calender_icon.png 24 October, 2024 | 2:19 AM

వామ్మో కాలుష్యం.. చెంతనే నిర్మాణం

14-07-2024 12:05:00 AM

  1. భవన నిర్మాణాలకు జోరుగా అనుమతులు 
  2. పట్టించుకోని ప్రభుత్వం, ఆందోళనలో ప్రజలు

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 13 (విజయక్రాతి): ఆ ప్రాంతాల్లో బోరు వేస్తే గోదుమరంగులో నీరు వస్తుంది. చెరువులలో చేపలు కుప్పలు కుప్పలుగా మృత్యువాత పడుతున్నాయి. అక్కడ నివసించే ప్రజలు చర్మ, శ్వాస సంబంధ సమస్యలతో సతమతం అవుతున్నారు. వీటన్నింటికీ కారణం కాలుష్యం. గతంలో హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లోని పారిశ్రామికవాడలకు సమీపంలో వాయు కాలుష్యం మాత్రమే ఎక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం జలకాలుష్యం ఆ ప్రాంత ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

ఇటీవల పటాన్‌చెరువు ప్రాంతంలోని చిట్కుల్ చెరువులో టన్నుల సంఖ్యలో చేపలు ఒక్కసారిగా మృత్యవాత పడ్డాయి. పరిశీలించిన అధికారులు జలకాలుష్యమే కారణం అని తేల్చారు. నిబంధనలకు విరుద్ధంగా కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తున్న పరిశ్రమలపై కొరడా ఝులిపించాల్సిన పీసీబీ, తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండగా, ప్రభుత్వం కూడా భవిష్యత్తులో కలిగే అనర్థాలపై కనీస అవగాహన లేకుండా ఇష్టారీతిన ఇంటి అనుమతులను జారీ చేస్తోంది.

తరలిపోతాయనే ప్రచారంతో..

కాలుష్య పరిశ్రమలు ఔటర్ రింగ్ రోడ్డు దాటి వెళ్లిపోతాయని ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్లు కొనేటప్పుడు రియల్ సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు ఎంతో వినయంగా చెబుతారని, ఆ నిర్మాణాలు పూర్తయ్యాక అసలు విషయం తెలుస్తుందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏ సంస్థలు కాలుష్యాన్ని వదులుతాయో అందరికీ తెలిసినప్పటికీ, అటు ప్రజాప్రతినిధులు కానీ, ఇటు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కానీ పెద్దగా పట్టించుకోరు. కానీ అధికారులను గట్టిగా నిలదీస్తే.. పరిశ్రమల పక్కన ఇండ్లు, ఫ్లాట్లు ఎందుకు కొన్నారు? అని ఎదురుదాడి చేస్తున్నారని పటాన్‌చెరు, ఐడీఏ బొల్లారం, బాచుపల్లి, చెంగిచెర్ల వంటి ప్రాంతాల్లోని ప్రజలు వాపోతున్నారు. పారిశ్రామిక ప్రాంతాలకు దగ్గరలో ఫ్లాట్ల ధరలు పెరుగుతాయి. నేడే ఇలు/ప్లాటు కొనుక్కోండని రియల్టర్లు నమ్మబలుకుతున్నారు. కొందరు బిల్డర్లు అత్యాశకుపోయి ఏకంగా బహుళ అంతస్థుల నిర్మాణాలను ఆరంభించారు. ఫ్లాట్ల నిర్మాణం పెరగడంతో డిమాండ్ తగ్గుముఖం పట్టింది.

ఆకర్షనీయ ప్రకటనలతో..

అదిగో ఔటర్, ఇదిగో మెట్రో, పక్కనే ఎంఎంటీఎస్, ఇక్కడే హైవే అంటూ ఊదరగొట్టే ప్రకనలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో ప్లాట్లు కొనుగోలు చేసేవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని, సమీప భవిష్యత్తులోనే ఆ ప్రాంతంలో కాలుష్యం మరింత పెరిగే అవకాశం ఉందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామికవాడల నుంచి రసాయన కాలుష్యాల విడుదల సర్వసాధారణంగా మారింది. సాయంత్రమైతే చాలు ముక్కు పుటాలు అదిరేలా తన్నుకు వచ్చే ఘాటు వాసనలతో ప్రజలు హైరానా పడుతున్నారు. కానీ ఆయా ప్రాంతాల్లో ప్లాట్లు, ఇండ్లు నిర్మించి, విక్రయించి సొమ్ము చేసుకునే రియల్టర్లు మాత్రం కొత్తకొత్త ఎత్తుగడలతో సేల్ చేసుకొని పత్తాలేకుండా పోతున్నారు.