కలెక్టర్ వెంకటేష్ దోత్రే...
కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీలో జిల్లాలో అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. ప్రజల దగ్గర నుండి సంక్షేమ పథకాలపై అభిప్రాయ సేకరణ సర్వేకు సంబంధించి కెరమెరి మండలం కొఠారి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో డిపిఓ బిక్షపతితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... గ్రామ సభల్లో చదువుతున్న జాబితాలో పేర్లు లేని లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మరోసారి ప్రజా పాలన సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. రైతు భరోసా కింద సాగు భూములకు మాత్రమే భరోసా మొత్తాన్ని అందజేయడం జరుగుతుందని తెలిపారు. రాళ్లగుట్టలు, వెంచర్లు, ప్లాట్లు లాంటి భూములను గుర్తించడం జరిగిందన్నారు.
భూమిలేని నిరుపేదలు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 20 రోజులపైగా పని చేసిన కుటుంబాలను గుర్తించడం జరిగిందని వీరికి సంవత్సరానికి 12 వేలు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రతి ఇంటికి అధికారులు సర్వే చేయడం జరిగిందని వివరించారు. దీని ప్రకారం అర్హులైన వారిని కానీ వారిని గుర్తించడం జరిగిందన్నారు. అర్హులైన వారి జాబితాను గ్రామసభలో గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి చదివి వినిపించడం జరుగుతుందని ఏదైనా అభ్యంతరాలు ఉంటే ప్రజలు తెలియజేయాలన్నారు. వాటిని సభలో నమోదు చేసి క్షేత్రస్థాయిలో మరోసారి అటువంటి వాటిపై సర్వే నిర్వహించడం జరుగుతుందని వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అంజద్ పాషా, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు.