20-03-2025 02:04:55 AM
మహిళలకు పెద్దపీట
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా సంక్షేమానికి రూ.75,259 కోట్లు
తెలంగాణ జీఎస్‌డీపీ 16,12,579 కోట్లు
గతేడాదితో పోలిస్తే వృద్ధి రేటు 10.1 శాతం
తెలంగాణలో తలసరి ఆదాయం 3,79.751 కోట్లు
గతేడాదితో పోలిస్తే వృద్ధి రేటు 9.6 శాతం
జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణ
తలసరి ఆదాయం 1.8 రెట్లు ఎక్కువ
సంక్షేమం, అభివృద్ధి అనే జోడు గుర్రాలతో సుపరిపాలనా రథాన్ని పరుగులు పెట్టించాలన్న లక్ష్యం.. ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించే వ్యూహం.. తెలంగాణ రైజింగ్-2050 స్ఫూర్తి మంత్రంతో.. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీ ఉభయ సభల్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను రూ.3,04,965 కోట్ల అంచనాలతో ప్రకటించింది.
2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,91,159 కోట్లతో పద్దును ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఈసారి దానిని రూ. 13,806 కోట్లను పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఆరు గ్యారెంటీలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు పెద్దఎత్తున నిధులను కేటాయించింది.
ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా సంక్షేమానికి కలిపి రూ. 75,259 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అంతేకాదు ప్రతి పథకంలో మహి ళలకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొంది. ఆరు గ్యారెంటీలకు రూ. 56,084 కోట్లను ప్రతిపాదించింది.
ఫ్యూచర్ సిటీ, పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన, స్పీడ్ ప్రాజెక్టులను ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తిచేయాలని సంకల్పించింది. ఈ మేరకు మున్సిపల్ పట్టణాభివృద్ధి సంస్థకు రూ.17,677 కోట్లను కేటాయించింది. అలాగే, గతేడాది రుణమాఫీ ఉన్నందున వ్యవసాయం, కార్పొరేషన్ డిపార్ట్‌మెంట్‌కు రూ.49,383 కోట్లను కేటాయించిన సర్కారు ఈసారి రుణమాఫీ లేనందున వ్యవసాయ శాఖకు రూ.24,439 కోట్లు మాత్రమే కేటాయించింది. అలాగే, ఇరిగేషన్, హౌసింగ్, పోలీస్, పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి, విద్యా, వైద్య, ఆరోగ్య శాఖ, రోడ్డు, భవనాల విభాగంతో పాటు ఇతర ప్రాధాన్య శాఖలకు స్వల్పంగా నిధులను పెంచింది.
రూ. 8,06,298 కోట్లకు అప్పులు..
గతేడాది కంటే ఈసారి అప్పులను పెంచుకోవాలని సర్కారు భావించింది. గతేడాది రూ. 49,255.41 కోట్ల రుణాన్ని తీసుకోవాలని ప్రభుత్వం ప్రతిపాదించగా.. ఈసారి రూ.69,639 కోట్లను తీసుకో వాలని ప్రతిపాదించింది. ఇది రాష్ట్ర జీడీపీలో 28.1 శాతం కావడం గమనార్హం. అంటే గతేడాది కంటే ఈసారి అద నంగా రూ. 20,383. 59 కోట్లను సర్కారు అప్పుగా తీసుకోనుంది.
ఈ ఏడాది తీసుకునే అప్పులతో ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోని రుణాలు రూ.5,04,814 కోట్లుకు చేరు కుంటాయి. గ్యారంటీల కింద ఇదివరకు ఉన్న అప్పు రూ.3,01, 484 కోట్లు. ఈ రెం డు కలిపితే.. మొత్తం అప్పులు రూ.8,06, 298 కోట్లుకు చేరుతాయి. అదనంగా అప్పులను తీసుకోవాలని ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించింది.
