లెబనాన్‌ను స్థ్థావరంగా చేసుకుని తమపై తరచూ దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాద సంస్థ హెజ్‌బొల్లా అంతమే లక్ష్యంగా గత కొద్ది రోజులుగా భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌కు భారీ విజయం లభించింది. శుక్రవారం రాత్రి దక్షిణ లెబనాన్‌లోని దహియా ప్రాంతంలో నివాస గృహాల కింద భూగర్భంలో ఉన్న హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై జరిపిన వైమానిక దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమైనట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) ప్రకటించింది.
‘నస్రల్లా ఇక ఈ ప్రపంచాన్ని ఉగ్రవాదంతో భయభ్రాంతులకు గురి చేయలేడు’ అంటూ ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. అటు ఇజ్రాయెల్ వార్‌రూమ్ కూడా దీనిపై స్పందించింది. ‘ఆపరేషన్ న్యూ ఆర్డర్ మిషన్’ విజయవంతమయినట్లు ప్రకటించింది. ఇది జరిగిన కొద్దిగంటలకే హెజ్‌బొల్లా నస్రల్లా మరణించినట్లు ధ్రువీకరించింది.
ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో నస్రల్లాతో పాటుగా ఆయన కుమార్తె, మరో ఆరుగురు మరణించినట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు వెల్లడించాయి. నస్రల్లా ఇదే కార్యాలయం లో కీలక సమావేశం నిర్వహిస్తున్నట్లు తమకు పక్కా సమాచారం వచ్చిందని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది.
నస్రల్లా హతమైనట్లు ప్రకటించిన వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఒక ప్రకటన చేస్తూ లెబనాన్‌లోని హెజ్‌బొల్ల్లా కంచుకోటను ధ్వంసం చేసేంత స్థాయి ఇజ్రాయెల్‌కు లేదని పేర్కొన్నారు. పశ్చిమాసియాలోని అన్ని ప్రతిఘటన శక్తులు హెజ్‌బొల్లాకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. మరోవైపు హెజ్‌బొల్లా స్థావరంపై దాడి చేస్తున్నట్లు ఇజ్రాయెల్ తమకు చెప్పలేదని, దాడి మొదలైన తర్వాత మాత్రమే తెలిసిందని అమెరికా ప్రకటించడం గమనార్హం.
లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఫ్రాన్స్ ప్రయత్నాలు సాగిస్తున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఇక ఆ యత్నాలు కొండెక్కినట్లే భావించాలి. తమ నాయకుడి హతమార్చిన ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుని తీరుతామని హిజ్‌బొల్లా ఇప్పటికే ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితి మరింత వేడెక్కింది.
32 ఏళ్ల వయసులోనే హెజ్‌బొల్లా పగ్గాలు చేపట్టిన నస్రల్లా ఆ సంస్థను తన హయాంలో కేవలం ఓ మిలిటెంట్ గ్రూపుగానే కాకుండా బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దాడు. ప్రపంచంలో ఏ ఉగ్రవాద సంస్థకూ లేని ఆయుధాలు, మానవ వనరులు దీనికి ఉన్నాయి. దాదాపు లక్ష రాకెట్లు, 50 వేలనుంచి లక్ష వరకు ఫైటర్లు ఉన్నట్లు చెబుతారు. హెజ్‌బొల్లా చీఫ్‌గా ఉన్న నస్రల్లా సాధారణంగా బయట కనిపించడు.
వీడియోలు, టీవీలద్వారానే సందేశమిస్తాడు. బీరూట్‌లోని పెద్ద భవనాల కింద సెల్లార్లలో ఆయ న ఉంటాడనే సమాచారం ఇజ్రాయెల్ వద్ద చాలా రోజులుగా ఉంది. బంకర్లను సాధారణ బాంబులు ఛేదించలేవు కనుక తాజా దాడి కోసం అప్పటి కే తమ వద్ద ఉన్న బంకర్ బస్టర్ జీబీయూ28ని రంగంలోకి దింపింది.
కొంతకాలం క్రితం వీటిని అమెరికానుంచి కొనుగోలు చేసింది. నస్రల్లా మృతి హెజ్‌బొల్లాతో పాటుగా దానికి అండగా ఉండే లెబనాన్, ఇరాన్‌కు కూడా పెద్ద ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నస్రల్లా వారసుడెవరనే చర్చ నడుస్తోంది. ఆ గ్రూపు రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించే హషీమ్ సఫీద్దీన్ నస్రల్లాను వారసుడిగా ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
తనకు బంధువయిన ఇతనికి నాయకత్వబాధ్యతలు అప్పగించేందుకు వీలుగా నస్రల్లా ఇతడిని తీర్చిదిద్దినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. మరోవైపు లెబనాన్‌లోకి తన బలాలను పంపించడానికి ఇరాన్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అదే జరిగితే మరో సారి 1981నాటి పరిస్థితులు పునరావృతమయ్యే ప్రమాదం ఉంది. అప్పట్లో ఇజ్రాయెల్‌తో పోరాడేందుకు లెబనా న్‌కు ఇరాన్ తన బలగాలను పంపించింది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా పరిణామాలు రాబోయే రోజుల్లో ఎలా మారుతాయో చూడాల్సి ఉంది.