19-03-2025 02:24:13 AM
హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): మూసీ ప్రక్షాళన జరగకుండా కొంతమంది ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నారని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ పునరుజ్జీవం చేసి తీరుతామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.
మూసీ పునరుజ్జీవన కార్యక్రమంపై మంగళవారం శాసనమండలిలో సభ్యులు మహేశ్‌కుమార్‌గౌడ్, టీ జీవన్ రెడ్డి, బల్మూరి వెంకట్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. మూసీ ప్రక్షాళనకు అన్ని పార్టీలు సహకరించాలని, డీపీఆర్ రూపకల్పనలో భాగస్వామ్యం కావాలని కోరారు.
హైదరాబాద్ నగర వాసులకు అత్యుత్తమ జీవన ప్రమాణాలను కల్పించాలన్నదే తమ సంకల్పమని, స్వచ్ఛమైన గాలి, నీటిని అందించేందుకే ప్రయత్నం చేస్తున్నామన్నారు. “మూసీ రివర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్”ద్వారా మూసీ ప్రక్షాళనను దశల వారీగా చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.
మూసీ ప్రక్షాళన పనుల్లో ఎలాంటి జాప్యం లేదని, డీపీఆర్ సిద్ధం అవుతోందన్నారు. మొదటి దశలో బాపుఘాట్ దగ్గర “గాంధీ సరోవర్ ప్రాజెక్ట్”’ పేరిట పనులు చేపడతామని, ఇందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ రెడీ అవుతోందన్నారు. కన్సల్టెన్సీ నుంచి నివేదిక అందిన తర్వాత రెండో దశ, మూడో దశ పనులపై నిపుణులను భాగస్వామ్యం చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
పేదలకు ఇబ్బందులు కలిగించం..
మూసీ పరీవాహక ప్రాంతంలో నివసించే పేదలకు ఇబ్బంది కలగకుండా వారిని ఒప్పించి.. వారి అపోహాలను తొలగించి.. తగిన ప్రత్యామ్నాయం చూపించే మూసీ ప్రక్షాళన చేపడతామని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. నమో గంగే, సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల మాదిరిగానే మూసీ ప్రక్షాళనకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని, కానీ.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.
గోదావరి నుంచి 2.5 టీఎంసీ నీటిని మూసీకి తరలించేందుకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని, కానీ కేంద్రం స్పందించడం లేదన్నారు. నిధుల కేటాయింపులో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తోందని, తెలంగాణ కూడా ఈ దేశంలోనే భాగమని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
మూసీ ప్రక్షాళనలో ఇళ్లు కోల్పోయే 309 మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పటికే ఇచ్చామని తెలిపారు. మూసీ ప్రక్షాళనలో ఉపాధి కోల్పోయే వారికి ప్రభుత్వం ఆర్థికంగా అండగా ఉంటుందన్నారు. చట్ట ప్రకారం నష్టపరిహారం అందజేస్తామని, ఎవరికీ అన్యాయం జరగదని తెలిపారు.
ఫ్యూచర్ సిటీ అథారిటీ ఏర్పాటు చేశాం..
ప్రస్తుతం దేశంలో ప్రణాళికాబద్ధమైన నగరంగా చండీగఢ్ గుర్తుకు వస్తుందని, రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ను కూడా అటువంటి నగరంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
శంషాబాద్ విమానాశ్రయం, ఓఆర్‌ఆర్ (ఔటర్ రింగ్ రోడ్)ను కేంద్రంగా చేసుకుని పట్టణీకరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా “ఫ్యూచర్ సిటీ” పేరిట ప్రత్యేక నగరాన్ని అన్ని హంగులతో నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు.
ఫ్యూచర్ సిటీ పరిధి రంగారెడ్డి జిల్లాకు చెందిన 7 మండలాల్లోని 56 రెవెన్యూ గ్రామాల పరిధిలోని 770 చ.కి.మీల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుందన్నారు. ఫ్యూచర్ సిటీని అన్ని సదుపాయాలతో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు “ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ”ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.