జిల్లా అదనపు కలెక్టర్‌కు బీఆర్‌ఎస్ నాయకుల వినతిపత్రం
మెదక్, మే 16 (విజయక్రాంతి) : వ్యవసాయానికి నీళ్లు ఇవ్వకుండా, పండించిన పంటను కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్నదని మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెళ్ల మల్లికార్జున్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి సూచనల తో గురువారం బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్‌కు రైతుల పక్షాన వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం వానకు తడుస్తుంటే పట్టించుకోని సర్కార్ తీరుచూసి గుండెమండిన అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారని ఆరోపించారు.
ఎన్నికలు ముగిసిన వెంటనే వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ అనడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతామని హెచ్చరించారు. రాష్ట్రంలో 90శాతం రైతులు దొడ్డు రకం వాటిని పండిస్తారని, రైతులను మోసం చేయడానికే సీఎం రేవంత్‌రెడ్డి సన్న వడ్లకు బోనస్ ఇస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిప్రతాన్ని అదనపు కలెక్టర్ రమేశ్‌కు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ బట్టి జగపతి, మాజీ రైతుబంధు అధ్యక్షుడు సోములు, మున్సిపల్ కౌన్సిలర్లు మామిళ్ల ఆంజనేయులు, నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మాయ మల్లేశం, జగన్, బాలరాజు, రైతులు రామయ్య, పవన్, నర్సింహారెడ్డి, యాదగిరి, గోపాల్ పాల్గొన్నారు.