calender_icon.png 23 October, 2024 | 9:55 AM

రిబాకినా రై రై

09-07-2024 01:10:52 AM

  • క్వార్టర్స్ చేరిన కజకిస్థాన్ ప్లేయర్ 
  • స్వితోలినా, ఒస్టపెంక ముందంజ 
  • ముసెట్టి, మినార్ అదరహో

లండన్: సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ వింబుల్డన్ టోర్నీలో మాజీ చాంపియన్ ఎలినా రిబాకినా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌లో మంచి రికార్డు ఉన్న రిబాకినా.. సోమవారం మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 6 3 ఉన్న సమయంలో ప్రత్యర్థి కలిన్‌సాక్యా గాయం కారణంగా తప్పుకుంది. దీంతో వాకొవర్ లభించిన ప్రపంచ నాలుగో ర్యాంకర్ రిబాకినా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. తనకు అచ్చొచ్చిన మైదానంలో ఆడింది ఒక్క సెట్టే అయినా.. రిబాకినా అదరగొట్టింది. బలమైన సర్వీస్‌లకు తోడు.. అద్భుతమైన రిటర్న్‌లతో ప్రత్యర్థి ఉక్కిరిబిక్కిరి చేసింది. తక్కువ వ్యవధిలోనే ఏడు ఏస్‌లతో విజృంభించిన రిబాకినా.. 25 విన్నర్లు సంధించి శభాష్ అనిపించుకుంది.

ఓపెన్ ఎరాలో వింబుల్డన్‌లో అత్యధిక విజయాల శాతం నమోదు చేసుకున్న ప్లేయర్‌గా రిబాకినా నిలిచింది. గతంలో దిగ్గజ ప్లేయర్లు స్టెఫీ గ్రాఫ్, ఆన్ జోన్స్‌కు మాత్రమే ఇక్కడ 90 శాతం విజయాల రికార్డు ఉంది. ఇప్పుడు రిబాకినా వారి సరసన చేరింది. ప్రస్తుతం ట్రోఫీ బరిలో ఉన్న వారిలో అత్యుత్తమ ర్యాంక్ (4) రిబాకినాదే. ‘సర్వీస్ ఎంతగానో సహకరించింది. రూఫ్ మూసేసి ఉన్న సమయంలో గాలి ప్రభావం ఎక్కువగా లేకపోవడం కూడా నాకు కలిసొచ్చింది. ఇలాంటి పరిస్థితులు నా తరహా ఆటతీరుకు సరిగ్గా నప్పుతాయి.

నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా’ అని మ్యాచ్ అనంతరం రిబాకినా చెప్పింది. ఇతర మ్యాచ్‌ల్లో ఎలినా స్వితోలినా (ఉక్రెయిన్) 6 6 వాంగ్ జిన్‌యు (చైనా)పై, ఒస్టపెంక 6 6 పుతిన్సెవ (కజకిస్థాన్)పై విజయాలు సాధించారు.  అమెరికా యంగ్‌స్టర్, రెండోసీడ్ కోకో గాఫ్‌కు ప్రిక్వార్టర్స్‌లో 4 3 అమెరికాకే చెందిన నవర్రో చేతిలో పరాజయం పాలైంది. క్వార్టర్స్‌లో జాస్మిన్ పవోలినితో నవర్రో, లూలు సున్‌తో వెకిక్, రిబాకినాతో స్వితోలినా తలపడనున్నారు.

వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్

ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో.. కజకిస్థాన్ ప్లేయర్ ఎలినా రిబాకినా క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌లో రికార్డు స్థాయి విజయాలతో దూసుకెళ్తున్న ఈ మాజీ చాంపియన్‌కు ప్రిక్వార్టర్స్‌లో ప్రత్యర్థి నుంచి వాకొవర్ లభించడంతో ముందంజ వేసింది. రెండేళ్ల క్రితం వింబుల్డన్ ట్రోఫీ నెగ్గిన రిబాకినా.. ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌లో ఆడిన 20 మ్యాచ్‌ల్లో 18 నెగ్గి దిగ్గజాల సరసన చేరింది. మహిళల సింగిల్స్‌లో ఒస్టపెంక, స్వితోలినా కూడా క్వార్టర్స్‌లో అడుగుపెట్టగా.. పురుషుల సింగిల్స్‌లో ముసెట్టి, మినార్ ముందంజ వేశారు. 

ముసెట్టి ముందంజ

వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో ఇటలీ ప్లేయర్ల హవా సాగుతోంది. ఇప్పటికే ఇద్దరు (సిన్నెర్, జాస్మిన్) ప్లేయర్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరగా.. ఇప్పుడు లొరెన్జో ముసెట్టి మూడో బెర్త్ దక్కించుకున్నాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సోమవారం 25వ సీడ్ ముసెట్టి 4 6 6 6 పెర్రికార్డ్ (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. గ్రాండ్‌స్లామ్ చరిత్రలో ముసెట్టి క్వార్టర్ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. మరో మ్యాచ్‌లో అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా) 6 6 4 6 ఆర్థర్ ఫిల్స్ (ఫ్రాన్స్)పై గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. ఇక నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6 7 (7/4), 4 6 (3/7), 3 టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) చేతిలో పరాజయం పాలయ్యాడు.