వలస ఆదివాసీలకు విద్యా వైద్యం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం..
మద్దుకూరు గ్రామసభలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్(District Collector Jitesh V. Patil) స్పష్టం చేశారు. మంగళవారం చంద్రుగొండ మండలం మద్దుకూరు గ్రామంలో నిర్వహిస్తున్న గ్రామ సభలలో కలెక్టర్ పాల్గొని ప్రజలకు, అధికారులకు పలు సూచనలు చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల గురించి గ్రామస్తులకు వివరించారు. ఈ పథకాల కింద అర్హులను గుర్తించేందుకు వీలుగా క్షేత్రస్ధాయి పరిశీలన నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. ముఖ్యంగా సాగుకు యోగ్యమైన భూములను పక్కాగా నిర్ధారించామని అన్నారు. పంటలు సాగు చేస్తున్న ప్రతి రైతుకు ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తుందని తెలిపారు.
ఇటుక బట్టీలు బ్రిక్స్ తయారీ కంపెనీలు, ఇతర కమర్షియల్ భూములకు రైతు భరోసా వర్తించదని ఆయన తెలిపారు. ఎవరైతే తిరిగి మళ్లీ ఆ భూముల్లో వ్యవసాయం చేస్తారో అప్పుడు వారికి కూడా రైతు భరోసా కల్పిస్తామన్నారు. అదేవిధంగా సాగుభూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రెండు విడతల్లో 12 వేల రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. ఎలాంటి సాగుభూమి లేకుండా కనీసం 20 రోజులు ఉపాధి హామీ పథకంలో పని చేసిన కుటుంబాలను అర్హులుగా గుర్తించామన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్ర పరిశీలన జరిపి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులను నిర్దారించామని తెలిపారు. ఈ మేరకు వివిధ పథకాల ద్వారా అర్హులుగా గుర్తించబడిన వారి వివరాలను గ్రామ సభలో అందరి సమక్షంలో చదివి వినిపించారు. రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తదితర పథకాల కోసం అర్హత కలిగిన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. ఆయా పథకాల కింద ఇప్పటివరకు దరఖాస్తులు చేసుకోని వారితో పాటు, అర్హత కలిగి లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని వారి నుండి కూడా అర్జీలు స్వీకరించారు. వాటిని సమగ్రంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
ఈ విషయంలో ప్రజలు ఎలాంటి అపోహలు, అనవసర ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు. గ్రామ సభలలో దరఖాస్తులు అందజేయవచ్చని, వీలుపడని వారు ఈ నెల 26 తరువాత ఎప్పుడైనా మండల కార్యాలయాలలోని ప్రజా పాలన సేవా కేంద్రాలకు వెళ్లి సంబంధిత పత్రాలను జాతచేస్తూ దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. వచ్చిన ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా పరిశీలించి అర్హులందరికీ సంక్షేమ పథకాలను వర్తింపజేస్తామని కలెక్టర్ భరోసా కల్పించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇప్పిస్తామని వచ్చే దళారులను నమ్మి మోసపోవద్దని కలెక్టర్ అన్నారు. వలస ఆదివాసీల అభివృద్ధి కోసం విద్యా వైద్యం ఉపాధి అవకాశాలను కల్పిస్తామన్నారు. ఆదివాసీలు పోడు పేరుతో అడవులు నరక వద్దని, నరికిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, తాసిల్దార్ బి.సంధ్యారాణి, ఎంపీడీవో బి. అశోక్, సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.