calender_icon.png 18 October, 2024 | 5:02 AM

వామ్మో.. సర్వే నంబర్ 42!

18-10-2024 02:24:21 AM

  1. కలెక్టరేట్ నిర్మాణంతో అందరి దృష్టి దీనిపైనే 
  2. కోట్ల విలువజేసే భూమిపైనే కబ్జాదారుల కన్ను
  3. అనుమతులు లేకుండానే వెలుస్తున్న భవనాలు

 మంచిర్యాల, అక్టోబర్ 17 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ మున్సిపాలిటీలోని ప్రభుత్వ భూమిపైనే అం దరి దృష్టి.. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 42లోని ప్రభుత్వ భూ మిని ఓ వైపు టీఎన్‌జీవోలు, మరోవైపు కొం తమంది రైతులు, జర్నలిస్టులు, కబ్జాదారులు ఇలా ఎవరు పడితే వారు ఆక్రమించుకునేందుకు రోజుకోలెక్క నానా కష్టాలు పడు తున్నారు.

అప్పనంగా వచ్చే భూమే కదా! అని ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులు ఒక వైపు కబ్జాచేస్తూ అమాయక ప్రజలకు మేమున్నాం.. నీకేం కాదం టూ అమ్ముకుంటుండగా, మేమేం తక్కువ కాదంటూ మున్సిపల్ అధికారులు అందినకాడికి దండుకుంటూ ప్రభుత్వ భూమిలో ఇంటి నిర్మాణాలకు ఎలాంటి పత్రాలు, ప్రొ సీడింగ్ కాపీలు లేకుండానే అనుమతులు ఇచ్చారు.. ఇచ్చేస్తున్నారు. 

102.10 ఎకరాల ప్రభుత్వ భూమి 

నస్పూర్ మున్సిపాలిటీలో జాతీయ రహదారిని ఆనుకొని సర్వే ననంబర్ 42లో 102.10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో నుంచి టీఎన్జీవోస్ హౌజింగ్ సొసైటీకి 32 ఎకరాలు (సర్వే నంబర్ 42/2) కేటాయించగా ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ (సమీకృత కలెక్టరేట్) కి 12.30 ఎకరాలు (సర్వే నంబర్ 42/3), నస్పూర్ మున్సిపల్ కార్యాలయానికి 1.20 ఎకరాలు (సర్వే నంబర్ 42/4) , జిల్లా కోర్టు కాంప్లెక్స్‌కు 5 ఎకరాలు (సర్వే నంబర్ 42/5), బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి ఎకరం (సర్వే నంబర్ 42/6), సెంట్రల్ మెడికల్ స్టోర్‌కు 1.02 ఎకరాలు (సర్వే నంబర్ 42/7), స్ట్రక్చర్స్, వెకంట్ (కోర్టు కేసు) ల్యాం డ్ 4.07 ఎకరాలు (సర్వే నంబర్ 42/8), స్ట్రక్చర్స్, వెకంట్ అండ్ ఎక్సెస్ ల్యాండ్ (పీ రాజాకిషన్ రావు) 3.22 ఎకరాలు (సర్వే నంబర్ 42/9), లోకల్ స్రీంకు 1.16 ఎకరాలు (సర్వే నంబర్ 42/10), స్ట్రక్చర్స్ అండ్ వెకంట్ ప్లాట్లు 0.37 ఎకరాలు (సర్వే నంబర్ 42/11), స్ట్రక్చర్స్ అండ్ వెకంట్ ప్లాట్లు 1.03 ఎకరాలు (సర్వే నంబర్ 42/12), మిషన్ భగీరథ ఓహెచ్‌ఆర్, వెకంట్ అండ్ కోర్టు కేస్ ల్యాండ్ 2.03 ఎకరాలు (సర్వే నంబర్ 42/13), స్ట్రక్చర్స్, వెకంట్ అండ్ ఇంటర్నల్ రోడ్స్ 1.13 ఎకరాలు (సర్వే నంబర్ 42/14), కెప్ట్ ఫాలో ల్యాండ్ (కోర్టు కేస్) అండ్ డ్రైన్ 4.02 ఎకరాలు (సర్వే నంబర్ 42/15), స్ట్రక్చర్స్, వెకంట్ అండ్ అసైన్డ్ ల్యాండ్ 8.32 ఎకరాలు (సర్వే నంబర్ 42/16), స్ట్రక్చర్స్ అండ్ ఇంటర్నల్ రోడ్స్ 6.30 ఎకరాలు (సర్వే నంబర్ 42/17), కోర్టు కేస్ అండ్ వెకంట్ ల్యాండ్ 7.30 ఎకరాలు (సర్వే నంబర్ 42/18), ఎన్‌క్రోచ్‌మెంట్ ఇన్ వెకంట్ ల్యాండ్ 0.30 ఎకరాలు (సర్వే నంబర్ 42/19), 60 ఫీట్ల వైడ్ సీసీ రోడ్ 6.13 ఎకరాలు (సర్వే నంబర్ 42/1), ఇలా మొత్తం 42 సర్వే నంబర్‌లో 102.10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్టు ల్యాండ్స్ అండ్ సర్వే డిపార్టుమెంటు, రెవెన్యూ అధికారులు ఇటీవల జరిపిన సర్వేలో గుర్తించారు.

