13-02-2025 01:31:40 AM
ఎల్ అండ్ టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
చెన్నై: ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ‘భార్యను ఎంతసేపు చూస్తూ ఉండిపోతారు.. ఆదివారాలూ పనిచేయండి’ అంటూ గత నెలలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. వారానికి 90 గంటలు పనిచేయాలని తన ఉద్యోగులకు సూచించారు. ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సారి ఆయన కార్మికులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
నిర్మాణ రంగంలో కార్మికుల వలసలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే దీనికి కారణమని పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్రం చెన్నైలో జరిగిన సదస్సులో పాల్గొన్న ఆయన కార్మికుల కొరతపై మాట్లాడారు. ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య తగ్గడం పెద్ద సమస్య కాదని, కానీ కార్మికుల లభ్యత తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. ‘ఈ రోజుల్లో కార్మికులు అవకాశాల కోసం వలసలు వెళ్లడానికి ఇష్టపడట్లేదు.
బహుశా స్థానికంగా వారికి సంపాదన బాగానే ఉండొచ్చు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా కారణమయ్యి ఉండొచ్చు. వాటి వల్లే వేరే ప్రాంతాలకు వెళ్లి పనిచేయాలన్న ఆసక్తి తగ్గిపోతోంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం కార్మికుల్లోనే కాదు, వైట్ కాలర్ ఉద్యోగాల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోందని అన్నారు. తాను ఎల్ అండ్ టీలో ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరినప్పుడు మా బాస్ ఢిల్లీలో పని చేయాల్సి ఉంటుందని తనతో చెప్పారన్నారు. కానీ ఇప్పుడు ఓ వ్యక్తిని ఎవరైనా అలా అడిగితే ‘బై’ అంటూ వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు.