calender_icon.png 26 December, 2024 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిమ్జ్ భూముల్లో వెమ్ టెక్నాలజీస్

27-07-2024 03:19:19 AM

  1. రక్షణ రంగ ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు 
  2. వెయ్యి కోట్ల పెట్టుబడి, వెయ్యి మందికి ఉపాధి 
  3. ఐటీ మంత్రి శ్రీధర్‌బాబుతో సంస్థ ప్రతినిధుల చర్చలు

సంగారెడ్డి, జూలై 26 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా జహీరా బాద్ డివిజన్‌లోని న్యాల్‌కల్, ఝరాసంగం మండలాల పరిధిలో ప్రభుత్వం జాతీయ పారి శ్రామిక ఉత్పత్తి మండలి(నిమ్జ్) ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నది. అందుకు 17 గ్రామాల్లో 7,045 మంది రైతుల నుంచి 12,635 ఎకరాల భూసేకరణ ప్రభుత్వం చేపట్టింది.  నిమ్జ్‌కు సేకరించిన 12,635 ఎకరాల నుంచి 511 ఎకరాలను ప్రభుత్వం వెమ్ టెక్నాలజీస్ పరిశ్రమకు కేటాయించింది. వెమ్ టెక్నాలజీస్ పరిశ్రమ రక్షణ రంగ పరికరాలను ఉత్పత్తి చేయ నుంది. ఈ విషయమై గురువారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, ట్రాన్స్‌కో డైరెక్టర్ జగత్‌రెడ్డితో వెమ్ టెక్నాలజీస్ సీఎండీ వెంకటరాజు, సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు.

వెమ్ టెక్నాలజీస్ సంస్థ రూ.1,000 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. డిసెంబరు వరకు పరిశ్రమలో ట్రయల్ ప్రొడక్షన్ ఉత్పత్తి చేస్తామని మంత్రికి వివరించారు. ఈ క్రమంలోనే మొదటి దశలో 1,000 మందికి ఉద్యోగాలు కూడా కల్పించనున్నట్లు ప్రకటించారు. కాగా పరిశ్రమకు కేటాయించిన 511 ఎకరాల్లో 43 ఎకరాలకు సంబంధించి సమస్యలు ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్క రించాలని వెమ్ టెక్నాలజీస్ ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

అలాగే 33/11 కేవీ విద్యుత్తు సబ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్తు సబ్ స్టేషన్‌ను 4 నెలల్లోనే ఏర్పాటు చేస్తామని అధికారులు మంత్రికి తెలిపారు. వెమ్ టెక్నాలజీస్ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా నిమ్జ్‌లో పారిశ్రామికవేత్తల కోసం ఎయిర్ షిఫ్టుల నిర్మాణం చేశారు. రూ.100 కోట్లతో ప్రత్యేక రోడ్డును నిర్మించారు. నిమ్జ్‌కు రైలు మార్గాన్ని కూడా అనుసంధానం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. 

2022లో కేటీఆర్ భూమి పూజ 

నిమ్జ్‌లో రక్షణ రంగంకు చెందిన పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ 2022 జూన్‌లోనే భూమి పూజ చేశారు. భూ సేకరణ సమస్య ఉండడంతో పరిశ్రమ ఏర్పాటు పనులు జరగలేదు. ఇటీవలే హైకోర్టు తీర్పు ఇవ్వడంతో  రాష్ట్ర ప్రభు త్వం రైతులకు నష్టపరిహారం చెక్కులు అందజేస్తున్నది. దీంతో పరిశ్రమ పనులు ప్రారంభించేందుకు అధికారులు, పరిశ్రమ ప్రతినిధులు చర్యలు తీసుకుంటున్నారు.

నిమ్జ్‌లో నైపుణ్య శిక్షణ కేంద్రాలు 

జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి మండలిలో నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇంజినీర్లు, పర్యవేక్షణ అధికారులకు శిక్షణ ఇచ్చేందు కు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఉపాధి శిక్షణ కోసం ఐటీఐని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.