* అధికారులు సమన్వయంతో పనిచేయాలి
* 26 నుంచి కొత్త సంక్షేమ పథకాలు అమలు
* ఉమ్మడి జిల్లా ఇంచార్జి
* మంత్రి కొండా సురేఖ
సంగారెడ్డి/ మెదక్/ సిద్దిపేట, జనవరి 15 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అరులైన వారికి అందించేలా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ తెలిపారు. బుధవారం ఢిల్లీ నుంచి గూగుల్ మీట్ ద్వారా సన్నాహక సమావేశాన్ని నిర్వహించి ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లకు పలు సూచనలు చేశారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమమే పరమావధిగా ఈ నెల 26 నుంచి అమలు చేయనున్న నూతన పథకాలను నిబద్ధతతో అమలు చేసి, ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని సూచిం చారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 26 జనవరి 2025 నాటికి 75 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేసేందుకు నిర్ణయించిందన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుకు సంబంధించిన పథకాల అమలు విధివిధానాలు, లబ్దిదారుల ఎంపిక, క్షేత్రస్థాయిలో తీసుకుంటున్న చర్యలు తదితర అంశాల పై మంత్రి కలెక్టర్లతో చర్చించారు.
రాజకీయ ప్రమేయం లేకుండా, మానవతా దృక్పథంతో పథకాల ప్రయోజనాలు పేద ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ పరంగా సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. భూ భారతి పోర్టల్ లో నమోదైన పట్టాదారులు మాత్రమే రైతు భరోసా పథకం కింద అందించే ఆర్థిక సహాయానికి అర్హులని కలెక్టర్లకు వివరించారు.
వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా అందేలా కఠినంగా విధివిధానాలను అమలు చేయాలని నిర్దేశించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలుకు కుటుంబాన్ని యూనిట్ తీసుకుంటున్నట్లు మంత్రి కలెక్టర్లకు తెలిపారు. జాబ్ కార్డుల వివరాలను మంత్రి సురేఖ ఆరా తీశారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో అత్యంత నిరుపేదలుగా గుర్తించిన వారికి మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు. గతంలో అమలు చేసిన మార్గదర్శకాల మేరకే రేషన్ కార్డుల జారీ ప్రక్రియను చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. ఒక వ్యక్తికి ఒకే చోట రేషన్ కార్డు వుండేలా చర్యలు తీసుకోవడంతో పాటు ‘వన్ రేషన్ వన్ స్టేట్’ గా రేషన్ కార్డులు జారీ ప్రక్రియను చేపట్టాలని సూచించారు.
నిరుపేద వర్గాలకు రేషన్ కార్డుల ద్వారా అందించే ప్రయోజనాలు వారి కుటుంబాలను నిలబెడతాయని ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, అర్హత వున్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు మంజూర కావాలని మంత్రి కలెక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా కొత్తగా అమలు చేసే పథకాలకు సంబంధించి ఎమ్మెల్యేలు హరీష్ రావు, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి తదితర ప్రజా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సురేఖ సమాధానమిచ్చారు.
జనవరి 26 నుంచి నూతన పథకాల అమలులో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అత్యుత్తమ పనితీరును కనబర్చాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహించినట్లు తన దృష్టికి వస్తే కఠిన చర్యలకు వెనుకాడనని హెచ్చరించారు. ఈ సమావేశంలో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట కలెక్టర్లు రాహుల్ రాజ్, క్రాంతి వల్లూరు, మను చౌదరి, నోడల్ ఆఫీసర్ హరి చందన, అదనపు కలెక్టర్లు మెంచు నగేశ్, చంద్రశేఖర్, మాధురి, ఉమ్మడి జిల్లాల అధికారులు, సిబ్బందిపాల్గొన్నారు.