రెవెన్యూ రాబడి గతేడాది రూ.2,02,107. 69 కోట్లు ఉండగా.. ఈసారి రూ.2,29,720.62 కోట్లుగా సర్కారు పేర్కొంది. మూలధన వ్యయం గతేడాది రూ.1,96,218.98 కోట్లుగా చెప్పిన ప్రభు త్వం ఈసారి రూ.2,26,982.29 కోట్లుగా అంచనా వేసింది. ద్రవ్యలోటు 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.54,009.74 కోట్లుగా ఉంటుందని సర్కారు పేర్కొంది. వడ్డీల కింద రూ.19,369.02 కోట్లు చెల్లించాలని బడ్జెట్‌లో అంచనా వేసింది.
సంక్షేమ రంగాలకు సర్కారు పెద్దపీట
బడ్జెట్‌లో రూ.78,582 కోట్ల కేటాయింపు
హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు మహిళా శిశు సంక్షేమం, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి సర్కారు భారీగా కేటాయింపులు చేసింది. ఒకవైపు వివిధ రంగాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తూనే.. మరోవైపు సంక్షేమ రంగాలకు పెద్దపీట వేసింది.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అన్ని సంక్షేమాలకు కలిపి మొత్తం రూ.78,582 కోట్లు కేటాయించారు. గతం కంటే బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని నిరూపించుకుంది. బడ్జెట్‌లో మహిళా, శిశు సంక్షేమం, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రభుత్వం రూ.2,862 కోట్లు కేటాయించింది.
దళిత వర్గాల ప్రజల సంక్షేమం కోసం రూ.40,232 కోట్లు, గిరిజనవర్గాల అభివృద్ధికి రూ.17,169 కోట్లు కేటాయించారు. సామాజిక న్యాయం, సమానాభివృద్ధి పట్ల నిబద్ధతను నిలుపుకునేలా ఎస్సీ ఉప వర్గీకరణ చట్టం తీసుకొచ్చింది. గిరిజాన అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా ఇందిరా గిరిజల వికాసం అనే ప్రత్యేక పథకంతో పోడు భూములు సాగు చేసుకునేలా గిరిజన రైతులకు సౌర ఆధారిత పంపుసెట్ల ద్వారా సాగునీటిని అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించారు.
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 2023 ఆర్థిక సంవత్సరంలో సబ్‌ప్లాన్ చట్టం ప్రకారం ఖర్చు చేయాల్సిన నిధుల్లో ఎస్సీలకు సంబంధించి రూ.13,617 కోట్లు, ఎస్టీలకు సంబంధించి రూ.1,317 కోట్లను ఖర్చు చేయలేదు. ఈ వార్షిక బడ్జెట్‌లో ఆ నిధులను కూడా జమ చేసి ప్రకటించారు.
ఇక బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి రూ.11,405 కోట్లు, మైనార్టీల భద్రత, సంక్షేమానికి రూ.3,591 కోట్లు, ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ కింద సర్కార్ ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.3,683 కోట్లను బడ్జెట్‌లో కేటాయించింది.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబం
మంత్రి కొండా సురేఖ
యావత్ తెలంగాణ ప్రజల ఆకాం క్షలను ప్రతిబిం బిం చే విధంగా బడ్జెట్ ఉందని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నా రు. ఒక వైపు అభివృద్ది, మరో వైపు సంక్షేమాన్ని సమతుల్యత చేసే విధంగా బడ్జెట్ ఉందని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరే విధంగా ఉందని తెలిపారు. ఉపాధి కల్పనకు ఊతమిస్తూ మహిళా, యువత, దళితులు, గిరిజనుల సంక్షేమానికి దిక్సూచిలా ఉందని పేర్కొన్నారు.
పేదల సంక్షేమ బడ్జెట్: వీహెచ్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల సంక్షేమానికి దిక్సూచిగా ఉం దని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు పేర్కొన్నారు. రైతులు, యు వత, మహిళలు, దళిత, గిరిజనులతో పాటు వెనుకబడిన వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉందన్నారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమన్నారు.