ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి కలెక్టర్ బి.యం. సంతోష్
గద్వాల, జనవరి 21 ( విజయక్రాంతి ) : సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ స్పష్టం చేశారు. థరూర్ మండల కేంద్రంలోని మన్నాపురం గ్రామంలో, ధరూర్ మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ప్రజా పాలన గ్రామ సభలలో జిల్లా కలెక్టర్ స్థానిక శాసన సభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల గురించి గ్రామస్తులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, రెండు లక్షల రూపాయల రుణమాఫీతో పాటు రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ ను అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తెలిపారు.
మరో నాలుగు పథకాలైన రేషన్ కార్డులు, రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేయడం కోసం గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అన్ని సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో కృషి చేయడం జరుగుతుందని, ఈ సందర్భంగా జిల్లా అధికారులు మీ గ్రామానికి రావడం జరిగింది, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
గ్రామ సభ ఆమోదంతో లబ్ధిదారుల ఎంపిక చేయడం జరుగుతుందని ఇంకా దరఖాస్తు చేసుకొని వారు గ్రామ సభలో ఈరోజు సాయంత్రం వరకు దరఖాస్తు చేసుకుంటే పది రోజులలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులకు లబ్ధి చేకూర్చడం జరుగుతుందన్నారు.
గ్రామ సభలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు, జిల్లా ప్రత్యేక అధికారిని షకీలా భాను, ఎంపీడీవో మంజుల, తహసిల్దార్ వెంకట్రావు, వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతు, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.