26-03-2025 12:48:55 AM
ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పెషల్ మానిటర్ డాక్టర్ యోగేష్ దూబే
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 25(విజయక్రాంతి) : అర్హులైన వారందరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అందించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ డాక్టర్ యోగేష్ దూబే అన్నారు. మంగళవారం హైదరాబాద్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ, దివ్యాంగుల సంక్షేమ శాఖ, ఉపాధి కల్పన, లీడ్ బ్యాంక్, ఎస్సి, ఎస్,టి బిసి సంక్షేమాధికారుతలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరుపై జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యద ర్శి జావిద్ ఆక్తార్‌లతో కలిసి సమీక్షించారు.
ఈ సందర్భంగా డా.యోగేష్‌దూబే మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లా సంక్షేమ పథకాల అమలులో ముందంజలో ఉందన్నారు. సంక్షేమ పథకాల అమలులో హైదరాబాద్‌ను దేశంలోనే ఆదర్శవంతమైన నగరం గా తీర్చిదిద్దాలన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించుటలో ఉపాధి కల్పన శాఖ ముఖ్య భూమిక పోషించాలని, యువతకు శిక్షణ కల్పించాలని ప్రభుత్వ మార్గద ర్శకాల ద్వారా జాబ్ మేళాలు నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పారు.
మహిళలు, వృద్ధులు అలాగే దివ్యాంగులకు అవగాహన కల్పిస్తూ వారి సమస్యలకు ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి పరిష్కారాలు చూపాలని అదేవిదంగా అర్హులైన వృద్ధులకు వృద్ధాప్య కార్డులు జారీ చేయాలని వారికి సంబంధించిన కేసులను సత్వ రమే పరిష్కరించాలని పేర్కొన్నారు. చైల్ కేర్ ఇన్స్టిట్యూషన్లలో సూచనల బాక్స్ పెట్టాలని సూచించారు. సఖి కేంద్రాలను సందర్శించాలని తెలిపారు.
సమావేశంలో డిడబ్ల్యుఓ అక్కేశ్వరరావు, ఎల్డిఎం సుబ్రహ్మణ్యం, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఆశన్న, డిటిడబ్ల్యూ ఓ కోటాజి, డిసిపి లావణ్య నాయక్, వయోవృద్ధుల శాఖ ఏడి రాజేందర్, ఉపాధి కల్పన అధికారి ఎ.వందన, కార్మిక శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, డిసిపిఓ శ్రీనివాస్,అధికారులు తదితరులు పాల్గొన్నారు.