calender_icon.png 30 April, 2025 | 7:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శభాష్ వైష్ణవి!

30-04-2025 12:35:16 AM

ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో స్టేట్ ఫస్ట్ వచ్చిన పేదింటి బిడ్డకు మంత్రి సన్మానం

హుస్నాబాద్, ఏప్రిల్ 29: నిరుపేద కుటుంబం నుంచి వచ్చి, తన అద్భుత ప్రతిభతో రాష్ట్ర స్థాయిలో మెరుపులు మెరిపించింది హుస్నాబాద్ బిడ్డ రాధారపు వైష్ణవి. సిద్దిపేట జిల్లా ఎన్సాన్ పల్లిలోని తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియెట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు 468 సాధించి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.

వైష్ణవి అసాధారణ విజయం గురించి తెలుసుకున్న రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ఆమె ఇంటికి వెళ్లి అభినందించారు. హుస్నాబాద్ లోని ఆమె నివాసంలో వైష్ణవితోపాటు ఆమె తల్లిదండ్రులను సత్కరించారు. ప్రభుత్వ గురుకుల కాలేజీలో చదివి ఇంతటి గొప్ప విజయం సాధించిన వైష్ణవిని చూసి మంత్రి ఎంతో మురిసిపోయారు.

ఈ సందర్భంగా ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. ‘మా హుస్నాబాద్ బిడ్డ వైష్ణవి తన అద్భుతమైన ప్రతిభతో 470కి 468 మార్కులు సాధించి, ఈ ప్రాంతంలోని విద్యార్థులందరికీ గొప్ప స్ఫూర్తిగా నిలిచింది. నేటి పోటీ ప్రపంచంలో నిరంతర శ్రమ, పట్టుదలతో చదివితే ఎలాంటి శిఖరాలనైనా అధిరోహించవచ్చని వైష్ణవి నిరూపించింది.

ఆమెకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వైష్ణవి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము‘ అని భరోసా ఇచ్చారు. పేదరికం ఆమె పట్టుదలను అడ్డుకోలేకపోయింది. వైష్ణవి సాధించిన ఈ అపూర్వ విజయం హుస్నాబాద్ ప్రాంతానికే కాకుండా, రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికీ ఒక గొప్ప సందేశం. కష్టపడి చదివితే ఎలాంటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని ఆమె నిరూపించింది.