కొండపాక, జనవరి 23: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26 నుండి ప్రారంభించనున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా ఈ పతాకాలకు లబ్ధిదారులను గ్రామ ప్రజల సమక్షంలో ఎంపిక చేస్తున్నారు. జప్తి నాచారం గ్రామసభలో సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ లబ్ధిదారుల జాబితాలో పేర్లు రాని వాళ్లు ఆందోళన చెందవద్దని ఇది నిరంతర ప్రక్రియ అని గ్రామ సభలో నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఏర్పాటు చేసిన కౌంటర్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జప్తి నాచారం గ్రామపంచా యతీ కార్యదర్శి రాణి, మండల ఏ ఓ శివరామకృష్ణ, వివిధ శాఖల అధికారులు, సిద్దిపేట జిల్లా ఐఎన్ టి యూ సి అధ్యక్షులు రవీందర్ గౌడ్, నర్సింలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
తూతూ మంత్రంగా సాగిన గ్రామసభ
కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులకు అందకుండా అనర్హులకు అందుతున్నాయని, అనర్హులకే అధికారులు పట్టం కడుతున్నారని అంకిరెడ్డిపల్లి గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల గురించి ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకున్న అర్హులకు అందలేదని, ఇంకా ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకోవాలని అధికారులను నిలదీశారు.