కోట్ల విలువైన భూమిపైనే కబ్జాదారుల కన్ను 

కొందరు పేరు మోసిన నాయకులు, కబ్జాదారులు వారి పలుకుబడిని ఉపయోగించి గుంటలకు గుంటలు కబ్జా చేశారు. అంతేకాకుండా ఆ భూమిని అమాయకులకు ప్లాట్లుగా చేసి విక్రయించారు. అంతేకాకుండా దగ్గరుండీ అధికారులను మేనేజ్ చేస్తూ ఇంటి అనుమతులు సైతం ఇప్పించారు. ప్రభుత్వ మారడంతో సీన్ రివర్స్ అయ్యింది.

ప్రభుత్వ భూముల కబ్జాలపై దృష్టి సారించి ప్రత్యేకంగా ప్రభుత్వ భూములు సర్వే చేయాలని అధికారులను ఆదేశించడంతో అసలు కథ మొదలైంది. సర్వే చేసిన అధికారులు సర్వే నంబర్ 42లో ఏయే విభాగాలకు ప్రభుత్వం ఎంత కేటాయించింది, రోడ్లు, కబ్జాలు, అక్రమ నిర్మాణాలు ఎన్ని ఎకరాలలో జరిగాయో ల్యాండ్ అండ్ సర్వే డిపార్టుమెంటు, రెవెన్యూ అధికారులు సర్వే జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. 

కలెక్టరేట్ నిర్మాణంతో అందరి చూపు 

కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత అప్పటి బీఆర్‌ఎస్ అన్ని శాఖల జిల్లా కార్యాయాలు ఒకే చోట ఉంచాలనే ఉద్దేశంతో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణానికి శ్రీకారంచుట్టింది. మొదట హాజీపూర్ మండలంలోని గుడిపేట బెటాలియన్‌ను ఎంచుకోగా..  తర్వాత నస్పూర్‌లోని 42 సర్వే నంబర్‌ను ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలో నిర్మాణానికి పూనుకున్నారు.

దీనితో ఒక్కసారిగా ఆ భూమికి రెక్కలొచ్చాయి. ఆ భూమిని కబ్జా చేసేందుకు చుట్టుపక్కల వారు, నాయకులు ఇలా ఎవరు పడితే వారు ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టారు. ఆ సమయంలో అప్పటి అధికారులు సైతం అమ్యామ్యాలకు మరిగి ప్రభుత్వ భూమిలో విచ్చలవిడిగా ఇంటి నిర్మాణాలకు అనుమతినిస్తూ ఇంటి నంబర్లను కేటాయించారు. 

అక్రమ నిర్మాణాలపై అధికారులు దృష్టి

నాడు అక్రమ నిర్మాణాలకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చిన అధికారులు.. నేడు వాటిని కూల్చేందుకు నోటీసులు జారీచేయడం గమనార్హం. 42 సర్వేనంబర్‌లో 60 మందికిపైగా నోటీసులు అందజేసినట్టు సమాచారం. ఆక్రమించిన సుమారు 30 గుంటల ప్రభుత్వ భూమిని రియల్టర్, వ్యాపారి వద్ద కబ్జా నుంచి రికవరీ చేసిన అధికారులు.. అక్రమంగా నిర్మించిన ఐదం తస్తుల భవనాన్ని సైతం కూల్చివేశారు.

కాంగ్రెసేతర పార్టీల్లో ఉంటున్న ఇద్దరి నుంచి ప్రభుత్వ భూమిని తమ అధీనంలోకి తీసుకున్న అధికారులు.. తర్వాత మిన్నకుండిపోయారు. కేవ లం కక్ష సాధింపుతోనే ఈ కూల్చడాలు చేశారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. కోట్ల విలువ చేసే మరెన్నో ప్లాట్లు, భవనాలను అలాగే వదిలేయడం వెనుక కోట్ల రూపాయల లావాదేవీలు జరిగి ఉంటుందనే అనుమానాలను సైతం వ్యక్తం చేస్తున్నారు.