జిల్లా స్పెషల్ ఆఫీసర్ శశాంక
మేడ్చల్, జనవరి 17(విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా జిల్లా యంత్రాంగం పని చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్పెషల్ ఆఫీసర్, స్టేట్ ఫ్లాగ్ షిప్ ప్రాజెక్టు కమిషనర్ కె. శశాంక అన్నారు. శుక్రవారం జిల్లాలోని షామీర్పేట్ తహసిల్దార్ కార్యాలయంలో సంక్షేమ పథకాలపై జిల్లా కలెక్టర్ గౌతమ్ తో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల వారీగా క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించి సర్వే నంబర్ ప్రకారం వ్యవసాయ యోగ్యమైనదా, కాదా అనే స్పష్టతను గుర్తించి నివేదికను తయారు చేయాలని సూచించారు. ఫైనల్ గా తహసిల్దారు సమగ్ర నివేదికను పరిశీలించాలన్నారు. గుట్టలు, రాళ్లు, లేఅవుట్లు, కాలేజీలు, గోడౌన్లు, పౌల్ట్రీలు, ఇటుక బట్టీలు వంటి వాటిని వ్యవసాయేతర భూములుగా చూపించాలన్నారు.
గ్రామసభలు పక్కాగా నిర్వహించాలన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ఉపాధి హామీ పథకంలో 20 రోజులు పని చేసి, భూమి లేని వారు అర్హులన్నారు. వీరిని గుర్తించాలని సూచించారు. మండలంలోని అలియాబాద్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తురాలు పద్మ ఇంటికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి తూముకుంటకు వెళ్లి రేషన్ కార్డు సర్వేను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, తహసిల్దార్ యాదగిరి, డి ఆర్ డి ఓ సాంబశివరావు, జిల్లా వ్యవసాయ అధికారి చంద్రకళ, జిల్లా పౌరసరఫరాల అధికారి సుగుణబాయి, హౌసింగ్ పీడీ రమణమూర్తి, తూముకుంట మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్, ఎంపీడీవో మమతా బాయి పాల్గొన్నారు.