calender_icon.png 8 January, 2025 | 6:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం

07-01-2025 07:54:34 PM

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు... 

మణుగూరు (విజయక్రాంతి): బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కొరకు ప్రభుత్వం పని చేస్తుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateshwarlu) అన్నారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల పరిధిలోని గ్రామ పంచాయతీలో మంగళవారం జరిగిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ముందుగా అమరారం గ్రామస్థులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు తిలకం దిద్ది, హారతులు పట్టి, పూలు చల్లుతూ భారీ జన సందోహంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా  గ్రామపంచాయతీలో రూ.20 లక్షల వెచ్చించి నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం అమరారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. సమీక్ష సమావేశంలో భాగంగా గ్రామంలో నెలకొన్న ప్రధాన సమస్యలు ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులపై రివ్యూ చేపట్టారు.

శాఖల వారీగా తమ పనుల పురోగతిని వివరించిన అధికారులు, పెండింగ్ పనులను, ఆయా పనుల జాప్యానికి గల కారణాలను వివరించారు. ప్రధానంగా కొత్తూరు గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని, గ్రామంలో రెండు వాటర్ ట్యాంకులు ఉన్నప్పటికీ శుభ్రం చేయడం లేదని, గేట్ వాల్ ల నిర్మాణం జరగలేదని ఆరోపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ.. అధికారులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై బాధ్యతాయుతంగా పనిచేసే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో లబ్ధిదారులు మధ్యవర్తులను దళారులను ఆశ్రయించవద్దన్నారు. ఎవరైనా పథకాల పేరు చెప్పి డబ్బులు అడిగితే తన దృష్టికి తీసుకురావాలన్నారు. నియోజకవర్గానికి ఫస్ట్ ఫేజ్ లో  3500 ఇల్లు మంజూరు వస్తున్నాయని, ఇవి కాక, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) చొరవతో అదనంగా మరో 1000 ఇల్లు మంజూరుకు ప్రతిపాదించినట్లు ఎమ్మెల్యే పాయం తెలిపారు. ఇప్పటికే మండలంలో ఇంద్ర మహిళ సర్వే 90 శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు.

ప్రతి నిరుపేదకు ఇల్లు మంజూరు చేస్తామని, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇల్లు దెబ్బతిన్న వారికి మొదటి ప్రాధాన్యతలో ఇల్లు కేటాయిస్తామన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల ఇళ్ళను ప్రారంభించినట్లు తెలిపారు. కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తూ, త్వరలోనే సన్న బియ్యం పంపిణీ కూడా సివిల్ సప్లై అధికారులు ఏర్పాటు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 56000 ఉద్యోగాలు కల్పించింది అని, అందులో భాగంగా ఉద్యోగాలు పొంది, ఈ మండలానికి వచ్చిన ఇద్దరు అధికారులను ఉదహరిస్తూ చూపించారు. నిరుద్యోగ యువతకు, పోటీ పరీక్షలు హాజరయ్య విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యేక భృతిని కల్పిస్తోందన్నారు. 

నియోజకవర్గ అభివృద్ధి, క్షేమం తనకు రెండు కళ్ళు అన్నారు. నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధిలో రాజీ పడబోనన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టి, అభివృద్ధికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, పినపాక మండల ప్రత్యేక అధికారి బీ తాతారావు, పంచాయతీరాజ్ డిఇ సత్యనారాయణ, తహశీల్దార్ నరేష్ ఎంపిడిఓ రామకృష్ణ, ఎంపీ ఓ వెంకటేశ్వరరావు, ఎంఈఓ కొమరం నాగయ్య, ఐకెపి ఎపిఎం జ్యోతి, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.