calender_icon.png 23 December, 2024 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విండీస్ మహిళలు చిత్తు..

23-12-2024 12:14:51 AM

మొదటి వన్డేలో గెలిచిన భారత్ 

211 రన్స్‌తో ఘన విజయం

1-0 తేడాతో ముందంజ

వడోదర: వెస్టిండీస్ మహిళలతో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు 211 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 314 పరుగుల భారీ స్కోరు చేసింది.

భారీ లక్ష్య చేధనతో బరిలోకి దిగిన విండీస్ జట్టు ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. అసలు విండీస్ మహిళలు 100 పరుగుల మార్కు అయినా దాటుతారా లేదా అన్న తరు ణంలో టెయిలెండర్ ఫ్లెచర్ (24*) ఆదుకోవడంతో 103 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 

టాప్ గేర్‌లోనే మంధాన 

విండీస్‌తో సిరీస్ మొదలైనప్పటి నుంచి టాప్ గేర్‌లో దూసుకుపోతున్న స్మృతి మంధాన (91) ఈ మ్యాచ్‌లో కూడా రెచ్చిపోయింది. కొత్త అమ్మాయి ప్రతిక రావల్ (40) తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన మంధాన రెచ్చిపోయింది. ఈ జంట తొలి వికెట్‌కు 110 పరుగులు జోడించాక రావల్ పెవిలియన్‌కు చేరింది.

తర్వాత వచ్చిన డియోల్ (44) కూడా రెచ్చిపోవడంతో భారత స్కోరు బోర్డు జెట్ వేగంతో పరుగులు పెట్టింది. సెంచరీ చేసేలా కనిపించిన మంధాన చివరికి 91 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జేమ్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. తర్వాత వచ్చిన కెప్టెన్ కౌర్, రిచా ఘోష్, జెమీమా , దీప్తి శర్మ వేగంగా పరుగులు చేయడంతో భారత్ 300 పరుగుల మార్కును క్రాస్ చేసింది. 

ఆరంభంలోనే షాక్.. 

315 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన విండీస్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి బంతికే ఓపెనర్ జోసెఫ్ (0) బంతులేమీ ఎదుర్కోకుండానే రనౌట్‌గా వెనుదిరగ్గా.. మూడో ఓవర్లో మరో ఓపెనర్, కెప్టెన్ మాథ్యూస్ (0) కూడా పెవిలియన్‌కు చేరుకుంది. ఇక అక్కడి నుంచి వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లు పెవిలియన్‌కు క్యూకట్టడంతో భారత విజయం నల్లేరు మీద నడక అయింది. రేణుకా సింగ్ ఐదు వికెట్లతో మెరిసింది.

ఇప్పటికే టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న భారత్.. మూడు వన్డేల సిరీస్‌లో కూడా 1-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మంగళవారం రెండో వన్డే జరగనుంది. మరి సిరీస్‌పై విండీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. 5 వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించిన రేణుకాసింగ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.