులు, వాహనదారులపై దాడులు చేస్తున్నాయి. ప్రతి నిత్యం ఏదో ఒక చోట చిన్నాపెద్ద తేడా లేకుండా వాటి ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. బడికి వెళ్లే చిన్నారులను బయటకు పంపాలంటే తల్లిదండ్రులు హడలిపోతున్నారు.

రోడ్లపై కుక్కలు గుంపులుగా తిరుగుతూ ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారి వెంటపడడంతో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు కోకొల్లలు. రాత్రివేళల్లో ఒంటరిగా వచ్చేవారి పరిస్థితి మరీ దారుణంగా తయారవుతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో వీధి కుక్కల బెడద రోజురోజుకు పెరిగిపోతోంది. మండల పరిధిలో 28 గ్రామ పంచాయతీలు ఉండగా వీధి కుక్కల బెడద తీవ్రంగానే ఉంది.  

ఆరు నెలల్లో 173 కేసులు..

ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు ఆరు నెలల వ్యవధిలో ఒక్క వెల్దుర్తిలోనే 173 మంది కుక్కకాటుకు గురయ్యారు. మిగతా గ్రామాల్లో సైతం వీధి కుక్కలతో ఇబ్బందులకు గురవుతున్న వారు లేకపోలేదు. సాధారణంగా వీధి కుక్కల సంఖ్య పెరుగుతున్నప్పుడు పంచాయతీ సిబ్బంది వాటిని పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అంతేగాకుండా వీధి కుక్కల కాటుతో రేబిస్ వ్యాధి సోకే ప్రమాదం ఉన్నందున వాటికి టీకాలు వేయాల్సి ఉంది. కానీ పశువైద్యాధికారులు ఇవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.  

చర్యలు తీసుకుంటాం..

మండల కేంద్రమైన వెల్దుర్తిలో వీధి కుక్కల బెడద చాలానే ఉంది. అయితే, వాటిని ఎప్పటికప్పుడు పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. పంచాయతీల్లో తగిన నిధులు లేకపోవడంతో సతమతమవుతున్నాం. వీధి కుక్కల బెడద లేకుండా చర్యలు తీసుకుంటాం.

 బలరాంరెడ్డి, వెల్దుర్తి ఈవో