calender_icon.png 8 October, 2024 | 4:55 AM

పశ్చిమాసియా రణరంగం

08-10-2024 01:49:13 AM

దాడుల తీవ్రతను పెంచిన ఇజ్రాయెల్

యూదు దేశంపైనా విరుచుకుపడిన హెజ్బొల్లా

హైఫా నగరంపై రాకెట్లను ప్రయోగించిన ఉగ్రసంస్థ

పదిమంది గాయపడినట్లు ప్రకటించిన ఇజ్రాయెల్

టెల్‌అవీవ్, అక్టోబర్ 7: ఇజ్రాయెల్‌పై హమాస్ కిరాతక దాడి చేసి సోమవారంతో ఏడాది పూర్తున వేళ పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హమాస్, హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ ఐడీఎఫ్ దళాలు దాడుల తీవ్రతను పెంచాయి. ఆదివారం రా త్రి నుంచి 30కిపైగా ప్రాంతాల్లో దాడులు చేసింది.

బీరుట్ పేలుళ్లతో దద్దరిల్లిపోయిం ది. అదే సమయంలో ఇజ్రాయెల్‌పై హెజ్బొ ల్లా రాకెట్ దాడులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్‌లోని మూడో అతిపెద్ద నగరమైన హైఫాపై సోమవారం ఉదయం ఫాదిx మిస్సైళ్లను హెజ్బొల్లా ప్రయోగించింది. ఈ పోర్ట్ సిటీలోని ఐడీఎఫ్ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా దాడులు చేసింది.

లెబనాన్ నుంచి దాదాపు 130 మిస్సైళ్లను ప్రయోగించారని, ఇందులో చాలావరకు రక్షణ వ్యవస్థ అడ్డుకోగా 5 రాకెట్లు తమ భూభాగాన్ని చేరుకున్నాయని ఐడీఎఫ్ ధ్రువీకరించింది. ఈ దాడుల కారణంగా నగరంలోని ఓ ప్రధాన రోడ్డు, రెస్టారెంట్, ఓ ఇల్లు ధ్వంసమయ్యాయని తెలిపింది. ఈ ఘటనలో పదిమంది గాయపడినట్లు పేర్కొంది.   

ఇజ్రాయెల్‌పైకి 26 వేల రాకెట్లు

హమాస్‌పై యుద్ధం ప్రకటించిన నాటి నుంచి గాజాలో 17 వేల మంది, ఇజ్రాయెల్‌లో 1,000 మంది ఉగ్రవాదులను మట్టు బెట్టినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. వీరిలో 30 మంది హమాస్ బెటాలియన్, 165 మంది కంపెనీ కమాండర్లు ఉన్నట్లు పేర్కొం ది. గాజాలో 40వేలకు పైగా లక్ష్యాలపై దాడులు చేశామని, 4,700 సొరంగ మార్గాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది.

అక్టోబర్ 8 నుంచి లెబనాన్‌లోని హెజ్బొల్లా కూడా తమపై దాడులు చేస్తోందని, తమ ఎదురుదాడుల్లో 800 మందిని మట్టుబెట్టామని, వీరిలో 90 మం ది టాప్ కమాండర్లు ఉన్నట్లు స్పష్టం చేసింది. మొత్తంగా 11 వేల హెజ్బొల్లా స్థావరాలను పేల్చినట్లు చెప్పింది.

ఈ ఏడాది వ్యవధిలో ఇజ్రాయెల్‌పై 26 వేల రాకెట్ల (గాజా 13,200.. లెబనాన్ నుంచి 12,400) తో దాడులు జరిగాయని తెలిపింది. యెమె న్, సిరియా, ఇరాన్ మిగిలినవి ప్రయోగించినట్లు ఐడీఎఫ్ తెలిపింది. వీటిని చాలా వరకు తమ రక్షణ వ్యవస్థ నిలువరించిందని తెలుపగా.. ఈ దాడుల్లో 728 మంది సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.       

ఆనాడు మేం విఫలమయ్యాం

గతేడాది అక్టోబర్ 7న హమాస్ దాడిపై ఇజ్రాయెల్ సైన్యం స్పందించింది. దాడిని నిలువరించడంలో తాము విఫలమైనట్లు ఆర్మీ చీఫ్ హెర్జి హలేవీ పేర్కొన్నారు. ఈ సుదీర్ఘ యుద్ధంలో సైనిక సామర్థ్యాలు, మానసిక, పోరాట శక్తిని పరీక్షిస్తుంది. నెలలు గడిచేకొద్దీ శత్రువుల పరిస్థితి ఘోరంగా మారుతోంది. అక్టోబర్ 7న ప్రజల భద్రతను నిర్వహించడంలో విఫలమయ్యాం.

ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలనుకునేవారు ఎప్పటికీ కోలుకోలేరు. వందల యుద్ధాలతో ఎంతో అనుభవాన్ని సంపాదించాం. హమాస్‌ను పూర్తిగా ఓడించాం. హెజ్బొల్లా కీలక నేతలు తుడిచిపెట్టుకుపోయారుఅని హలేవీ విడుదల చేసిన సందేశంలో పేర్కొన్నారు. గతేడాది అక్టోబర్ 7న హమాస్ బంధించిన యువకుడు ఇడాన్ స్టీవీ మరణించినట్లు వెల్లడించింది. అతని మృతదేహం హమాస్ వద్దే ఉందని తెలిపింది. హమాస్ చేతిలో ఇంకా 97 మంది బందీలు ఉన్నట్లు పేర్కొంది. 

అప్పుడే యుద్ధానికి ముగింపు

అక్టోబర్ 7 దాడికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆనాటి దాడిలో మరణించిన 1,200 మందికి సంతాప సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రసంగించారు. మరోసారి ఇలాంటి దాడులు జరగకుండా, పౌరుల భవిష్యత్తు దృష్ట్యా దేశ భద్రతలో వాస్తవ మార్పులు తీసుకువస్తాం. ఐడీఎఫ్, భద్రతా సిబ్బంది, రెగ్యులర్, రిజర్వ్, ఆర్మీ, పోలీస్, మొస్సాద్‌లోని సైనిక యోధుల వీరత్వానికి కృతజ్ఞతలు.

మీరు ప్రస్తుతం చేస్తోన్న పనిని పూర్తి చేయాలి. హమాస్ చేతిలో మిగిలిన బందీలను విడిపించాలి. మేం నిర్దేశించుకున్న అన్ని లక్ష్యాలను పూర్తి చేసినప్పుడే హమాస్‌పై యుద్ధాన్ని ముగిస్తాం. గాజాలో హమాస్ పాలనను కూల్చేస్తాం. హమాస్ చెరలో ఉన్న బందీలను సురక్షితంగా తీసుకొస్తాం. గాజా నుంచి భవిష్యత్తులో ఎలాంటి ముప్పు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం అని నెతన్యాహు చెప్పారు.